పురిటికష్టాలు
పురిటికష్టాలు
Published Fri, Jan 31 2014 12:04 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
గుంటూరు మెడికల్ ,న్యూస్‌లైన్ :పెద్దాసుపత్రిలోనే పడకలు లేవంటే ఇక పల్లెటూళ్లలోని ఆరోగ్య కేంద్రాల్లో మంచాలు కూడా ఉండవంటే నమ్మక తప్పదు. కాన్పుకోసం కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్ళేందుకు ఆర్థిక స్థోమతలేని పేదరోగులు ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. తీరా అక్కడకు వెళితే కనీసం మంచాన్ని కూడా ఇచ్చే స్థితిలే ప్రభుత్వ ఆస్పత్రులు లేవు. మంచాలను కొనేందుకు డబ్బులు లేవా అంటే ఉన్నాయి. వాటిని వైద్యాధికారులు తమకు లబ్ధి చేకూర్చే వాటి కోసం వినియోగిస్తున్నారు. జిల్లాకు జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్నాయి. వాటితో గర్భిణులు, బాలింతలకు ఎంతో చేసే అవకాశం ఉంది. స్వలాభమే తప్ప రోగుల సంక్షేమం పట్టని అధికారులు, వారి సమస్యలపై చొరవ చూపని ప్రభుత్వం వెరసి సర్కా రు దవాఖానాలకు వచ్చే వారికి పురిటికష్టాలు తప్పటం లేదు.
జీజీహెచ్‌లో..... సుమారు ఆరు జిల్లాల నుంచి జీజీహెచ్‌కు రోగులు వస్తుంటారు. కాన్పుల విభాగంలో 120 పడకలను కేటాయించినప్పటికీ ప్రతి రోజూ 200 మందికి పైగానే బాలింతలు వార్డులో ఉంటున్నారు. రోజూ 30కి పైగా కాన్పులు జరుగుతున్నాయి. ఒక్కో పడకపై ఇరువురు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పురిటినొప్పులకంటే పడకలు లేక బాలింతలు పడుతున్న కష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సరిపడా వైద్య సిబ్బంది కూడా లేకపోవటంతో వైద్య సేవల్లో జాప్యం జరుగుతోంది. రాత్రి వేళల్లో కాన్పుకోసం ఆస్పత్రులకు వచ్చేవారు తెల్లవార్లు వైద్యుల రాకకోసం ఎదురు చూస్తున్నారు. పురిటినొప్పులు తట్టుకోలేక బంధువులు కాన్పుచేయమని అడిగినా గోడు వినేవారు ఉండరు.
కాన్పుల నిపుణులు విధులకు డుమ్మా కొడుతూ పీజీ వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బందిపై భారం మోపుతున్నారు. గ్రామీణ, పురపాలక పట్టణ ఆస్పత్రుల్లో అర్హులైన, సమర్థులైన గైనకాలజిస్టులు లేకపోవటం, కాన్పుచేసే ఆపరేషన్ థియేటర్స్, ఇతర వైద్య పరికరాలు కూడా అలంకార ప్రాయంగానే ఉండటంతో వారంతా జీజీహెచ్‌నే ఆశ్రయిస్తున్నారు. రోజు రోజుకు కాన్పుల కోసం వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా పడకలను, వైద్యులను, సిబ్బందిని నియమించటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదు. పర్యవసానంగా సర్కారీ దవాఖానాల్లో పురిటికష్టాలు నానాటికి పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. కాన్పు అనంతరం బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా జీజీహెచ్‌లో ఉంటున్న కొందరు తల్లులు కటిక నేలపైనే ఉండాల్సివస్తున్నది. కాన్పుకు ముందు,తర్వాత కూడా కష్టాలు తప్పటం లేదు.
Advertisement
Advertisement