అభివృద్ధి పరుగులు పెట్టాలి
- సమగ్ర ప్రణాళికలు రూపొందించండి
- జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 14న కలెక్టర్ల సదస్సు నేపథ్యంలో మంగళ వారం సచివాలయం నుంచి ఆయన వీడి యో కాన్ఫరెన్‌స ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లాల్లోని ఆర్థిక, నీటి వనరులు, భౌగోళిక అంశాలు, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే ఐదేళ్లలో జిల్లాల స్వరూపం మారేలా ప్రణాళికలు ఉండాలని కలెక్టర్లకు సూచించారు. తమ జిల్లాల బలం, బలహీనతలు, వనరులు తదితర అంశాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అభివృద్ధికి ఎన్నారైల ద్వారా సహకారం పొందడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నో యువర్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా జిల్లా ప్రజల గురించి పూర్తిగా అవగాహన ఉండాలని, పూర్తి సమాచారంతో డాటాబేస్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు.
అవసరమైన చోట్ల కొత్త బ్యాంకులు
జిల్లాల్లో రోడ్‌నెట్‌వర్క్‌పై పూర్తి అవగాహనతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. రైల్వేస్టేషన్లు ఉన్న ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా స్థారుు ఇరిగేషన్ ప్రణాళికలను రూపొందించాలని, మిషన్ భగీరథ పనులపై దృష్టి పెట్టాలన్నారు. బ్యాంకింగ్ నెట్‌వర్క్ లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బ్యాంకుల ఏర్పాటు.. తదితర అంశాలపై నివేదికలు రూపొందించాలన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించి కేంద్రం అందించే ప్రోత్సాహకం అందుకోవడంలో జిల్లా కలెక్టర్లు ముందుండాలన్నారు. జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ మందికి ఉపాధి లభించేలా చూడాలని సూచించారు. మూతపడిన పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన సేవలు అందేలా చూడాలని పేర్కొన్నారు.