ఆరోగ్యశాఖకే రోగం వచ్చినట్లుంది!
ప్రభుత్వ ఆసుపత్రులు అవినీతికి అడ్డాలుగా మారాయ్: వంశీచంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు అవినీతికి అడ్డాగా, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా మారాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. శాసన సభలో మంగళవారం ఆరోగ్యశాఖ పద్దుపై ఆయన మాట్లాడుతూ.. గాంధీ, ఉస్మానియా ఆసుప త్రుల్లో విద్యుత్, నీటి సదుపాయాలు లేక ఆపరే షన్లు ఆపేశారని, ఉస్మానియాలోని న్యూరో సర్జికల్ యూనిట్‌లో వైద్యం అందక ఇటీవల ఐదుగురు మరణించారని పేర్కొన్నారు.
గాంధీ ఆసుపత్రిలో రూ.100 ఇస్తేనే వీల్‌చైర్ ఇస్తామని సిబ్బంది డిమాండ్ చేయడంతో చేసేది లేక తన కొడుకు టాయ్‌కార్‌పై ఆసుపత్రికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు. గవర్నర్ స్థాయిలో పట్టించుకుంటే మినహా బాధ్యులపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారని చెప్పారు. రోగమొస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే ప్రజలు భయపడుతున్నారని, వాస్తవానికి రాష్ట్ర ఆరోగ్యశాఖకే పెద్ద రోగం వచ్చిందన్నారు.
బీజేపీ, ఎంఐఎం అసంతృప్తి
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఛాతీ, మెటర్నిటీ ఆస్పత్రుల నిర్వహణ పట్ల బీజేపీ, ఎంఐఎం పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. బడ్జెట్ పద్దుల్లో భాగంగా వైద్యంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు లేరని, ఎక్స్‌రే, ఈసీజీ, మంచాలు, దుప్పట్లు లాంటి కనీస సదుపాయాలను సైతం ప్రభుత్వం కల్పించలేకపోయిం దన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం ఏమాత్రం లేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో వీల్ చైర్ కోసం కూడా లంచాలు ఇవ్వాల్సి రావడం బాధాకరమని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం పట్టుకుందని, రూ.250 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు చికిత్సలు నిలిపివేశాయన్నారు. వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షించాలని, కొత్త ఆస్పత్రిని నిర్మించాలని ఎంఐఎం సభ్యుడు మౌజం ఖాన్ డిమాండ్ చేశారు.
కడియం సీఎం కావాలి
ప్రతి అంశానికీ వివరణాత్మకంగా సమాధానం చెప్పేవాళ్లలో నాటి సీఎం రోశయ్య, నేటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉంటారని వంశీచంద్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ‘రోశయ్య సీఎంగా చేశారు. ఎలాగూ దళిత ముఖ్యమంత్రి హామీ ఉంది గనుక కడియం కూడా సీఎం కావాలని కోరుకుంటున్నాను’అని అన్నారు!