నిఘా కళ్లకు కలక! | Conjunctivitis intelligence to the eyes | Sakshi
Sakshi News home page

నిఘా కళ్లకు కలక!

Published Mon, Dec 22 2014 1:18 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

నిఘా కళ్లకు కలక! - Sakshi

నిఘా కళ్లకు కలక!

ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో పనిచేయని స్కైపీ వ్యవస్థ
రెండేళ్ల క్రితం 11 ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ప్రారంభం
జిల్లాకేంద్రం నుంచే ఆస్పత్రుల పనితీరు పరిశీలనకు అవకాశం
సత్ఫలితాలివ్వడంతో పీహెచ్‌సీలకు విస్తరింపచేసేందుకు సన్నాహాలు
ఈలోగానే నిఘా వ్యవస్థను ఆవరించిన నిర్లక్ష్యపు మత్తు
కొన్నాళ్లుగా మూలకు చేరిన విలువైన పరికరాలు
ప్రత్యక్ష పర్యవేక్షణ లోపించి.. ఆస్పత్రుల సేవలు యథాస్థితికి

 
ప్రభుత్వ ఆస్పత్రులకు నిత్యం రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వారందరికీ తక్షణ వైద్యం అందజేయాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య సిబ్బందిదే. అయితే అన్ని ప్రభుత్వ శాఖల మాదిరిగానే ఇక్కడా నిర్లక్ష్యం, అవినీతి పాతుకుపోవడంతో పేద రోగులకు సర్కారీ వైద్యం గగన కుసుమంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని చెరిపేసేందుకు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన స్కైపీ అనే నిఘా వ్యవస్థ కూడా దాదాపు కనుమరుగైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఏరియా, సామాజిక ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యవహారాలను ఒకేచోట కూర్చొని టీవీ తెరపై వీక్షించడంతోపాటు.. అవసరమైతే డాక్టర్లు, రోగులతో మాట్లాడే అవకాశం ఉన్న ఈ అధునాతన నిఘా కళ్లకు నిర్లక్ష్యం అనే కలక సోకింది. ఫలితంగా వ్యవస్థ మసకబారింది. ఆస్పత్రుల తీరు యథాస్థితికి చేరుతోంది.
 
 పాలకొండ రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును నేరుగా పరిశీలించి ఎప్పటికప్పుడు సూచనలు అందించేందుకు రెండేళ్ల క్రితం జిల్లాలో ఏర్పాటు చేసిన స్కైపీ వ్యవస్థ(నిఘా) దాదాపు మూలకు చేరింది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఆస్పత్రిలోనూ ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు. అప్పట్లో జిల్లాలోని రెండు ప్రాంతీయ ఆస్పత్రులు, 9 సామాజిక ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్)తోపాటు కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ ఆస్పత్రుల పనితీరు, రోగులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన విలువైన కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు నిరుపయోగమయ్యాయి.
 
రోగులకు మెరుగైన సేవలే లక్ష్యంగా..
 
ఆస్పత్రుల పనితీరు మెరుగు పరిచి, రోగులకు ఉన్నత సేవలు అందించడమే స్కైపీ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం. 2012లో డీసీహెచ్‌ఎస్‌గా ఉన్న సి.సుధాకర్ దీన్ని ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. పలు జిల్లాల్లో అప్పటికే అమల్లో ఉన్న ఈ విధానానికి శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకారం చుట్టారు. దీనిపై కరీంనగర్‌లో శిక్షణ పొందిన ఆయన తొలుత వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలకొండ, టెక్కలి ఏరియా ఆస్పత్రులతో పాటు సోంపేట, బారువ, పాతపట్నం, పలాస, కోటబొమ్మాళి, నరసన్నపేట, రాజాం, రణస్థలం, ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రుల్లో మొదలు పెట్టారు. ఇందుకోసం నెలరోజుల వ్యవధిలో కంప్యూటర్లు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయించారు. వాటిని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంతో అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా జిల్లా కేంద్రం నుంచే ప్రతిరోజు అన్ని ఆస్పత్రుల పనితీరును పరిశీలించడ ం.. అవసరమైతే అప్పటికప్పుడు అక్క డ వైద్యులతో నేరుగా మాట్లాడి ఆరా తీయడం, రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం వంటి చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరగయ్యాయి.

 తగ్గిన అక్రమాలు
 
ఆడియో, వీడియో విజువల్స్ ద్వారా నేరుగా జిల్లా కేంద్రం నుంచి ఆయా ఆస్పత్రుల రోగుల నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఉండడంతో అక్రమాలకు చాలావరకు అడ్డుకట్ట పడింది. రోగుల నుంచి, ప్రసవాలకు వచ్చే గర్భిణుల నుంచి డబ్బులు దండుకునే సిబ్బంది చేతివాటానికి ఈ విధానం చెక్ పెట్టగలిగింది. ఏ సమయంలోనైనా కలెక్టర్ స్థాయి నుంచి ఉన్నతాధికారులు స్కైపీ వ్యవస్థ ద్వారా నేరుగా రోగులతో మాట్లాడే అవకాశం ఉందన్న భయం అటు వైద్యులు, ఇటు వైద్య సిబ్బందిలోనూ ఉండేది. సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా సేవల నాణ్యత పెరిగింది. ఫిర్యాదులు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో జిల్లాలో ఉన్న పీహెచ్‌సీలకు సైతం స్కైపీ నిఘాను విస్తరించాలని ఉన్నతాధికారులు భావించినా.. కొన్నాళ్లకే ఉన్న వ్యవస్థే పని చేయడం మానేయడంతో ఆ ప్రతిపాదన కూడా పెండింగులో పడింది.
 
ప్రస్తుతానికి పని చేయడం లేదు.. అంతే!
 
ఇన్ని మంచి ఫలితాలనిచ్చిన ఈ విధానం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవని వైద్య ఆరోగ్యశాఖ  సిబ్బందే చెబుతున్నారు. కారణమేమిటని అడిగితే.. సాంకేతిక సమస్యలు చెబుతూ ప్రస్తుతానికి పని చేయడం లేదు.. అని మాత్రమే చెబుతున్నారు. ఇదే విషయమై పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఆరా తీయగా కొన్నాళ్లుగా స్కైపీ వాడడం లేదని మాత్రమే సమాధానమిచ్చారు.
 
ఒక కంప్యూటర్ వద్ద  కూర్చొని జిల్లాలో ఉన్న అన్ని ఆస్పత్రుల నిర్వహణ తీరును పరిశీలించే అవకాశాన్ని వదులుకుని వే లకు వేలు ఖర్చు చేసి జిల్లా వ్యాప్తంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రులను పరిశీలించడం ఎంతో కష్టసాధ్యం. సమస్య ఉత్పన్నమైనప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ఫిర్యాదు చేసుకునే అవకాశం కూడా ప్రస్తుతం లేకపోయింది. నిఘా కొరవడడంతో ఆస్పత్రుల్లో సిబ్బంది ఆడిందే ఆటగా పాడిందే సాగుతోంది. ఇటీవల జిల్లాలో పలు ఆస్పత్రులను పరిశీలించిన డీసీహెచ్‌ఎస్ కూడా సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శం.
 
 సాంకేతిక సమస్యలను అధిగమిస్తాం

 స్కైపీ విధానం అన్ని ప్రాంతాల్లో అమల్లోనే ఉంది. అయితే సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం. ఇకపై స్కైపీ ద్వారా ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతోఆపటు పీహెచ్‌సీల కు కూడా ఈ విధానాన్ని విస్తరింపజేసేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
 -ఎం.సునీల, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement