ఇక ఆస్పత్రుల్లోనే ఆధార్ నమోదు
♦ పీహెచ్‌సీల్లో సిబ్బందికి శిక్షణ
♦ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి సన్నాహాలు
♦ జిల్లా వ్యాప్తంగా త్వరలో ప్రారంభం
ఒంగోలు: ఇక నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్ నమోదుతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేసేందుకు వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అవసరమైన సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసింది. పీహెచ్‌సీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రజలు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందించనున్నారు. గతంలో బిడ్డ పుట్టిన వెంటనే ఆయా గ్రామాల్లో, లేదా మున్సిపాల్టీల్లో సమాచారం అందించాల్సి ఉంది. అప్పుడు సంబంధిత అధికారులు బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేవారు.
ఇప్పుడు ప్రజలకు సేవలు చేరువ చేసేందుకు ఆసుపత్రిలో ప్రసవం జరిగిన వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. అలాగే ఆసుపత్రిలో మరణించినా వారికి కూడా మరణ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మరి కొద్ది రోజుల్లో పీహెచ్‌సీల్లో ప్రసవం అయిన వెంటనే శిశువుకు ఆధార్ నమోదుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ఇటీవల 56 మండలాల్లోని పీహెచ్‌సీల్లోని స్టాఫ్‌నర్స్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ కూడా పూర్తి చేశారు.
దీనికి సంబంధించిన సామగ్రి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను కూడా ప్రజలు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి చిన్నారి కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు కేవలం 60 శాతం లోపు ఆధార్ నమోదులున్నాయని వీటిని పెంచేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులంటున్నారు.
ప్రత్యేక శిక్షణనందించాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న కాన్పులకు వెంటనే జనన ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్నాం. వీటితో పాటు ఆధార్ నమోదుకు కూడా పీహెచ్‌సీల్లోని స్టాఫ్ నర్సులకు జిల్లా కేంద్రాల్లో శిక్షణనిచ్చారు. త్వరలో వాటికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. పీహెచ్‌సీల్లో బిడ్డ పుట్టిన వెంటనే ఆధార్ నమోదు చేయడం వలన ఉపయోగంగా ఉంటుంది.
- డాక్టర్ కె.రమాదేవి, దగ్గుబాడు