సాక్షి, గుంటూరు : ప్రభుత్వ వైద్యశాలల నుంచి పసికందులను మాయం చేస్తున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి సృష్టించే ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులు, ఆ తరువాత మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లోని ప్రసూతి విభాగాల్లో పసికందులను ఎత్తుకెళ్తున్న ఘటనలు తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రసవం భారంగా మారడంతో పేద, నిరుపేద గర్భిణులు ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇక్కడ భద్రత డొల్లతనంగా ఉండటం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడటంతో బాలింతలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ముఖ్యంగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లోని ప్రసూతి విభాగం నిత్యం గర్భిణులు, బాలింతలతో కిటకిటలాడుతూ ఉంటుంది. బెడ్‌లు సరిపోక ఒక్కో మంచంపై ఇద్దరు చొప్పున పసి బిడ్డలతో పడుకోవాల్సి వస్తోంది. ఈ విభాగంలోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొంటు న్నాయి. దీన్ని ఆసరా చేసుకున్న కొందరు పసికందులను ఎత్తుకెళ్లేందుకు తెగబడుతు న్నారు. జీజీహెచ్ ప్రసూతి విభాగంలో 2011- 2012లో గుర్తుతెలియని దుండగులు ఓ పసికందును ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనం కలిగించింది.
దుండగుల జాడ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. గత నెలలో కారంపూడి మండలం పేటసన్నిగండ్ల గ్రామానికి చెందిన అనూరాధ అనే మహిళ జీజీహెచ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రత్తిపాడుకు చెందిన రెహమూన్ అనే మహిళ ఆ బిడ్డను ఎత్తుకెళ్లడంతో కలకలం రేగింది.
వెంటనే బిడ్డ సహా సదరు మహిళ దొరకడంతో తల్లిదండ్రులు, అధికారులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా సోమవారం జీజీహెచ్ గైనకాలజీ వార్డు వద్ద రవితేజ అనే ఏడు నెలల బిడ్డను గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లినట్లు తల్లి ధనలక్ష్మి కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెల వ్యవధిలో జీజీహెచ్‌లో ఇద్దరు పసికందులను ఎత్తుకెళ్లిన సంఘటనలు జరగడంతో ప్రసూతి వైద్య విభాగంలోని గర్భిణులు, బాలింతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు.. బయటపడ్డ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం..
జీజీహెచ్‌లో 2010లో రూ. 14 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓ ఆపరేటర్‌ను నియమించి, ప్రతిరోజూ వీడియో రికార్డులను పరిశీలించేవారు. అయితే రానురాను ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవి పనికి రాకుండా పోయాయి. 2012లో బిడ్డ మాయమైంది. దీంతో ఉలిక్కి పడ్డ అధికారులు తిరిగి సీసీ కెమెరాలను బాగుచేయించారు. అయితే ఆపరేటర్ లేకపోవడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.
ఆసుపత్రిలో ఎలాంటి సంఘటన జరిగినా గుర్తించలేని దుస్థితి ఏర్పడింది. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సైతం అప్రమత్తంగా లేకపోవడంతో సోమవారం మరో బిడ్డ మాయమైంది. ఆసుపత్రిలో గేట్‌పాస్, స్టేపాస్, విజిటింగ్ పాస్‌లంటూ డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం చూపడం లేదు.
భద్రతను కట్టుదిట్టం చేస్తాం ...
జీజీహెచ్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తాం. సోమవారం జరిగిన ఘటనపై ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావును విచారణకు ఆదేశించాం. ఆయన నివేదిక అందించగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సీసీ కెమెరాల ఆపరేటింగ్ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాం. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతాం.
- డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్.