కంటి పరీక్షలు చేయించుకుంటున్న బాబు
పెనమలూరు (కృష్ణా జిల్లా): రాష్ట్రంలో ఇక పూర్తిస్థాయిలో ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యసేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల పాలన ప్రైవేటుకు అప్పగిస్తామన్నారు. శస్త్రచికిత్సలకు ప్రైవేటు వైద్యులను ఉపయోగిస్తామని చెప్పారు. విజయవాడ సమీపంలోని తాడిగడప గ్రామంలో ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో తేజ్ కోహ్లీ ఐ బ్యాంక్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో వైద్యరంగంలో మన రాష్ట్రానికి చెందినవారే అధికంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. నేడు చాలామంది వైద్యులు తిరిగి మన రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, అటువంటి వారందరికీ అమరావతిలో స్థానం కల్పిస్తామని అన్నారు. ఎల్.వి. ప్రసాద్ ఆస్పత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో ఏర్పాటు చేయడానికి వీలుగా భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో ప్రధానమంత్రి ఆరోగ్య బీమా..
త్వరలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ప్రధాన మంత్రి ఆరోగ్యబీమా పథకం అమలు చేయనుందని కేంద్రమంత్రి వెంకయ్య ప్రసంగిస్తూ తెలిపారు. వెంకయ్య అకాడమీ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషను, చిల్డ్రన్స్ ఐ హెల్త్‌కేర్ సెంటర్‌ను మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
అమరావతిలో ‘అమృత’ వైద్య వర్సిటీ
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మెగా వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలోని అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో కలసిన వర్సిటీ ప్రతినిధులు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు రిపోర్టును అందజేశారు. రూ.2,500 కోట్ల అంచనాతో విశ్వవిద్యాలయంతోపాటు 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నెలకొల్పుతామని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నెలకొల్పే ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రీసెర్చ్-హెల్త్‌కేర్ క్యాంపస్‌ను సైతం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎంను కలసిన వారిలో విశ్వవిద్యాలయం ప్రో చాన్స్‌లర్ డాక్టర్ ప్రేమ్‌నాయర్, అమ్మాజీ ల్యాబ్స్ డెరైక్టర్ భవానీ బిజ్‌లాని, కాలిఫోర్నియాకు చెందిన అమృత ఇంటర్నేషనల్ ప్రతినిధి శ్రీనివాస్ పోలిశెట్టి, భూలక్ష్మి సత్యసాయి, రఘు ఉన్నారు.