
పక్షవాతం.. జరభద్రం
గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి రోజూ 10 నుంచి 15మంది వరకు పక్షవాతానాకి గురైన రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో వీరి సంఖ్య అధికంగానే ఉంటుంది. కాలు, చేయి పనిచేయక వికలాంగ సర్టిఫికెట్‌కోసం జీజీహెచ్‌కు వచ్చే వారిలో పక్షవాత రోగులే అధికం.
ఈ వ్యాధి బారినపడిన సమయంలో సరైన అవగాహన లేక, మందులు వాడకుండా, ఎవరో చెప్పారని ఆకుపసర్లు మింగుతూ కాలయాపన చేయడం వల్ల శాశ్వతంగా వికలాంగులుగా ఉండాల్సి వస్తుందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. పక్షవాతంపై అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్ 29న ప్రపంచ పక్షవాత నివారణ దినం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వైద్యుల సూచనలివి..
- గుంటూరు మెడికల్
జీజీహెచ్‌లో ఉచిత వైద్యం
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పక్షవాతం బాధితులకు ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారు. అవుట్‌పేషేంట్ విభాగంలోని 10వ నంబర్ గదిలో ఈ వైద్యసేవలు లభిస్తున్నాయి. పక్షవాతానికి గురైన వారికి అత్యవసర వైద్యసేవల విభాగంలో 24 గంటలు వైద్యసేవలు లభిస్తాయి. వ్యాధి నిర్ధారణకు అవసరమైన సిటిస్కాన్, కలర్‌డాప్లర్ వైద్య పరికరాలు ఇక్కడ ఉన్నాయి.
కారణాలు.. లక్షణాలు
మెదడుకి వెళ్లే రక్తనాళం లేదా మెదడులోని రక్తనాళం గాని పూడుకుపోవటం వల్ల రక్తసరఫరా ఆగిపోతే పక్షవాతం వస్తుంది. మెదడులో కణుతులు, రక్తంలో కొవ్వు పదార్ధాల వల్ల, మెదడువాపు వచ్చే వ్యాధుల వల్ల, గుండెజబ్బుల వల్ల, స్థూలకాయుల్లోనూ వ్యాధి వస్తుంది.
వ్యాధి వచ్చినవారికి ఒకే వస్తువు రెండుగా కనబడటం, మాట తడబడి, అయోమయంగా మాట్లాడటం, మింగుడు పడకపోవటం, నీరుసరిగా తాగలేకపోవటం, కళ్లు, తల తిరగటం, అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, నడకలో తూలుడు, మూతి ఒకవైపునకు ఒంకరపోవటం, దృష్టి మందగించటం, కాళ్లు చేతులు ఉన్నట్టుండి బలహీన పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- డాక్టర్ శ్రీరామ ఆంజనేయులు,
న్యూరాలజిస్ట్, లైఫ్ హాస్పటల్
తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
రక్తపోటును, షుగర్‌ను అదుపులో పెట్టుకోవాలి. పొగ, మందు తాగకూడదు. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తినకూడదు. స్థూలకాయం ఉంటే తగ్గించుకోవాలి.
పక్షవాతంపై ప్రజలకు అవగాహన కల్పించి, పక్షవాతాన్ని నివారించాలనే లక్ష్యంతో మా ఆస్పత్రిలో స్ట్రోక్ యూనిట్‌ను 1996లో ఏర్పాటుచేశాం.
- డాక్టర్ పమిడిముక్కల విజయ, న్యూరాలజిస్ట్, లలితా హాస్పటల్
ఫిజియోథెరపితో ఎంతో ఉపయోగం...
పడిపోయిన కాలు, చెయ్యిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటంలో ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాలలో ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్నాం.
రోజూ సుమారు 70 మందికి పైగా వైద్యసేవలను పొందుతున్నారు.
ఆధునిక వైద్య విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చి పేదరోగులకు ఉచితంగా ఆధునిక ఫిజియోథెరపీ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నాం.
- డాక్టర్ బి.శివశిరీషా, సిమ్స్ కరస్పాండెంట్
వెంటనే డాక్టర్ వద్దకు వస్తే మేలు..
బాధితుడిని వ్యాధికి గురైన 3 గంటలనుంచి నాలుగు గంటలలోపు నరాల వ్యాధుల వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు.
ఎట్టి పరిస్థితిల్లోనూ నాటు వైద్యం జోలికి వెళ్లవద్దు.
మద్యం, ధూమపానం లాంటి చెడు వ్యసనాలు ఉంటే ఏ వయసులోనైనా రావచ్చు.
త్వరలోనే జీజీహెచ్‌లో స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఉన్నతాధికారులు అన్ని వసతులు కల్పిస్తే పక్షవాత రోగులకు త్వరలోనే మరింత మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తాం.
- డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి, జీజీహెచ్