పల్లె ‘నాడి’ పట్టడం లేదు.. | World health day on april 07 2024 | Sakshi
Sakshi News home page

పల్లె ‘నాడి’ పట్టడం లేదు..

Published Sun, Apr 7 2024 6:19 AM | Last Updated on Sun, Apr 7 2024 6:19 AM

World health day on april 07 2024  - Sakshi

వెనుకబాటులో గ్రామీణ వైద్య సేవలు

అసలు వైద్యానికే నోచుకోని పల్లెలూ ఉన్నాయి

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌:  ‘నా ఆరోగ్యం నా హక్కు’..   ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త నినాదమిది. ప్రతి వ్యక్తికి నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలు అందాలనేది డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యంగా నిర్దేశించి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ బాధ్యతను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించాలని, అప్పుడే ప్రజలకు మెరుగైన జీవనం అందుతుందని సూచిస్తోంది. దేశంలో ఆరోగ్య సేవలపై నివేదకను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా విడుదల చేసింది. ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట పేదలకు అరోగ్య సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల తీరు ఎంతో మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేరువేరుగా చూస్తే గ్రామీణ ప్రాంతంలో సేవలు బాగా వెనుకబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది.

పేదరికంతో సతమతం...
గ్రామీణ భారతంలో పేదలే ఎక్కువ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం నుంచి 47 శాతం మంది శస్త్రచికిత్సల కోసం రుణాలు తీసుకోవడం, అప్పులు చేస్తున్నారు. ఇక 20 శాతం నుంచి 28 శాతం మంది ఆర్థిక స్తోమత లేకపోవడంతో వైద్యానికే నోచుకోవడం లేదు. పట్టణ ప్రాంత జనాభాతో పోలీస్తే గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 64% మంది వయసు మీదపడకముందే మరణిస్తున్నారు. ఇక దేశ జనా భాతో పోలిస్తే 6లక్షల డాక్టర్ల కొరత ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

లక్ష్యాలు బాగున్నా...
ప్రజారోగ్యం కోసం ప్రభుత్వాలు భారీ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ వాటి ఆచరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలు వైద్య సేవల కోసం చేస్తున్న సగటు ఖర్చు జీడీపీలో 5.8శాతం కాగా, భారత్‌ మాత్రం 1%మాత్రమే ఖర్చు చేస్తోంది. 195 దేశాల్లో వైద్య సేవలపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ పలు కేటగిరీల్లో దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఆస్పత్రి ప్రసవాల్లో 125వ ర్యాంకు, శిశు మరణాల్లో 135వ ర్యాంకుతో భారత్‌ సరిపెట్టుకుంది.

కేటాయింపులు రెట్టింపు చేయాలి
వైద్య రంగానికి ప్రభుత్వాలు చేస్తున్న కేటాయింపులు రెట్టింపు చేయాలి. అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు లేకపోవ డంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కొరవడతున్నాయి. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, నేషనల్‌ కోఆర్డినేటర్‌ ఫర్‌ మెడికల్‌ టీచర్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement