సాక్షి, కరీంనగర్: కరీంనగర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఈ ఏడాది జూన్ 21న ఒకరికి చేయాల్సిన శస్త్రచికిత్స మరొకరికి చేసిన ఘటనకు సంబంధించి మంగళవారం జిల్లా ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులు విచారణ జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. డెలివరీ కోసం వచ్చిన ఓ గర్భిణి కేస్‌షీట్ ఆధారంగా సాధారణ చికిత్స కోసం వచ్చిన వీణవంక మండలం నర్సింగాపూర్‌కు చెందిన 7 నెలల గర్భిణి మాలతి పొట్ట కోసిన విషయం విధితమే.
బాధితురాలి కడుపులో కవలలు ఉండగా, ఒక శిశువు బాగాలేదని తెలిసి వైద్యం కోసం వచ్చింది. సర్వీస్ స్టిచెస్ వేస్తే ఇబ్బంది ఉండదని చెప్పిన వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే డెలివరీకి వచ్చిన గర్భిణికి సంబంధించిన కేస్‌షీట్ ఆధారంగా మాలతికి సర్జరీ చేసేందుకు పొట్ట కోశారు. అప్పటికే మాలతి అరుస్తూ తాను డెలివరీ కోసం రాలేదని, సర్వీస్ స్టిచెస్ కోసం వచ్చానని చెప్పడంతో తప్పును తెలుసుకొని, తిరిగి కుట్లు వేశారు. దీంతో మాలతి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన ఆమె కుటుంబసభ్యులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు పోలీసులను ఆశ్రయించారు.కలెక్టర్ ఆదేశాలతో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల స్థానిక వైద్యులచే విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు బాధ్యురాలిగా స్టాఫ్‌నర్సు మాధవిని తేల్చి, సస్పెండ్ చేశారు.
చదవండి: యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే..
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాబును కోల్పోయామని మరో బాబు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండటం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులను వదిలి నర్సుపై చేపట్టిన చర్యలపట్ల సంతృప్తి చెందని బాధితురాలి బంధువులు వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ను, హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.
చదవండి: కాలుష్యంతో కిరికిరి.. నిత్యం ఉక్కిరిబిక్కిరి
వారి ఫిర్యాదుతో జిల్లా ఆస్పత్రికి చేరుకున్న కమిషనర్ కార్యాలయ అధికారులు జరిగిన ఘటనపై డాక్టర్లు, నర్సులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అయితే అసలు దోషులకు శిక్షపడేలా చూడాలని మాలతి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment