కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోయినా ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆరోగ్యశ్రీ ప్రతినిధులతో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరో ఏడాది వరకు ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆర్టికల్ 10 ప్రకారం గతంలో పని చేసిన విధంగానే సంవత్సరం పాటు రోగులకు వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఏడాది వరకు సీమాంధ్ర రోగులు తెలంగాణలో.. తెలంగాణ రోగులు సీమాంధ్రలో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందవచ్చన్నారు.
ఆ మేరకు ఒప్పందం కుదిరిందన్నారు. రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన అవసరం లేదని, ఏడాది వరకు యథావిధిగా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య సేవల అనంతరం సంబంధిత బిల్లు క్లయిమ్‌లను ఆయా రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ మొత్తాలను రెండు రాష్ట్రాల కేటాయిస్తారన్నారు. ఈ విషయంలో రోగులకు అవగాహన కల్పించి వైద్యం అందించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లావాసులు యథావిధిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందవచ్చని తెలిపారు. జిల్లావాసులు కూడా హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఇందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆన్‌లైన్‌లో తగిన ఏర్పాట్లు చేశారన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరసింహులు, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ పుల్లన్న, ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన 16 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందుల్లేవు
Published Thu, May 29 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement
Advertisement