C. Sudarshan Reddy
-
పకడ్బందీగా మండల పాలకుల ఎన్నిక
ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలకు కలెక్టర్ ఆదేశం కర్నూలు(అర్బన్): ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జూలై 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాపరిషత్ సీఈఓ ఏ సూర్యప్రకాష్, డిప్యూటీ సీఈఓ యం జయరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నోటీసులను ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు తమ మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీలకు అందజేయాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు 4వ తేదీ ఉదయం 8 గంటలకంతా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకుని ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. 10 గంటల నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించి 12 గంటల్లోపు వాటిని పరిశీలించాలన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల తిరస్కరణకు సమయం ఇవ్వాలన్నారు. అనంతరం మండలాల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలని తెలిపారు. వివిధ కారణాల వల్ల కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ ఎన్నికను వాయిదా వేస్తు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కోఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి అదే మండలానికి చెందిన వారై ఉండాలని, అలాగే మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నికల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను సభ్యులు చేతులెత్తే పద్ధతిలో నిర్వహించాలన్నారు. విప్ ముందుగానే సభ్యులకు చదివి వినిపించాలి: రాజకీయ పార్టీలు విప్ జారీ చేయాలనుకుంటే ఎన్నికకు ఒక రోజు ముందే విప్‌ను ఆయా మండలాలకు చెందిన ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారులు ఎన్నిక జరగడానికి గంట ముందు సభ్యులకు చదివి వినిపించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్‌కు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశి ంచారు. ఇందుకు రాజకీయ నాయకులు కూడా సహకరించాలని కోరారు. -
దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి
కర్నూలు(కలెక్టరేట్) : దశలవారీగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిసి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ, కోడుమూరు-మంత్రాలయం రైల్వేలైన్ సర్వే వివరాలు తీసుకుని రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. కేంద్ర విద్యా సంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలు నెలకొల్పవచ్చు అనే దానిపై జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రలో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఇక్కడ పరిశ్రమలతో పాటు విద్యా సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి సమస్య పరిష్కారంపై తన వంతు కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జిల్లాకు 24 టీఎంసీల నీటిని కేటాయిస్తే 16 టీఎంసీలు మాత్రమే వస్తుందని, కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌తో చర్చించినట్లు అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, వీటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. -
తహశీల్దార్లకు పోస్టింగులు
కర్నూలు(కలెక్టరేట్): సాధారణ ఎన్నికలకు ముందు ఇతర జిల్లాలకు వెళ్లి తిరిగివచ్చిన తహశీల్దార్లకు కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం పోస్టింగులు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా నుంచి 43 మంది తహశీల్దార్లు ఏప్రిల్‌లో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లారు. వెళ్లిన 43 తహశీల్దార్లలో 42 మంది తిరిగి వచ్చి ఈనెల 2న పోస్టింగ్ కోసం కలెక్టర్ దగ్గర రిపోర్టు చేసుకున్నారు. వీరికి మంగళవారం పోస్టింగులు ఇచ్చిన కలెక్టర్ వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. 35 మందికి ఎన్నికల ముందు వరకు పనిచేసిన మండలాలకే తిరిగి తహశీల్దార్లుగా నియమించారు. 7 మందికి మాత్రం వివిధ కారణాల వల్ల పాత స్థానాలు కాకుండా కొత్త స్థానాలు కేటాయించారు. అంతేకాక జిల్లాలో పనిచేస్తున్న మరికొందరు తహశీల్దార్లను కూడా బదిలీ చేశారు. సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రమణరావును కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారిగా నియమించారు. ఇదివరకే రమణరావు పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి ఏఓగా పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో డీటీలుగా పనిచేస్తూ పదోన్నతిపై ఇతర జిల్లాలకు వెళ్లి వచ్చిన ముగ్గురిని తహశీల్దార్లుగా పోస్టింగులు ఇచ్చారు. పాత స్థానాల్లోకి వెళ్లింది వీరే... ఇతర జిల్లాల నుంచి తిరిగి వచ్చిన తహశీల్దార్లలో చంద్రావతి, బాలగణేశయ్య, శివరాముడు, శివశంకర్‌నాయక్, ఎ.బి.ఎలిజబెత్, బి.పుల్లయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, తులసినాయక్, పి.రామకృష్ణుడు, నిత్యానందరాజు, అనురాధ, ఆర్.రాముడు, ప్రియదర్శిని, విజయుడు, మునికృష్ణయ్య, నాగేంద్రరావు, శివరామిరెడ్డి, వెంకట రమేష్‌బాబు, ఇంద్రాణి, మాలకొండయ్య, రామసుబ్బయ్య, వై.వెంకటేశ్వర్లు, పద్మావతి, జెడ్.ఎం.ప్రసన్నన్, సుధాకర్, ఆనంద్‌కుమార్, శేషఫణి, అన్వర్ హుసేన్, గోపాల్‌రావు, ఉమామహేశ్వరి, ఈరన్న, చంద్రశేఖర్, బి.శ్రీనివాసరావు, బి.రామకృష్ణ, టి.దాస్, జయప్రకాష్‌లకు ఎన్నికలకు ముందువరకు పనిచేసిన మండలాలకే నియమించారు. -
పూర్తిస్థాయిలో మొదలైన గ్రీవెన్స్‌సెల్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: దాదాపు మూడు నెలల తర్వాత ప్రజాదర్బార్ పూర్తిస్థాయిలో జరగడంతో వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ పీడీ నజీర్‌సాహెబ్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌లు తమ శాఖలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొద్దిసేపు సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని వివరించారు. ఇంటి పట్టాలు ఇవ్వండి: గోస్పాడు మండలం బీవీనగర్‌లో కొన్నేళ్ల క్రితం చింతమానువనంలో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌కు ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించాను. - శ్రీనివాసరెడ్డి -
ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బందుల్లేవు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోయినా ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆరోగ్యశ్రీ ప్రతినిధులతో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మరో ఏడాది వరకు ఆరోగ్యశ్రీ సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆర్టికల్ 10 ప్రకారం గతంలో పని చేసిన విధంగానే సంవత్సరం పాటు రోగులకు వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రం విడిపోయిన రోజు నుంచి ఏడాది వరకు సీమాంధ్ర రోగులు తెలంగాణలో.. తెలంగాణ రోగులు సీమాంధ్రలో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందవచ్చన్నారు. ఆ మేరకు ఒప్పందం కుదిరిందన్నారు. రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన అవసరం లేదని, ఏడాది వరకు యథావిధిగా వైద్య సేవలు అందుతాయన్నారు. వైద్య సేవల అనంతరం సంబంధిత బిల్లు క్లయిమ్‌లను ఆయా రాష్ట్రాలకు పంపాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి బడ్జెట్ మొత్తాలను రెండు రాష్ట్రాల కేటాయిస్తారన్నారు. ఈ విషయంలో రోగులకు అవగాహన కల్పించి వైద్యం అందించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లావాసులు యథావిధిగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందవచ్చని తెలిపారు. జిల్లావాసులు కూడా హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఇందుకు అనుగుణంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆన్లైన్లో తగిన ఏర్పాట్లు చేశారన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహులు, పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ పుల్లన్న, ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన 16 ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పోలియో మహమ్మారిని తరిమేద్దాం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: చిన్నారులను జీవితాంతం నరకయాతనకు గురిచేసే పోలియో మహమ్మారిని సమాజం నుంచి తరిమేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించనున్న మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ మీదుగా రాజ్‌విహార్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్‌పోలియో వ్యాక్సిన్ వేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో నాలుగేళ్లుగా ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులతో పాటు ప్రోగ్రామ్ అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 5,05,576 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పల్స్‌పోలియో వ్యాక్సిన్ వేసేందుకు 6,60,000 డోసుల వ్యాక్సిన్‌ను సిద్ధంగా ఉంచామన్నారు. 19న 2,735 కేంద్రాల ద్వారా చుక్కల మందు వేయనున్నట్లు తెలిపారు. పల్స్‌పోలియో కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, తండాలు, గిరిజన ప్రాంతాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 15 మంది జిల్లా అధికారులతో పాటు 13 మంది ప్రోగ్రామ్ అధికారులు, 20 మంది ఎస్పీహెచ్వోలు, 85 మంది మెడికల్ ఆఫీసర్లు, 273 మంది సూపర్వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. 20, 21వ తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, కర్నూలు కార్పొరేషన్లో 22వ తేదీన కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ర్యాలీలో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు.రాజాసుబ్బారావు, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు, డీఐవో డాక్టర్ అనిల్‌కుమార్, మలేరియా నియంత్రణాధికారి హుసేన్‌పీరా, మాస్ మీడియా అధికారిణి రమాదేవి, డిప్యూటీ డెమో లక్ష్మీనర్సమ్మ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.