ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలకు కలెక్టర్ ఆదేశం
కర్నూలు(అర్బన్): ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జూలై 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లాపరిషత్ సీఈఓ ఏ సూర్యప్రకాష్, డిప్యూటీ సీఈఓ యం జయరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన నోటీసులను ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు తమ మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీలకు అందజేయాలన్నారు.
ప్రిసైడింగ్ అధికారులు 4వ తేదీ ఉదయం 8 గంటలకంతా మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకుని ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నారు. 10 గంటల నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించి 12 గంటల్లోపు వాటిని పరిశీలించాలన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల తిరస్కరణకు సమయం ఇవ్వాలన్నారు. అనంతరం మండలాల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాలని తెలిపారు.
వివిధ కారణాల వల్ల కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే ఆ ఎన్నికను వాయిదా వేస్తు సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కోఆప్షన్ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి అదే మండలానికి చెందిన వారై ఉండాలని, అలాగే మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నికల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను సభ్యులు చేతులెత్తే పద్ధతిలో నిర్వహించాలన్నారు.
విప్ ముందుగానే సభ్యులకు చదివి వినిపించాలి:
రాజకీయ పార్టీలు విప్ జారీ చేయాలనుకుంటే ఎన్నికకు ఒక రోజు ముందే విప్‌ను ఆయా మండలాలకు చెందిన ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారులు ఎన్నిక జరగడానికి గంట ముందు సభ్యులకు చదివి వినిపించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్‌కు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశి ంచారు. ఇందుకు రాజకీయ నాయకులు కూడా సహకరించాలని కోరారు.
పకడ్బందీగా మండల పాలకుల ఎన్నిక
Published Sun, Jun 29 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement