దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి
కర్నూలు(కలెక్టరేట్) : దశలవారీగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిని ఆయన చాంబర్‌లో కలిసి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ, కోడుమూరు-మంత్రాలయం రైల్వేలైన్ సర్వే వివరాలు తీసుకుని రైల్వే మంత్రిని కలుస్తామన్నారు.
కేంద్ర విద్యా సంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలు నెలకొల్పవచ్చు అనే దానిపై జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రలో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఇక్కడ పరిశ్రమలతో పాటు విద్యా సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నీటి సమస్య పరిష్కారంపై తన వంతు కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జిల్లాకు 24 టీఎంసీల నీటిని కేటాయిస్తే 16 టీఎంసీలు మాత్రమే వస్తుందని, కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌తో చర్చించినట్లు అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, వీటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు.