రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ | Clear the railway coach factory line | Sakshi
Sakshi News home page

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్

Published Fri, Jul 8 2016 3:30 AM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్

* మరో మూడు నెలల్లో పనులు ప్రారంభం
* చివరి సర్వే కోసం లక్నో నుంచి వచ్చిన నిపుణుల బృందం
* బృందంతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక

అలంపూర్ రూరల్: తెలంగాణ, ఏపీ సరిహద్దు అలంపూర్‌లో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ మంజూరైంది. దీని నిర్మాణానికి ఏపీ, తెలంగాణ ప్రాంతంలో 123 ఎకరాల భూములను గుర్తించారు. ఈ మేరకు గురువారం ఈ పనులకు సంబంధించి లక్నో నుంచి సీఏవో దినేష్‌కుమార్, సీఎంఈ సునీల్‌కుమార్, సీఈ సహాయకులు ఏకే సింగ్, కోచ్ ఫ్యాక్టరీ ఇన్‌చార్జ్, డిప్యూటి చీఫ్ ఇంజనీర్ ఏకే శర్మ, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్‌కే సింగ్,  సీనియర్ ఇంజనీర్ ఆఫ్ మెకానికల్ శర్మ  అలంపూర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. రైల్వే లైన్ స్థలంలో ఓ పారిశ్రామికవేత్త రోడ్డు వేసుకున్నారని.. ఆ రోడ్డును తొలగిస్తామని అధికారులు తెలిపారు.
 
వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక చొరవ...
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనుల టెండర్లు, ప్రాజెక్టు ఎస్టిమేషన్ పెండింగ్‌లో ఉండడంతో ఆదిలోనే బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి.  వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కేంద్రంతో సంప్రదింపు లు జరిపిన అనంతరం ఈ పనులకు  క్లియరెన్స్ వచ్చింది. దీంతో అలంపూర్ వచ్చిన  అధికారులతో ఎంపీ రేణుక కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడి, ప్లాన్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల పరిశీలనకు ఏపీ, తెలంగాణ ప్రాంతంలోని 123 ఎకరాల భూములు గుర్తించినట్లు చెప్పారు.

అందులో ఏపీలోని కర్నూలు జిల్లా దగ్గర గల పంచలింగాలలో 100 ఎకరాలు, తెలంగాణ అలంపూర్ రైల్వేస్టేషన్ వరకు మరో 23 ఎకరాలను గుర్తించినట్టు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ కోసం రైతుల దగ్గర తీసుకున్న భూములకు ఎకరాకు రూ.13 లక్షల 60 వేల చొప్పున నష్టపరిహారం అందజేసినట్టు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో రైతులకు రూ. 2 లక్షల 65 వేల చొప్పన నష్టపరిహారం అందజేస్తున్నట్టు రైల్వే అధికారులు బుట్టా రేణుకకు తెలియజేశారు. ఈ విషయమై కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ విషయాలను కలెక్టర్ పరిశీలనలోకి తీసుకుని.. మాట్లాడుతున్నారని ఎంపీకి వారు వివరించారు.
 
తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన
రైల్వే కోచ్ కోసం తెలంగాణ నుంచి కూడా చక్కటి స్పందన లభించిందని ఎంపీ తెలిపారు. మరో పది రోజుల్లో అంతా ఫైనల్ కానుందన్నారు. ప్రస్తుత పనులకు ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ పనులు ఇక వేగవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement