రాష్ట్ర ప్రభుత్వం భూపరిహారం డబ్బులు ఇవ్వకపోవటంపై మోదీ అసంతృప్తి
దీనిపై రైల్వే శాఖ పీఎంజీ సమావేశంలో చర్చ..రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు
వెంటనే పరిహారం బకాయిలు రూ.137 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాకబు చేయటంతో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో చకాచకా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న పరిహారం సొమ్ము విడుదలైంది. ఈ ప్రాజెక్టులో చివరి స్టేషన్ అయిన కొత్తపల్లి వరకు భూసేకరణ అంశం కొలిక్కి వచి్చంది. ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం భూమి త్వరలో రైల్వే అ«దీనంలోకి రానుంది. ఆమేరకు అన్ని భాగాలకు టెండర్లు పిలిచేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది.
ప్రధానమంత్రి ‘ప్రగతి’లో ఉండటంతోనే...
రైల్వే కీలక ప్రాజెక్టులు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ‘ప్రగతి’జాబితాలో ఉంటాయన్న విషయం తెలిసిందే. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు స్వయంగా ఆయన హాజరై భూమి పూజ చేసినందున దానిని కూడా అందులో చేర్చారు. దేశవ్యాప్తంగా ఆయన స్వయంగా హాజరై పనులు ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాలని ఇటీవల నిర్ణయించారు. ఇందులో భాగంగా మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు వివరాలు కూడా వాకబు చేసినట్టు తెలిసింది. సిద్దిపేట వరకు రైలు సేవలు మొదలు కాగా, ఆ తర్వాత సిరిసిల్ల స్టేషన్‌కు ముందు నుంచి భూసేకరణలో సమస్య నెలకొందని ఆయన దృష్టికి వెళ్లింది. భూసేకరణకు సంబంధించి అన్నితంతులు పూర్తి అయినా.. పరిహారం డబ్బులు మాత్రం విడుదల కాలేదని స్పష్టమైంది.
ఈ ప్రాజెక్టు భూసేకరణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కీలక ప్రాజెక్టుల్లో కూడా ఇలా జాప్యం జరగటం ఏంటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై రైల్వే శాఖ నిర్వహించే ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ)లో దీనిపై చర్చ జరిగింది. సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరవేయటంతో వెంటనే భూ పరిహారం నిధులు రూ.137 కోట్లు విడుదల చేసినట్టు రైల్వేవర్గాలు చెప్పాయి. వాటి పంపిణీకి చెక్కులు సిద్ధం చేస్తున్నారని, ఆ వెంటనే భూమి తమ స్వా«దీనం అవుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
మరో 72 కిలోమీటర్ల పని
ఈ ప్రాజెక్టు పూర్తి నిడివి 151 కిలోమీటర్లు. ఇందులో సిద్దిపేట వరకు 79 కి.మీ. మేర ట్రాక్ సిద్ధమై గతేడాది నుంచి రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. మిగిలిన 72 కి.మీ. పనులు ఇప్పుడు జరగాల్సి ఉంది. ఇందులో చివరి స్టేషన్ అయిన కొత్తపల్లిలో యార్డు, స్టేషన్ పనులు మరో మూడు నెలల్లో సిద్ధం కానున్నాయి. ఇందులో మానేరు నదిపై దాదాపు 2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. దిగువ నీటి ప్రవాహం ఆధారంగా పనులు జరుగుతాయి. మిగతా పనులు వేగంగానే పూర్తి కానుండగా, ఈ వంతెన పనులు మాత్రమే నెమ్మది గా జరుగుతాయి. మరో మూడేళ్లలో ప్రాజెక్టు పను లన్నీ పూర్తవుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment