Manoharabad - Kothapalli
-
ప్రధాని వాకబుతో ‘మనోహరాబాద్’ రైల్వేలైన్ చకచకా!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాకబు చేయటంతో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో చకాచకా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న పరిహారం సొమ్ము విడుదలైంది. ఈ ప్రాజెక్టులో చివరి స్టేషన్ అయిన కొత్తపల్లి వరకు భూసేకరణ అంశం కొలిక్కి వచి్చంది. ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం భూమి త్వరలో రైల్వే అ«దీనంలోకి రానుంది. ఆమేరకు అన్ని భాగాలకు టెండర్లు పిలిచేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి ‘ప్రగతి’లో ఉండటంతోనే... రైల్వే కీలక ప్రాజెక్టులు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ‘ప్రగతి’జాబితాలో ఉంటాయన్న విషయం తెలిసిందే. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు స్వయంగా ఆయన హాజరై భూమి పూజ చేసినందున దానిని కూడా అందులో చేర్చారు. దేశవ్యాప్తంగా ఆయన స్వయంగా హాజరై పనులు ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాలని ఇటీవల నిర్ణయించారు. ఇందులో భాగంగా మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు వివరాలు కూడా వాకబు చేసినట్టు తెలిసింది. సిద్దిపేట వరకు రైలు సేవలు మొదలు కాగా, ఆ తర్వాత సిరిసిల్ల స్టేషన్‌కు ముందు నుంచి భూసేకరణలో సమస్య నెలకొందని ఆయన దృష్టికి వెళ్లింది. భూసేకరణకు సంబంధించి అన్నితంతులు పూర్తి అయినా.. పరిహారం డబ్బులు మాత్రం విడుదల కాలేదని స్పష్టమైంది.ఈ ప్రాజెక్టు భూసేకరణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కీలక ప్రాజెక్టుల్లో కూడా ఇలా జాప్యం జరగటం ఏంటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై రైల్వే శాఖ నిర్వహించే ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ)లో దీనిపై చర్చ జరిగింది. సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరవేయటంతో వెంటనే భూ పరిహారం నిధులు రూ.137 కోట్లు విడుదల చేసినట్టు రైల్వేవర్గాలు చెప్పాయి. వాటి పంపిణీకి చెక్కులు సిద్ధం చేస్తున్నారని, ఆ వెంటనే భూమి తమ స్వా«దీనం అవుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. మరో 72 కిలోమీటర్ల పని ఈ ప్రాజెక్టు పూర్తి నిడివి 151 కిలోమీటర్లు. ఇందులో సిద్దిపేట వరకు 79 కి.మీ. మేర ట్రాక్ సిద్ధమై గతేడాది నుంచి రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. మిగిలిన 72 కి.మీ. పనులు ఇప్పుడు జరగాల్సి ఉంది. ఇందులో చివరి స్టేషన్ అయిన కొత్తపల్లిలో యార్డు, స్టేషన్ పనులు మరో మూడు నెలల్లో సిద్ధం కానున్నాయి. ఇందులో మానేరు నదిపై దాదాపు 2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. దిగువ నీటి ప్రవాహం ఆధారంగా పనులు జరుగుతాయి. మిగతా పనులు వేగంగానే పూర్తి కానుండగా, ఈ వంతెన పనులు మాత్రమే నెమ్మది గా జరుగుతాయి. మరో మూడేళ్లలో ప్రాజెక్టు పను లన్నీ పూర్తవుతాయని భావిస్తున్నారు. -
2022 మార్చిలో సిద్దిపేటకు రైలు కూత
సాక్షి, హైదరాబాద్ : 2022 మార్చి.... తెలంగాణలోని కీలక పట్టణం సిద్దిపేట రైల్వే మార్గం ద్వారా రాజధాని హైదరాబాద్‌తో అనుసంధానం కాబోతోంది. కొత్తగా చేపట్టిన మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో రెండో దశ పనులు పూర్తయి 2022 మార్చిలో సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అడ్డంకులు అధిగమించి పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ సుంచి 31 కి.మీ. దూరంలోని గజ్వేల్ వరకు పనులు పూర్తయ్యాయి. ఇక్కడి వరకు రైలు నడుపుకోవటానికి రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. జూన్ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ పూర్తి చేసి రైలు సర్వీసులకు అనుమతి మంజూరు చేశారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల మేరకు కొన్ని నిర్ధారిత మినహా సాధారణ రైళ్ల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో రైలు సేవలు ఇంకా మొదలుకాలేదు. ఈ నిబంధనలు సడలించగానే గజ్వేల్ వరకు రైలు సేవలు మొదలుకానున్నాయి. గజ్వేల్ వరకు పనులు పూర్తి కావడంతో ప్రాజెక్టు రెండో దశలో భాగంగా సిద్దిపేట వరకు పనులు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు ఎర్త్‌వర్క్‌ను దాదాపు పూర్తి చేసింది. అదే సమయంలో వంతెనల పనులు కూడా జరుపుతోంది. ఇవి వేగంగా సాగుతున్నాయి. కరోనా వల్ల కూలీల కొరత, రైల్వే శాఖ ఆదాయం పడిపోవడంతో పనుల్లో కొంత జాప్యం తప్పలేదు. త్వరలో వాటిని అధిగమించి వేగంగా పనులు పూర్తి చేయనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో వాటిపై చర్చించారు. ‘కొన్ని అడ్డంకులు ఉన్నా పనులు వేగంగానే సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన సిద్దిపేట వరకు ఎట్టి పరిస్థితిలో 2022 మార్చి నాటికి రైలు సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, దానికి తగ్గట్టుగానే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం’అని డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ధర్మదేవరాయ్ పేర్కొన్నారు. నాలుగు స్టేషన్లు.. 52 వంతెనలు.. గజ్వేల్ నుంచి సిద్దిపేట మధ్యలో నాలుగు స్టేషన్లు ఉండనున్నాయి. గజ్వేల్ తదుపరి కొడకండ్ల, లక్డారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్లుంటాయి. మధ్యలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 52 వంతెనలు ఉంటాయి. వాటిల్లో ఐదు పెద్దవి. కుకునూర్‌పల్లి పోలీసు స్టేషన్ వద్ద రాజీవ్ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేస్తుంది. ఇక్కడ నాలుగు వరుసలతో పెద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. రైలు మార్గం కింది నుంచి ఉండనుండగా వాహనాలు వంతెన మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. త్వరలో ఈ పనులు మొదలవుతాయి. నేడు సికింద్రాబాద్ టు గజ్వేల్ రైలు పరుగు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గజ్వేల్ వరకు పూర్తిస్థాయి రైలు బుధవారం పరుగుపెట్టనుంది. దీంతో సాధారణ రైలు సేవలు అధికారికంగా ప్రారంభించినట్టు కానుంది. సాధారణంగా కొత్త రైల్వే మార్గంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ పూర్తయి పచ్చజెండా ఊపిన తర్వాత 90 రోజుల్లో రైలు సేవలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత రైళ్లు ప్రారంభం కాని పక్షంలో.. మళ్లీ రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ చేసి అనుమతించిన తర్వాతగానీ రైళ్లను ప్రారంభించే అవకాశం లేదు. గత జూన్‌లో ఈ మార్గంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ తనిఖీ చేసి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. రైలు సేవలు మొదలుకావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందుకు వీలు లేకుండా పోయింది. దీంతో బుధవారం ఓ సాధారణ ప్రయాణికుల రైలును నడపటం ద్వారా అధికారికంగా సేవలు ప్రారంభించినట్టు రికార్డు చేయాలని రైల్వే నిర్ణయించింది. -
‘కూత’కు వేళాయె
గజ్వేల్/ మనోహరాబాద్(తూప్రాన్): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మలుపు. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న... రైలు కూత మరికొద్ది రోజుల్లో వినబోతున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనుల్లో భాగంగా తొలిదశలో గజ్వేల్ పనులు పూర్తయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతానికి దేశ రాజధాని ఢిల్లీ, మరో మహానగరం కలకత్తాకు ఇక సులువైన మార్గం ఏర్పడనుంది. ఇప్పటికే మనోహరాబాద్–నాచారం వరకు ‘ట్రయల్ రన్’ పూర్తి చేసిన అధికారులు తాజాగా శనివారం గజ్వేల్ వరకు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా త్వరలోనే లైన్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగబోతుండగా... రూ.1160.47కోట్లను వెచి్చస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. ఈ లైన్‌కు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా కేంద్రం రూ.350కోట్లకుపైగా నిధులను విడుదల చేయగా... రెండేళ్లలో ఒకసారి రూ.125 కోట్లను, రూ. 200 కోట్లు, తాజా బడ్జెట్లో మరో రూ.235కోట్లు విడుదల చేయడంతో పనులకు మరింత ఊపు వచి్చంది. మొత్తం ఈ లైన్ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచి్చంది. ఈ రైల్వేలైన్‌పై మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని స్టేషన్‌తో పాటు వర్గల్ మండలం నాచారంగుట్ట, రాయపోల్ మండలం బేగంపేట, గజ్వేల్, గజ్వేల్ మండలం కొడకండ్ల, కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేట, చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది, చిన్న గంగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోజపల్లి, వెదిరతోపాటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రైల్వేస్టేషన్లు ఉండబోతున్నాయి. ఇందులో మనోహరాబాద్, కొత్తపల్లి స్టేషన్లు ఇప్పటికే నిర్మితమై ఉండగా కొత్తగా మిగతా 13స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ లైన్‌వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. పెద్దపల్లి గ్రాండ్ట్రంక్లైన్కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తైతే ప్రయాణీకులకు దూరభారం తగ్గనుంది. మొత్తానికి ఈలైన్తో సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. పూర్తయిన మనోహరాబాద్–గజ్వేల్ లైన్ పనులు మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. లైన్లపై ఉన్న వంతెన పనులను త్వరలోనే పూర్తి చేసేదిశగా సంబంధిత యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇకపోతే మనోహరాబాద్ దాటిన తర్వాత నాగ్‌పూర్ జాతీయ రహదారిని ఈ రైల్వేలైన్ దాటేందుకు చేపడుతున్న ఆర్వోబీ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. గజ్వేల్ వద్ద నిర్మిస్తున్న వంతెనతో పాటు ఆర్వోబీ పనులు పూర్తయితే రైలు మార్గం దాదాపు పూర్తయినట్లే. ఈ క్రమంలోనే భద్రతా పరీక్షలు పూర్తి చేసుకొని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఆమోదం పొందిన తర్వాత ప్రయాణీకుల రైలును పట్టాలు ఎక్కిస్తారు. ఈ క్రమంలోనే గురువారం మనోహారాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవున ట్రయల్ రన్ చేపట్టారు. గజ్వేల్ వరకు మిగిలిన 21 కిలోమీటర్ల మేర కూడా తాజాగా శనివారం ట్రయల్‌రన్ చేపట్టడానికి సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై మంత్రి హరీశ్‌రావు దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌తో పలు సందర్భాల్లో సమావేశమై సమీక్షలు జరపడం పనుల వేగానికి దోహదపడింది. ఈ లైన్‌పై ఏర్పాటు చేయబోతున్న ప్రధాన రైల్వే స్టేషన్లలో నాచారంగుట్ట, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ ముఖ్యమైనవిగా చెబుతుండగా గజ్వేల్ స్టేషన్కోసం పట్టణంలోని జాలిగామ రోడ్డు వైపున జిన్నింగ్‌మిల్ వెనుక భాగంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో పనులు జోరుగా సాగుతున్నాయి. స్టేషన్ భవనం, 3 ప్లాట్‌ఫాంలు, ఒక మెయిన్ లైన్, 2 లూప్లైన్లు, షెల్టర్లు, రెండు ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 10కోట్ల వరకు వెచి్చస్తున్నారు. ఇదే తరహాలో వర్గల్ మండలం నాచారం వద్ద మరోస్టేషన్ నిర్మాణమవుతోంది. రాయపోల్ మండలం బేగంపేట వద్ద హాల్ట్ స్టేషన్‌ను త్వరలో నిర్మించనున్నారు. ప్రస్తుతం గజ్వేల్–సిద్దిపేట లైన్ పనులు కూడా జోరుందుకున్నాయి. వ్యాపార, వాణిజ్యానికి బాటలు... గజ్వేల్ వాసులు ఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలకు వెళ్లాలంటే ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఖాజీపేట–పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి ఉండేది. ఇలా వెళ్తే.. సుమారుగా ఇక్కడి నుంచి 20గంటలకుపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం చేయడం వల్ల గజ్వేల్ వాసులు నేరుగా పెద్దపల్లికి మీదుగా ఢిల్లీ, కలకత్తా నగరాలకు చేరుకునే అవకాశం కలుగనుంది. సుమారుగా ఐదారుగంటల ప్రయాణ వ్యవధి దీనివల్ల తగ్గనున్నది. ఈ పరిణామం ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్యరంగ అభివృద్ధికి ఊతంగా నిలవనున్నది. వ్యాపారస్తులు ముడిసరుకును ఎగుమతి, దిగుమతి చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో వెళ్లివచ్చే అవకాశం కలుగనుండడం వల్ల భారీ ప్రయోజనం చేకూరనున్నది. కూరగాయల సాగులో తెలంగాణలోనే ‘వెజ్‌టబుల్ హబ్’గా ఆవిర్భవించిన గజ్వేల్ నుంచి తాజా కూరగాయలను ఈ రెండు మహానగరాలకు మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు పెరుగనున్నాయి. ఈ పరిణామం కూడా ఇక్కడి కూరగాయల రైతులకు కలిసిరానున్నది. ఇదిలా ఉంటే గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మార్చబోతున్న ఈ రైల్వేలైన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. లైన్ పూర్తయిన తర్వాత ఒనగూరే ప్రయోజనాలపై అంతా చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి మత్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం కృషి వల్ల గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కల సాకారమవుతోందని చెప్పారు. త్వరలోనే లైన్‌ను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోందని వెల్లడించారు. -
కొత్తపల్లి రైల్వేలైన్‌కు మోక్షం
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వెల్లడి తూప్రాన్:మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణం పనులకు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తూప్రాన్‌లో ఎమ్మెల్సీ పాతూరు సుధాకర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనుల విషయం పెండింగ్‌లో ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైలు మార్గంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం ఆదేశం మేరకు కేంద్ర రైల్వేమంత్రితో ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి చర్చంచి రైలు మార్గం నిర్మాణానికి మార్గం సుగమం చేశామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన రైలు మార్గం మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం ద్వారా 160 కిలోమీటర్ల మేర జిల్లా వ్యాప్తంగా విస్తరించనుందన్నారు. ఇందుకోసం రూ.1,160 కోట్ల నిధులతో కేంద్రం టెండర్లు వేసినట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర్యాకల శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.