కర్నూలు (అర్బన్): జిల్లాలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకుల ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, 5న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. వీరిని ఎన్నుకునేందుకు ముందుగా ఆయా మండలాల్లో కో ఆప్షన్ సభ్యున్ని, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మండలా ధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ మండలానికి గెజిటెడ్ అధికారిని ఎన్నికల అధికారిగా నియమిస్తారు. వీరి నేతృత్వంలోనే మండల పరిషత్ పాలకులను ఎన్నుకుంటారు. సోమవారంలోగా గెజిటెడ్ అధికారి నియమిస్తారు.
మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక:
జూలై 4న జిల్లాలోని 53 మండలాల్లోని సమావేశ భవనాల్లో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ముందుగా ఉదయం 10గంటలకు కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. 10నుంచి 12గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 12గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను ప్రచురిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం ఫలితాలను ప్రకటించి ఎన్నికైన కో ఆప్షన్ సభ్యునిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి తమ ఓటింగ్‌ను తెలియజేస్తారు. ఏదైనా కారణంతో కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక:
జూలై 5న జిల్లా పరిషత్‌లోని సమావేశ భవనంలో జెడ్పీటీసీలతో కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. 10నుంచి 12గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 12గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను ప్రచురిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం ఫలితాలను ప్రకటించి ఎన్నికైన కోఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఏదైనా కారణంతో కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా వేసి సమాచారాన్ని వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. మరుసటి రోజు తిరిగి ఎన్నికను నిర్వహిస్తారు.
53మంది ప్రిసైడింగ్ అధికారులు
కర్నూలు(అర్బన్) : మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు 53మంది ప్రిసైడింగ్ అధికారులను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి నియమించినట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఎం.జయరామిరెడ్డి తెలిపారు. నియమించబడిన అధికారులు, ఎంపీడీఓలకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో ఒకరోజు శిక్షణ ఇస్తామన్నారు.
స్థానిక పాలకుల ఎన్నికకు రంగం సిద్ధం
Published Sat, Jun 28 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM
Advertisement
Advertisement