జెడ్పీలో మరో పవర్ సెంటర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో మరో పవర్ సెంటర్ తయారవుతోంది. చైర్‌పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. నిబంధన లేకపోయినప్పటికీ వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాం బర్ ఏర్పాటు చేయాల ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. జెడ్పీలో ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ ఫలితమే ఈ పరిణామనని తెలుస్తోంది. మొన్నటి వరకు డీఈఈ శ్రీనివాస్ కుమార్‌ను అడ్డంపెట్టుకుని ఆటాడుకున్న ప్రత్యర్థులు ఇప్పుడేకంగా వైస్ చైర్మన్ చాంబర్‌ను వేదికగా చేసుకుని పవర్ చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జెడ్పీలో నాట కీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రిజర్వుడ్ మహిళ చైర్‌పర్సన్ అయ్యారు కదా, ఇంకేముంది జెడ్పీలో చక్రం తిప్పొచ్చని కొంతమంది టీడీపీ నాయకులు తొలుత భావించారు. ఆమెను కుర్చీకి పరిమితం చేసి పవర్ చెలాయించొచ్చని ఆశపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం చేసేంతవరకు సమష్టిగా ముందుకెళ్లారు. కానీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి తనకున్న విద్యా, విషయ పరిజ్ఞానంతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఎవరి అడుగు జాడల్లో కాకుండా స్వతంత్రంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. జెడ్పీలో ఏం జరిగినా తనకు తెలియాలన్న ధోరణితో ముందుకెళ్తున్నారు. పలు విషయా ల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఓవర్ టేక్ చేసి ముందుకెళుతున్న వారికి చెక్ పెడుతున్నారు. అందుకు డీఈఈ శ్రీనివాస్ కుమార్ ఉదంతాన్నే తీసుకోవచ్చు. ఇది మింగుడు పడని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు డీఈఈ శ్రీనివాస్‌ను అస్త్రంగా ప్రయోగించారు. ఆయ న ద్వారా వ్యవహారాలు నడిపేందుకు ప్రయత్నించారు. వారు వేసిన ప్రతి ఎత్తుగడలను తిప్పికొడుతూ డీఈఈ దూకుడుకు చైర్‌పర్సన్ బ్రేకులు వేశారు. జిల్లాలో ఇదొక పెద్ద చర్చనీయాంశమయ్యింది. చెప్పాలంటే గత నెల అంతా జెడ్పీలో హైడ్రామా నడిచింది. చివరికి చైర్‌పర్సన్ వర్గీయులే పైచేయి సాధించారు.
జెడ్పీలో తమ మార్క్ పాలన సాగడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపిన ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని అస్త్రంగా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా జెడ్పీలో ఆయనొక చాంబర్ ఏర్పాటయ్యేలా తెరవెనుక పావులు కదిపారని సమాచారం. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లి వారనుకున్నట్టుగా ఆదేశాలిప్పించగలిగారు. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు అందరి మధ్యలో వైస్ చైర్మన్‌కు ప్రత్యేక రూమ్‌లో ఒక కుర్చీ వేయాలని చైర్‌పర్సన్‌కు చెప్పినట్టు తెలిసింది. దీంతో కాదనలేక ఆమె సరే అనేశారు. కాకపోతే, పీఆర్ మంత్రి ఆదేశాలు చైర్‌పర్సన్ వర్గీయులకు మింగుడు పడడం లేదు. పరిపాలన సక్రమంగా సాగుతున్న సమయంలో ఈ ఆదేశాలేంటని లోలోపల మథనపడుతున్నట్టు తెలిసింది.
నిబంధనల్లో ఎక్కడా వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయాలని లేదని, గతంలో ఎప్పుడూ ఇటువంటి ఏర్పాట్లు చేయలేదని కాసింత అసంతృప్తి చెందినట్టు తెలియవచ్చింది. చాంబర్ ఏర్పాటులో జాప్యం జరుగుతుండడంతో వైస్ చైర్మన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో జెడ్పీలో ఉన్న పాత భవనంలో తప్పని పరిస్థితుల్లో చాంబర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, దానికి వైస్ చైర్మన్ అంగీకరించలేదని సమాచారం. పాత భవనంలో కాకుండా జెడ్పీ పరిపాలన భవనంపైన ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో చాంబర్ ను కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఈ డిమాండ్ చైర్‌పర్సన్ వర్గీయులను మరింత జీర్ణించుకోలేకుండా చేసింది. ఇదంతా ప్రత్యర్థులు ఆడుతున్న నాటకమని, మరో పవర్ సెంటర్‌గా వైస్ చైర్మన్ చాంబర్ వేదికగా చేసుకునే ఎత్తుగడ అని జెడ్పీలోనే కాకుండా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి టీడీపీ నాయకులు ఎత్తుకు పైఎటత్తులు వేస్తుండడంతో జెడ్పీలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఏర్పాటైతే అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఎవరి మాట వినాలో, వినకపోతే ఎవరికి ఆగ్రహానికి గురికావలసి వస్తుందో తెలియని పరిస్థితి.