Vice-Chairman
-
ఎకానమీ 7 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ఆశ్చర్యకమైన ప్రతికూల అంశాలు ఏవీ లేకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం జీడీపీ ఇదే స్థాయిలో వృద్ధి చెందే అవకాశాలున్నట్టు చెప్పారు. మాంద్యానికి సంబంధించిన భయాలు కొంత కాలంగా వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు అమెరికా కానీ, యూరప్ కానీ మాంద్యంలోకి జారలేదన్నారు. భారత్‌కు సంబంధించి గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను ఇటీవలి సమీక్షలో ఆర్బీఐ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించడం తెలిసిందే. ప్రపంచబ్యాంకు కూడా భారత్ జీడీపీ 6.9% వృద్ధిని సాధిస్తుందన్న అంచనాలను వ్యక్తం చేసింది. రూపాయిపై ఒత్తిడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాను ఇప్పటికీ భావిస్తున్నట్టు పనగరియా స్పష్టం చేశారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతుండడం రూపాయిపై ఒత్తిడికి దారితీసినట్టు వివరించారు. నవంబర్ నెల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, నికర పెట్టుబడులకు దారితీసిన విషయాన్ని పనగరియా గుర్తు చేశారు. దీనికితోడు అమెరికాలో ద్రవ్యోల్బణం దిగొస్తుండడంతో అక్కడ కూడా గడ్డు పరిస్థితులు ముగిసినట్టేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రూపాయి ఇదే కాలంలో యూరో, యెన్ తదితర కరెన్సీలతో బలపడిన విషయాన్ని ప్రస్తావించారు. దీనికంటే ముందు నాటికే రూపాయి అధిక వ్యాల్యూషన్లో ఉన్నట్టు చెప్పారు. కనుక సమీప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ మరింత తగ్గడం పట్ల తాను సానుకూలంగా ఉన్న ట్టు తెలిపారు. లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలను గమనిస్తే దేశంలో నిరుద్యోగం ఏమంత అధికంగా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
పనాగరియా అనూహ్య నిర్ణయం
న్యూడిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆర్థిక సలహాదారుగా ఉన్న నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ నెలాఖరుకు వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రభుత్వ ప్రధాన విధాన థింక్ ట్యాంక్ లో కీలకంగా ఉన్న పనాగరియా రాజీనామా ప్రభుత్వానికి పెద్ద షాక్ అని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. పానగారియా రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదించారు. మరోవైపు రాజీనామా అనంతరం పనాగరియా న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్లనున్నారు. అక్కడ తన బోధనను కొనసాగించనున్నారు. విలేఖరులతో మాట్లాడిన పనాగరియా కొలంబియా యూనివర్సిటీ తనకు మరింత పొడిగింపు ఇవ్వడం లేదని అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తనను రిలీవ్ చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్టు తెలిపారు. ఆగస్టు 31 న తాను నీతి ఆయోగ్‌ను వీడే అవకాశం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ వయసులో యూనివర్శిటీలో తాను చేస్తున్న పని చాలా కష్టం కావచ్చని పానాగారియా వ్యాఖ్యానించారు. కాగా భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా పేరు యొక్క సంక్షిప్త రూపమే నీతి ఆయోగ్. ఇండియన అమెరికన్ ఎకనమిస్ట్ అయిన పనాగరియా కొలంబియా యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2015లో పనాగరియా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా నియమి తులయ్యారు. 2012 లో దేశీయ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. -
బందరు టీడీపీలో ముసలం
జిల్లా టీడీపీలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయంపై పలువురు నేతలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఎంపీ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుపై మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ధ్వజమెత్తిన ఘటనలు మరువకముందే ఆదివారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోనూ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. * పాఠశాల భవనం ప్రారంభోత్సవం సాక్షిగా భగ్గుమన్న విభేదాలు * పనిగట్టుకుని అవమానిస్తున్నారని ఆవేదన * పదవికి రాజీనామా చేస్తానని మునిసిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం * మంత్రి, ఎంపీల ఎదుటే చైర్మన్‌పై విమర్శనాస్త్రాలు మచిలీపట్నం : బందరు టీడీపీలో ముసలం ప్రారంభమైంది. గత ఆరునెలలుగా పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు జార్జి కార్నేషన్ హైస్కూల్ అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం వేదికగా బయటపడ్డాయి. తన సామాజిక వర్గాన్ని కావాలనే అవమానిస్తున్నారంటూ బందరు మున్సిపల్ వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం ఆవేదన వెళ్లగక్కారు. బందరు టీడీపీలో జరుగుతున్న వ్యవహారాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా మున్సిపల్ వైస్‌చైర్మన్ సామాజిక వర్గానికి చెందినవారు చైర్మన్, మంత్రి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. తమ సామాజిక వర్గానికి వైస్‌చైర్మన్ పదవి ఇచ్చినట్లే ఇచ్చి తెర వెనుక కథ నడుపుతూ అవమానాల పాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ, చైర్మన్ల సమక్షంలోనే చైర్మన్ తీరుపై వైస్‌చైర్మన్ తనదైన శైలిలో విరుచుకుపడటం టీడీపీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. పదవికి రాజీనామా చేసేస్తా... ఎంపీ నిధులతో నిర్మించిన జార్జి కార్నేషన్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఏర్పాటుచేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్న సమయంలో ఆవేశంగా వేదిక ముందుకు వచ్చిన మునిసిపల్ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం.. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని, ఆహ్వాన పత్రికలో తన పేరు ముద్రించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ‘1983 నుంచి టీడీపీ జెండాను భుజాన మోస్తూ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇంతకాలంగా పార్టీలో ఉన్నానని వైస్‌చైర్మన్ పదవి ఇచ్చారు. అయినా నాకు సరైన గౌరవం ఇవ్వడం లేదు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టడంతో పాటు కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికి మూడుసార్లు వైస్ చైర్మన్ హోదాలో ఉన్న నన్ను అవమానించారు’ అంటూ మండిపడ్డారు. ‘పక్కా వ్యూహంతో వైస్‌చైర్మన్ హోదాలో ఉన్న నన్ను, నా సామాజిక వర్గాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి పదవులూ లేనివారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, నా సామాజిక వర్గంలోనే నాకు విలువ లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. నా వద్దకు వస్తే ఏ పనులూ జరగవనే ప్రచారం చేస్తున్నారు. ఈ పదవి నాకు అక్కర్లేదు. రాజీనామా చేసేస్తాను. నాకు అనుకూలంగా ఉండే కౌన్సిలర్లు కూడా రాజీనామా చేస్తారు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవ్వరూ వెళ్లక్కర్లేదు : కొల్లు ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్‌ను సముదాయించేందుకు వేదికపై ఉన్నవారు లేచి వస్తుండగా మీరు ఎవ్వరూ వెళ్లనవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మరికొందరు కౌన్సిలర్లు, జార్జి కార్నేషన్ పాఠశాల పాలకవర్గ సభ్యుడు డాక్టర్ ధన్వంతరీ ఆచార్య తదితరులు వేదిక దిగి వచ్చారు. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగవని, పూర్తి హామీ తనదేనని కాశీవిశ్వనాథంను సముదాయించిన కొనకళ్ల బుల్లయ్య.. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. అనంతరం వారితో పాటే వైస్ చైర్మన్‌ను వేదికపైకి తీసుకువెళ్లారు. మైక్ అందుకుని.. మరోసారి.. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడటం పూర్తయిన వెంటనే మైక్ అందుకున్న వైస్ చైర్మన్ మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించని విషయాన్ని మునిసిపల్ చైర్మన్‌తో పాటు పాఠశాల కమిటీ సభ్యులకు ఒకరోజు ముందే తాను చెప్పానని, అయినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం నాటినుంచీ చైర్మన్ తనను పక్కన పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అక్కసుతోనే తనను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వైస్ చైర్మన్ హోదాలో ఉన్న తనను పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తుదిశ్వాస విడిచేవరకు టీడీపీలోనే ఉంటానని గద్గద స్వరంతో అన్నారు. పురపాలక సంఘంలో ప్రతిపక్ష నాయకుడు అచ్చాబాకు ఇచ్చే గౌరవం కూడా తనకు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలుసుకుని మాట్లాడాలి : చైర్మన్ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ ఇది ప్రైవేటు కార్యక్రమమని, ఎవరిని పిలవాలో.. ఆహ్వానించాలో కమిటీ సభ్యులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇష్టం వచ్చిన వారిని, ఇష్టం లేని వారిని ఆహ్వానించరని, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ అన్ని వివరాలు తెలుసుకుని తనపై ఆరోపణలు చేయాలన్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ వేదికపైనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సభికులను విస్మయానికి గురిచేసింది. టీడీపీ కౌన్సిలర్లలో అంతర్మథనం... పురపాలక సంఘంలో 29 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ తనదైన శైలిలో వ్యవహరిస్తుండటంతో ఎవరికివారే లోలోపల మధనపడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. ఏదైనా పనిపై చైర్మన్ వద్దకు వెళితే బిగ్గరగా మాట్లాడటం, విషయం ఒకటి అడిగితే మరొకటి సమాధానం చెప్పి దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండటంతో టీడీపీ కౌన్సిలర్లు కొంతకాలంగా ఆవేదనకు గురవుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకొంటున్నారు. మోటమర్రి బాబాప్రసాద్ రెండున్నర సంవత్సరాలు మాత్రమే చైర్మన్ పదవిలో ఉంటారని, మిగిలిన రెండున్నర సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇస్తామనే ఒప్పందం జరిగిందని ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా సహచర కౌన్సిలర్ల పైనే చైర్మన్ చిరాకు పడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు బాహాటంగానే చెప్పుకోవడం గమనార్హం. చైర్మన్ చేసే అవినీతి కార్యకలాపాలు బయటపడకుండా ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లకు పనులు అప్పగించి వారిని మాట్లాడకుండా చేసి సొంత పార్టీ కౌన్సిలర్లను పక్కన పెట్టేస్తున్నారని పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు వ్యాఖ్యానించడం గమనార్హం. చైర్మన్ వ్యవహారశైలి నచ్చని మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ కౌన్సిలర్లే చెబుతున్నారు. పురపాలక సంఘంలో చైర్మన్ వ్యవహారశైలిని బందరు ఎంపీ సోదరుడు కొనకళ్ల బుల్లయ్య.. మంత్రికి ఒకటికి పదిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు చెప్పుకోవడం గమనార్హం. -
జెడ్పీలో మరో పవర్ సెంటర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో మరో పవర్ సెంటర్ తయారవుతోంది. చైర్పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. నిబంధన లేకపోయినప్పటికీ వైస్ చైర్మన్‌కు ప్రత్యేక చాం బర్ ఏర్పాటు చేయాల ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. జెడ్పీలో ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ ఫలితమే ఈ పరిణామనని తెలుస్తోంది. మొన్నటి వరకు డీఈఈ శ్రీనివాస్ కుమార్‌ను అడ్డంపెట్టుకుని ఆటాడుకున్న ప్రత్యర్థులు ఇప్పుడేకంగా వైస్ చైర్మన్ చాంబర్‌ను వేదికగా చేసుకుని పవర్ చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జెడ్పీలో నాట కీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వుడ్ మహిళ చైర్పర్సన్ అయ్యారు కదా, ఇంకేముంది జెడ్పీలో చక్రం తిప్పొచ్చని కొంతమంది టీడీపీ నాయకులు తొలుత భావించారు. ఆమెను కుర్చీకి పరిమితం చేసి పవర్ చెలాయించొచ్చని ఆశపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం చేసేంతవరకు సమష్టిగా ముందుకెళ్లారు. కానీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తనకున్న విద్యా, విషయ పరిజ్ఞానంతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఎవరి అడుగు జాడల్లో కాకుండా స్వతంత్రంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. జెడ్పీలో ఏం జరిగినా తనకు తెలియాలన్న ధోరణితో ముందుకెళ్తున్నారు. పలు విషయా ల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఓవర్ టేక్ చేసి ముందుకెళుతున్న వారికి చెక్ పెడుతున్నారు. అందుకు డీఈఈ శ్రీనివాస్ కుమార్ ఉదంతాన్నే తీసుకోవచ్చు. ఇది మింగుడు పడని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు డీఈఈ శ్రీనివాస్‌ను అస్త్రంగా ప్రయోగించారు. ఆయ న ద్వారా వ్యవహారాలు నడిపేందుకు ప్రయత్నించారు. వారు వేసిన ప్రతి ఎత్తుగడలను తిప్పికొడుతూ డీఈఈ దూకుడుకు చైర్పర్సన్ బ్రేకులు వేశారు. జిల్లాలో ఇదొక పెద్ద చర్చనీయాంశమయ్యింది. చెప్పాలంటే గత నెల అంతా జెడ్పీలో హైడ్రామా నడిచింది. చివరికి చైర్పర్సన్ వర్గీయులే పైచేయి సాధించారు. జెడ్పీలో తమ మార్క్ పాలన సాగడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపిన ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని అస్త్రంగా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా జెడ్పీలో ఆయనొక చాంబర్ ఏర్పాటయ్యేలా తెరవెనుక పావులు కదిపారని సమాచారం. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లి వారనుకున్నట్టుగా ఆదేశాలిప్పించగలిగారు. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు అందరి మధ్యలో వైస్ చైర్మన్‌కు ప్రత్యేక రూమ్‌లో ఒక కుర్చీ వేయాలని చైర్‌పర్సన్‌కు చెప్పినట్టు తెలిసింది. దీంతో కాదనలేక ఆమె సరే అనేశారు. కాకపోతే, పీఆర్ మంత్రి ఆదేశాలు చైర్పర్సన్ వర్గీయులకు మింగుడు పడడం లేదు. పరిపాలన సక్రమంగా సాగుతున్న సమయంలో ఈ ఆదేశాలేంటని లోలోపల మథనపడుతున్నట్టు తెలిసింది. నిబంధనల్లో ఎక్కడా వైస్ చైర్మన్‌కు చాంబర్ ఏర్పాటు చేయాలని లేదని, గతంలో ఎప్పుడూ ఇటువంటి ఏర్పాట్లు చేయలేదని కాసింత అసంతృప్తి చెందినట్టు తెలియవచ్చింది. చాంబర్ ఏర్పాటులో జాప్యం జరుగుతుండడంతో వైస్ చైర్మన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో జెడ్పీలో ఉన్న పాత భవనంలో తప్పని పరిస్థితుల్లో చాంబర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, దానికి వైస్ చైర్మన్ అంగీకరించలేదని సమాచారం. పాత భవనంలో కాకుండా జెడ్పీ పరిపాలన భవనంపైన ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో చాంబర్ ను కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఈ డిమాండ్ చైర్పర్సన్ వర్గీయులను మరింత జీర్ణించుకోలేకుండా చేసింది. ఇదంతా ప్రత్యర్థులు ఆడుతున్న నాటకమని, మరో పవర్ సెంటర్‌గా వైస్ చైర్మన్ చాంబర్ వేదికగా చేసుకునే ఎత్తుగడ అని జెడ్పీలోనే కాకుండా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి టీడీపీ నాయకులు ఎత్తుకు పైఎటత్తులు వేస్తుండడంతో జెడ్పీలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఏర్పాటైతే అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఎవరి మాట వినాలో, వినకపోతే ఎవరికి ఆగ్రహానికి గురికావలసి వస్తుందో తెలియని పరిస్థితి. -
సర్వం సిద్ధం
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరనుంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను గురువారం ఎన్నుకోనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం ముస్తాబైంది. ఇందులో ఎన్నిక నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రిసైడింగ్ అధికారి హోదాలో ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి బుధవారం రాత్రి పరిశీలించారు. ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ సమస్యల లేకుండా చూడాలని సీఈవో జయప్రకాశ్ నారాయణ్‌కు సూచించారు. నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో 144 సెక్షన్ జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పోలీస్ యాక్ట్ 30ను అమలు చేసి, ఖమ్మంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నిక ప్రక్రియను రికార్డు చేసేందుకు జిల్లా పరిషత్ ఆవరణతో పాటు సమావేశ మందిరంలో సీసీ కెమెరాలు అమర్చారు. అపరిచిత వ్యక్తులను లోనికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జెడ్పీ ప్రధాన ద్వారాల రెండు వైపులా బారీకేట్లను ఏర్పాటు చేశారు. -
రేపు జెడ్పీ సారథుల ఎన్నిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చక్రధర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామని, గత వారం నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు కూడా మళ్లీ నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుందని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలవరకు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం తర్వాత కోఆప్షన్ సభ్యు ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. అనంతరం 3 గంట లకు మళ్లీ మొదలయ్యే సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక లు జరుగుతాయని వివరించారు. కోరం తప్పనిసరి! జిల్లా పరిషత్ సమావేశం జరగాలంటే కోరం తప్పని సరి. 17 మంది సభ్యులు హాజరైతే నే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. నిర్ధేశిత సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోతే ఎన్నికలు వాయిదా పడతాయి. ఆ తర్వాత 3 గంటలకు జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడుతుంది. మరుసటి రోజుకు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఒకవేళ క్రితం రోజు పరిస్థితే పునరావృతమైతే మాత్రం ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఈసీ నిర్ణయం మేరకు తదుపరి తేదీని ప్రకటిస్తారు. కోరం ఉండి కో ఆప్షన్ సభ్యు ల ఎన్నిక జరిగిన అనంతరం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కోరం లేకు న్నా.. ఎన్నిక వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు. -
ఆకర్ష్ గులాబీ..!
- టీఆర్ఎస్ గూటికి మరికొంతమంది - మొగ్గుచూపుతున్న ఓ మున్సిపల్ చైర్మన్ - అదేబాటలో 9మంది కాంగ్రెస్, - టీడీపీ జెడ్పీటీసీ సభ్యులు అధికార పార్టీవైపు - కొందరు ఎంపీపీల చూపు - ప్రత్యర్థులకు చుక్కలు చూపేందుకు గులాబీదళ వ్యూహం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందునుంచి ప్రారంభమైన రాజకీయ వలసలు.. ఎంపీపీ, జెడ్పీ, మున్సిపల్ పాలకమండళ్ల ఏర్పాటు సమయంలో తీవ్రరూపం దాల్చాయి. వాటి ఎన్నిక ప్రక్రియ పూర్తయినా.. పార్టీ ఫిరాయింపులు ఇంతటితో ముగిసేలా లేవు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న గులాబీ పార్టీలో చేరేందుకు పలువురు ప్రజాప్రతినిధులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాకు చెందిన ఓ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 9మంది జెడ్పీటీసీ సభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. కొందరు ఎంపీపీలు సైతం అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే అయిదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని భావించిన ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్లో చేరాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రలోభాల ఎర చూపడం.. లేదంటే ఇదివరకు ఎంపీపీ, జెడ్పీటీసీ పదువులు అనుభవించిన వారు చేపట్టిన పనులను నిధులు మంజూరు చేసేందుకు తాత్కాలికంగా కొర్రీ విధించడం.. పనులను నాణ్యతను చూశాకే.. మంజూరు చేస్తామని చెబుతూ ఇతర పార్టీలకు చెందిన వారిని గులాబీవైపు మళ్లించేందుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఒక్కొక్కరిగా కాకుండా అందరినీ ఒకే వేదికమీద కండువాలను కప్పి తమ పార్టీలో చేరేందుకు సందర్భంకోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించడమే కాకుండా.. గులాబీ పార్టీ ప్రతిష్టను కూడా చాటుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్ర రాజకీయ కూటములతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకీ సరిపడినంత సంఖ్యాబలం లేని చోట ప్రలోభాల పర్వం జోరుగా సాగింది. క్యాంపుల పేరిట తమ సభ్యులు చేజారకుండా పార్టీలు, నేతలు కట్టుదిట్టంగా వ్యవహరించినా పలుచోట్ల ఫిరాయింపులు జరిగాయి. పార్టీలు, సిద్ధాంతాలకు తిలోదకాలివ్వడంతో ‘కలగూర గంప’ కూటములకు మండల పరిషత్ పీఠాలు దక్కాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మెజారిటీ మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకుంది. వ్యూహాత్మక ఎన్నిక..! జెడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసిన టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ఇతర పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకుంది. గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు బండారి భాస్కర్ జిల్లా పరిషత్ ైచైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ విప్ ఉల్లంఘించి టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కొత్తూరు కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్‌రెడ్డికి వైస్ చైర్మన్ పదవి దక్కింది. 64మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికయ్యేందుకు కనీసం 33మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా.. టీఆర్ఎస్కు చెందిన 25మంది సభ్యులతో పాటు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్కు సహకరించడంతో సంఖ్యాబలం 35కు చేరింది. దీంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోగలిగారు. 64 మండల పరిషత్‌లకు గాను 62 మండలాలకు సంబంధించి ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితి 27చోట్ల ఎంపీపీ అధ్యక్ష పదవులు, 20 ఉపాధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది. -
‘గులాబీ' నగర్
మారిన జిల్లా రాజకీయ ముఖచిత్రం - కుదేలైన కాంగ్రెస్ - అడ్రస్ లేని టీడీపీ - ఉనికి కోసం బీజేపీ కరీంనగర్ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 12 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. అదే హవాను స్థానిక సంస్థల్లో కొనసాగించింది. ఈనెల 3, 4, 5 తేదీల్లో వరుసగా జరిగిన పరోక్ష ఎన్నికల్లో టీఆర్ఎస్ దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. జిల్లాలో 11 మున్సిపాలిటీకు.. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో సహా మెట్పల్లి, కోరుట్ల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి నగరపంచాయతీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో 57 జెడ్పీటీసీ స్థానాలకు.. 41 సీట్లను సాధించి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 57 మండల పరిషత్‌లకు గాను.. 42 ఎంపీపీలను ఏకపక్షంగా గెలుచుకొని జిల్లాను పూర్తిగా గులాబీమయం చేసింది. పలు మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లతో మెజారిటీ లేకున్నా.. అధికార బలంలో పరోక్ష ఎన్నికల్లో సత్తా చాటుకుంది. జిల్లావ్యాప్తంగా ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో మాత్రమే టీఆర్ఎస్ వెనుకబడగా, కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. జగిత్యాల మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని మూడు ఎంపీపీలను కైవసం చేసుకుంది. నరేంద్రమోడీ హవాతో జాతీయస్థాయిలో అధికారం చేపట్టిన బీజేపీ జిల్లాలో మాత్రం ఉనికి కోసం అపసోపాలు పడుతోంది. ఒక్క జెడ్పీటీసీ, ఒక్క ఎంపీపీ, ఒక్క నగరపంచాయతీ సాధించుకొని ‘నంబర్ వన్’ గా చతికిలపడింది. జిల్లాలో మొన్నటిదాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అడ్రసే గల్లంతైంది. కేవలం ఓదెల జెడ్పీటీసీని గెలుచుకున్న ఆ పార్టీ.. ఒక్క మండల పరిషత్‌ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. మున్సిపాలిటీల్లో బోణీ కూడా కొట్టని దుస్థితి ఏర్పడింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత జగిత్యాల నియోజకవర్గంలో పూర్తిగా గల్లయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.విజయరమణారావు నియోజకవర్గమైన పెద్దపల్లిలోనూ టీడీపీ కనుమరుగైంది. సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ సొంత పార్టీ ఎంపీటీసీలే షాక్నిచ్చి.. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచారు. పెద్దపల్లి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని టీడీపీ నేతలు తీర్మానిస్తే.. విప్‌ను ధిక్కరించి మరీ కౌన్సిలర్లు టీఆర్ఎస్కు ఓటేశారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల పరిస్థితి దయనీయంగా మారింది. కారు వైపు పరుగులు అధికార పార్టీ టీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కారెక్కేందుకు పరుగులు తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు మండలి చైర్మన్ ఎన్నికకు ముందు టీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ అభ్యర్థి స్వామిగౌడ్‌కు ఓటేశారు. జిల్లాలో నలుగురు ఎమ్మెల్సీలకు గాను భానుప్రసాద్‌రావు చేరడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య మూడుకు చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో 14 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలుపొందగా.. ఐదుగురు సీనియర్ కార్పొరేటర్లు గులాబీ గూటికి చేరుకున్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన విజయ్ టీఆర్ఎస్లో చేరి ఏకంగా చైర్మన్ అయ్యారు. అధికారంలోకి రావడమే తరువాయి.. రాజకీయంగా పట్టు సాధించేందుకు గులాబీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కారువైపు పరుగులు పెడుతున్నారు. పలువురు సర్పంచులు, వార్డు సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు సైతం టీఆర్ఎస్లో చే రుతున్నారు. దీంతో జిల్లాలో 90 శాతానికి పైగా పదవులు టీఆర్ఎస్ ఖాతాలో ఉండడం విశేషం. -
కాంగ్రెస్.. జైత్రయాత్ర
సాక్షిప్రతినిధి, నల్లగొండ :ఎలాంటి సంచలనాలకు తావు లేకుండానే జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక ముగిసింది. జిల్లాలోని 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43 స్థానాలను, ఆ పార్టీ మిత్రపక్షం సీపీఐ ఒక స్థానాన్ని వెరసి 44 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. దీంతో జిల్లా పరిషత్‌లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. కాగా, టీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితం కావడంతో చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే అవకాశమే లేకుండా పోయింది. ఎస్టీలకు రిజర్వు అయిన జెడ్పీకి శనివారం జరిగిన ఎన్నికలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, చందంపేట జెడ్పీటీసీ సభ్యుడు బాలూనాయక్ చైర్మన్‌గా, పెద్దవూర జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి వైస్‌చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూర్యాపేట మండాలనికి చెందిన బాషామియా ముస్లిం మైనారిటీల నుంచి, మఠంపల్లికి చెందిన గోపు రాజారెడ్డి క్రిస్టియన్ మైనారిటీల నుంచి కోఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎలాంటి అనూహ్య పరిణామాలు లేకుండా జెడ్పీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అంతా అనుకున్నట్టుగానే..! సార్వత్రిక ఎన్నికలకంటే ముందే జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పటికే దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల పొత్తుల్లో ఒకవేళ దేవరకొండను సీపీఐకి ఇవ్వాల్సి వస్తే, సీటు త్యాగం చేసినందుకు జెడ్పీ చైర్మన్ పదవి ఇస్తామమని హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్‌లోని సీనియర్ అయిన జానారెడ్డి మధ్యవర్తిత్వం చేశారు. చివరకు ఏఐసీసీ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగిందన్నది పార్టీ వర్గాల సమాచారం. దేవరకొండ ఎమ్మెల్యే స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం, ఆ పార్టీ గెలవడంతో బాలూనాయక్‌కు చైర్మన్ పదవి ఖాయమని తేలిపోయింది. అయితే, పార్టీ నాయకత్వం అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోవడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఇక, వైస్ చైర్మన్ పదవి సైతం జానారెడ్డి అనుచరుడైన కర్నాటి లింగారెడ్డికి దక్కుతుందని ముందు నుంచే అంతా ఊహించారు. చైర్మన్ పదవి ఎస్టీకు రిజర్వు అయినందున, వైస్ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి చెందిన వారికి ఇస్తారని భావించారు. దానికి తగినట్టుగానే జిల్లా కాంగ్రెస్ సీనియర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలవడంతో ఈ ఇద్దరూ ఏకగ్రీంగానే ఎన్నికై పదవులు పొందారు. ఇక, కో ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నల్లగొండకు చెందిన శౌరయ్య, దేవరకొండకు చెందిన సిరాజ్‌ఖాన్ కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, వీరు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యత తీసుకుని పక్కకు తప్పించారు. దీంతో ఇద్దరు కోఆప్షన్ సభ్యులు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. అంతా కాంగ్రెస్ నేతులు ముందే అనుకుని సిద్ధం చేసుకున్న ‘బ్లూ ప్రింట్ ’ ప్రకారమే జెడ్పీని దక్కించుకున్నారు. అధికార టీఆర్ఎస్ భయంతో... ఏకతాటిపైకి తమలో తాము గ్రూపులు కడితే, జెడ్పీటీసీ సభ్యులను చీల్చడానికి, జెడ్పీని తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సమాచారంతో, అనివార్యంగా కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చినట్లు విశ్లేషిస్తున్నారు. 13మంది జెడ్పీటీసీ సభ్యులతో రెండోస్థానంలో ఉన్న టీఆర్ఎస్ జెడ్పీని దక్కించుకోవడానికి మరో 17మంది సభ్యుల మద్దతు కూడగట్టాల్సి ఉండేది. ఒక వేళ చైర్మన్ పదవి కోసం గ్రూపులుగా విడిపోతే, ఏదో ఒక గ్రూపును దగ్గరకు తీసుకుని తమ ముద్ర వేసేస్తే, భారీ మెజారిటీ ఉండి కూడా జెడ్పీని కోల్పోయిన వారమవుతామన్న ఆందోళన కాంగ్రెస్‌లో ఉంది. జిల్లా నుంచే సీఎల్పీ నేతగా జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఎక్కడా చీలిక రాలేదు. చీలిక వచ్చే సూచనలూ కనిపించకపోవడంతో అటు టీఆర్ఎస్ నాయకత్వం కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో జిల్లా పరిషత్‌పై కాంగ్రెస్ జెండా మరోసారి రెపరెపలాడింది. -
జడ్పీ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
ఇందూరు : జిల్లా పరిషత్ చె ర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక శనివారం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జడ్పీ అధికారులు శుక్రవారమే పూర్తి చేసి సమావేశ మందిరాన్ని సిద్ధంగా ఉంచారు. పాత కుర్చీలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. కుర్చీలకు పట్టిన దుమ్మును మెషిన్ ద్వారా తొలగించారు. సమావేశ మందిరంలో జడ్పీటీసీ అభ్యర్థులు కూర్చున్న చోటికి ఎవరూ చొరబడిరాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. విలేకరులకు, అధికారులకు ప్రత్యేక విభాగాలను కేటాయించారు. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఉదయం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, 11 గంటలకు పరిశీలన ఉంటుంది. ఒంటి గంట వరకు జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు నామినేషన్లు, పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. జడ్పీ ప్రిసైడింగ్ అధికారిగా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తారు. ఈ ఎన్నిక తర్వాత జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. జడ్పీ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఇటు పాలకవర్గం కొలువుదీరిన వెంటనే సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో మొదటి జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. -
హస్తం.. హవా
- మూడు మునిసిపాలిటీలు కాంగ్రెస్ పరం - మరో రెండు నగర పంచాయతీల్లోనూ పాగా - కాంగ్రెస్ దోస్తీతో బీజేపీకి లబ్ధి - పాలమూరులో ఫలించని టీఆర్ఎస్ వ్యూహం - కాంగ్రెస్ సభ్యుడి మద్దతుతో టీడీపీకే వనపర్తి - కల్వకుర్తిలో వైఎస్ఆర్సీపీకి వైస్‌చైర్మన్ పీఠం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎట్టకేలకు ‘పుర’సమరానికి తెరపడింది. ‘నువ్వా..నేనా!’ అనే రీతిలో ఉత్కంఠభరితంగా సాగిన మునిసిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల పరోక్ష ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీతో దోస్తీ కట్టిన కాంగ్రెస్ మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. అధికారపార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపినా.. జిల్లాలో ఒకేఒక్క నగర పంచాయతీని మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ పక్కాప్లాన్గా అడుగులు వేసి మూడుచోట్ల వైస్ చైర్మన్ పీఠాలను సాధించుకోగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మరోచోట వైస్‌చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. టీఆర్ఎస్కు సొంత బలం ఉన్న అయి జ నగర పంచాయతీలో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తన ఖాతాలో వేసుకోగలిగింది. సొంత బలంతో నారాయణపేట మునిసిపాలిటీ పీఠాన్ని బీజేపి దక్కించుకుంది. బీజేపీతో కలిసి వనపర్తి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాం గ్రెస్ పావులు కదిపినా చివరకు టీడీపీ పైచేయి సాధించింది. కల్వకుర్తి నగర పం చాయతీలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పర సహకారంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాయి. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. రెండు పార్టీల తరఫున చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ, టీడీపీ మద్దతుతో 23ఓట్లు సాధించిన 38వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రాధ అమర్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తరఫున చైర్మన్‌గా నామినేషన్ వేసిన వనజాకు 21 ఓట్లు లభిం చాయి. ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఓట్లు వేసినా టీడీపీ మేజిక్ ఫిగర్‌ను సాధించలేకపోయింది. కాంగ్రెస్ శిబిరంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదని ఓటింగ్ సరళి వెల్లడించింది. వనపర్తి మునిసిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహించారు. బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించినా సొంత పార్టీ కౌన్సిలర్ విప్‌ను ధిక్కరించి టీడీపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలికాడు. దీంతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి రమేశ్‌గౌడ్‌కు 14 ఓట్లు, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి లోక్నాథ్రెడ్డికి 13 ఓట్లు లభించాయి. వైస్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.కృష్ణ, టీఆర్ఎస్ వైస్ చైర్మన్ అభ్యర్థి గట్టు యాదవ్‌కు 13 ఓట్లు లభించాయి. నాగర్‌కర్నూల్ నగర పంచాయతీలో బీజేపీతో జట్టు కట్టిన కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీ నంది ఎల్లయ్య ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో ఎన్నికకు హాజరయ్యారు. తగి న సంఖ్యాబలం లేకపోవడంతో చివరి నిముషంలో టీఆర్ఎస్ ఎన్నికల బరినుం చి తప్పుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య అవగాహన కుదరడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తొలి మూడేళ్లు కాంగ్రెస్, చివరి రెండేళ్లు వైఎస్ఆర్ సీపీకి చైర్మన్ పదవి దక్కేవిధంగా పరస్పరం అంగీకారం కుదిరినట్లు సమాచారం. గద్వాల, షాద్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నారాయణపేట మునిసిపాలిటీలో బీజేపీ, అయిజ నగర పంచాయతీలో టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
జెడ్పీలో సమస్యల ‘కొలువు’
ఖాళీగా డెప్యూటీ సీఈవో, ఏవో పోస్టులు వరుస ఎన్నికలే భర్తీకి అడ్డంకి అదనపు బాధ్యతలతో సీఈవో సతమతం పాలకవర్గం నియామకం అనంతరమే భర్తీ భారీఎత్తున పైరవీలు ! కలెక్టరేట్(మచిలీపట్నం) : జిల్లా పరిషత్ కార్యాలయంలో సమస్యలు తిష్టవేశాయి. జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టులు భర్తీ చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పనిచేస్తున్న ఎంపీడీవోలను బదిలీ చేయాలనే ఆదేశాల నేపథ్యంలో ఫిబ్రవరి 25వ తేదీన ఎంపీడీవోలను బదిలీ చేయటంతో అప్పటి వరకు డెప్యూటీ సీఈవోగా ఉన్న జీవీ సూర్యనారాయణ, గణాంకాధికారిగా పనిచేస్తున్న అనూరాధ బదిలీ కావ డంతో అప్పటినుంచి ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 25వ తేదీన జిల్లా పరిషత్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన డి.సుదర్శనం వరుస ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బిజీ అయ్యారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా నియమితులు కావడంతో అక్కడే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం సీఈవో కుమారుడు వివాహం కోసం పది రోజులు సెలవుపై వెళ్లారు. తిరిగి బాధ్యతలు స్వీకరించిన సీఈవో నూతన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. నాలుగు నెలలుగా జెడ్పీ కార్యాలయంలో నెలకొన్న పలు సమస్యలపై దృష్టి సారించేందుకు సీఈవోకు ఖాళీ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలెన్నో... జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టుల కోసం కొంతమంది ఎంపీడీవోలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల నేపథ్యంలో బదిలీ అయిన ఎంపీడీవోలు తిరిగి జిల్లాలో అదే స్థానంలో రావటంతో డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇన్చార్జ్ సీఈవోగా పనిచేసిన చింతా కళావతి తానే అందరి కంటే సీనియర్ నంటూ ముందుగా ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. సంఘ నాయకుల ఆశీస్సులతో ఈ పోస్టును తానే దక్కించుకుంటానని బందరు ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అందరికంటే డెరైక్ట్ ఎంపీడీవోలుగా బాధ్యతలు స్వీకరించామని తామే అందరి కంటే సీనియర్ ఎంపీడీవోలమని న్యాయపరమైన పోరాటం చేస్తున్న ఆర్వీఎం పీవో వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవో కృష్ణమోహన్ డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టు కోసం పోటీ పడుతున్నారు. పాలకవర్గం వచ్చిన తరువాతే పోస్టుల భర్తీ: జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం అనంతరం డెప్యూటీ సీఈవో, గణాంకాధికారి పోస్టులను భర్తీ చేస్తామని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి దాసరి సుదర్శనం ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులకు సంబంధించి పీఎఫ్ రుణ దరఖాస్తులు ఇప్పటి వరకు పెండింగ్ లేవని అన్నీ క్లియర్ చేశామని చెప్పారు. ఒకటి, రెండు రోజుల్లో ఉపాధ్యాయుల ఖాతాలకు రుణ మొత్తం జమ అవుతాయన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రేపు జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక
కరీంనగర్ సిటీ : మూడున్నరేళ్ల ప్రత్యేకపాలనకు తెరపడనుంది. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్పర్సన్, వైస్‌చైర్మన్, ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ ఇదీ.. శనివారం ఉదయం 10 గంటల్లోపు రెండు కో ఆప్షన్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు 12 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటన 1 గంట వరకు ఉపసంహరణ 1 గంటకు ప్రత్యేక సమావేశం, జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం అవసరమైతే కో ఆప్షన్ పదవులకు ఓటింగ్. ఫలితం వెల్లడి మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నిక అనంతరం ఫలితాల వెల్లడి, జెడ్పీ చె రపర్సన్, వైస్‌చైర్మన్ ప్రమాణస్వీకారం ఎన్నిక నిర్వహణ ఇలా.. జిల్లా పరిషత్ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం విధివిధానాలు జారీ చేసింది. ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పార్టీల వారీగా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. జాతీయ పార్టీలకు ముందు వరుసలో అవకాశం కల్పిస్తారు. పార్టీల వారీగా తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు కూర్చోవాల్సి ఉంటుంది. పలానా పార్టీ నుంచి పలానా జెడ్పీటీసీని చైర్‌పర్సన్‌గా, వైస్‌చైర్మన్‌గా నియమించామని పార్టీఇచ్చిన ఆథరైజేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి(పీవో)కి అందచేస్తారు. దీనినే అభ్యర్థుల నామినేషన్‌గా పరిగణిస్తారు. అభ్యర్థికి మరొకరు ప్రతిపాదిస్తారు. ఇంకొకరు బలపరుస్తారు. ఒక్క పార్టీ నుంచి మాత్రమే ఆథరైజేషన్ వస్తే, ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు పీవో ప్రకటిస్తారు. రెండు పార్టీలు పోటీపడితే ఎన్నిక నిర్వహిస్తారు. ఒక అభ్యర్థి పేరు చెప్పి అనుకూలంగా ఎంతమంది ఓటు వేస్తారో చేతులెత్తండి అని పీవో అడగగానే,చేతులెత్తిన జెడ్పీటీసీలను సిబ్బంది లెక్కిస్తారు. ఎవరికి ఎక్కువ మంది చేతులెత్తెతే వారే విజేతలు. చైర్పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకనే వైస్‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు. -
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ ‘జంపాల’
వైస్ చైర్మన్‌గా తుమ్మల ఎంపీ, ఎమ్మెల్యే చర్చలు జయప్రదం తొలగిన ఉత్కంఠ ఉయ్యూరు : ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా జంపాన పూర్ణచంద్రరావు (పూల), వైస్ చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాసబాబు ఎన్నికవడంతో ఉయ్యూరు చైర్మన్ ఎవరనే విషయమై ఇప్పటివరకూ ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. చైర్మన్గిరీకోసం టీడీపీలోని పలువురు పోటీపడడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీ కౌన్సిలర్లతో పలు దఫాలుగా జరిపిన చర్చలు జయప్రదం కావడంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఐదేళ్లచైర్మన్ పదవీకాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. తొలుత జంపాన పూర్ణచంద్రరావు, తరువాత అబ్దుల్ ఖుద్దూస్, షేక్ ఖలీల్ చైర్మన్లుగా కొనసాగేలా నేతలు నిర్ణయించారు. కౌన్సిలర్లుగా ప్రమాణం.. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లకుగానూ ఓటింగ్‌కు 19 మంది మాత్రమే హాజరయ్యారు. 8 మంది వైఎస్సార్ సీపీ, 9 మంది టీడీపీ, ఇరువురు స్వతంత్రులు హాజరుకాగా 9వ వార్డు కౌన్సిలర్ తుంగల పద్మ (వైఎస్సార్ సీపీ) గైర్హాజరయ్యారు. సభ్యులందరితో ప్రత్యేక అధికారి పుష్పమణి ప్రమాణస్వీకారం చేయించారు. అడపా ఆదిలక్ష్మి, అబ్దుల్ ఖుద్దూస్, అబ్దుల్ రహీమ్, కోరాడ వెంకటలక్ష్మి, గుంజా రాంబాబు, జంపాన పూర్ణచంద్రరావు, జరీనా భేగం, తుమ్మల శ్రీనివాసబాబు, తోట జ్యోతి, నడిమింటి లక్ష్మి, పండ్రాజు సుధారాణి, పుట్టి రోజామణి, పెనుమూడి వాణి, బాణావత్తు కళ్యాణి, బొబ్బిలి నాగరాజు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, షేక్ ఖలీల్, రజియా సుల్తానా, సోలే సురేష్‌బాబులు కౌన్సిలర్లుగా ప్రమాణం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరయ్యారు. ఉత్కంఠకు తెరతీసిన ఛైర్మన్ ఎన్నిక.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం పలుమార్లు ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే ప్రసాద్ కౌన్సిలర్లతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. చైర్మన్‌గా 16వ వార్డు కౌన్సిలర్ జంపాన పూర్ణచంద్రరావు (పూల), వైస్ చైర్మన్‌గా 11వ వార్డు కౌన్సిలర్ తుమ్మల శ్రీనివాసబాబు పేర్లను ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థిగా 18వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్ పోటీలో నిలిచారు. పూలను ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లతో కలిపి 13 మంది, వైస్ చైర్మన్ తుమ్మలను 12 మంది బలపర్చడంతో మెజార్టీని బట్టి వారిరువురినీ చైర్మన్, వైస్చైర్మన్లుగా ఎన్నికల అధికారి పుష్పమణి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ఉయ్యూరు మున్సిపల్ తొలి కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం ప్రైవేటు ప్రదేశంలో చేసుకోవాల్సి వచ్చింది. కౌన్సిల్ హాలు లేకపోవడంతో ఏజీఅండ్‌ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల హాస్టల్ భవనంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం,చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక జరిగింది. ఎన్నిక, ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు. -
ఫరూక్ వర్గానికి ఝలక్
నంద్యాల: పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు శిల్పావర్గానికి దక్కాయి. దీంతో నంద్యాల అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికై 15 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేసిన ఫరూక్ మాట చెల్లుబాటు కాలేదు. కనీసం రెండు పదవుల్లో ఏదో ఒకటి అప్పగిస్తారని ఆయన వర్గానికి చెందిన కౌన్సిలర్లు భావించారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి తన వర్గానికి చెందిన కౌన్సిలర్లు దియ్యాల సులోచన, మామిడి ఉషారాణిలను చైర్మన్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని పట్టుబట్టారు. ఈ మేరకు సులోచన భర్త మాజీ కౌన్సిలర్ రంగప్రసాద్, ఉషారాణి భర్త మామిడి నాగరాజులకు ఫరూక్ పరోక్షంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరికి ఊహించిన విధంగానే మాజీ కౌన్సిలర్ దేశం సుధాకర్‌రెడ్డి సతీమణి సులోచన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌లను చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించాయి. వీరు 2004 నుంచి 2014 వరకు శిల్పా అనుచరులుగా కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల ముందు శిల్పా వెంట టీడీపీలోకి వచ్చి రెండు పదవులు వారే దక్కించుకోవడంతో ఫరూక్ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకు ఫరూక్‌కు ప్రాధాన్యత లభించలేదో అర్థం కావడం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేశం కండువాల్లో కూడా ఫరూక్ చిత్రం గల్లంతు.. గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన టీడీపీ కౌన్సిలర్లు పచ్చకండువాలతో హాజరయ్యారు. అయితే వారు వేసుకున్న కండువాల్లో చంద్రబాబుతో పాటు శిల్పామోహన్‌రెడ్డి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఫరూక్ చిత్రం లేకపోవడాన్ని పలువురు విలేకరులు కౌన్సిలర్లను ప్రశ్నించగా అలాంటిదేమీలేదని ఎన్నికల సమయంలోని కండువాలని వివరించారు. చివరికి ఫరూక్ వర్గంగా భావిస్తున్న దియ్యాల సులోచన, మామిడి ఉషారాణిలు కూడా శిల్పా ఫొటోలు ఉన్న కండువా వేసుకోవడం గమనార్హం. అయిష్టంగానే చేతులెత్తిన దియ్యాల, చంద్రావతి.. నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ పదవి కోసం పోటీ పడి నాలుగో వార్డు నుంచి ఎన్నికైన దియ్యాల సులోచన, 17వ వార్డు నుంచి ఎన్నికైన చంద్రావతి అయిష్టంగానే చేతులెత్తారు. దేశం సులోచనకు మద్దతు ఇచ్చే సభ్యులు చేతులెత్తాలని ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్డీఓ నరసింహులు కోరారు. ఎవరు చేతులెత్తలేదని ముందుగా కూర్చుకున్న వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, అనిల్ అమృతరాజ్‌లు వెనక్కి చూడగా అప్పుడు వారిద్దరు బలవంతంగా పూర్తి స్థాయిలో చేతులెత్తారు. మొత్తం మీద చైర్మన్ పదవి దక్కలేదనే అసంతృప్తి వారిలో వ్యక్తమైంది. స్వేచ్ఛగా వైఎస్సార్సీపీ... మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా హాజరయ్యారు. 13మంది కౌన్సిలర్లు ఎవరికి వారు సొంత వాహనాల్లో మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. అదే టీడీపీకి చెందిన వారిలో చైర్మన్ ఎంపికలో బేధాభిప్రాయాలు ఉండటంతో 29 మంది కౌన్సిలర్లను బుధవారం రాత్రి ఒక చోటకు చేర్చారు. అక్కడి నుంచి నేరుగా గురువారం ఉదయం కార్యాలయానికి తీసుకొచ్చారు. టీడీపీ సభ్యుడి ఆంగ్లంలో ప్రమాణం.. టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు పడకండ్ల సుబ్రమణ్యం ఆంగ్లంలో ప్రసంగం చేయడం పలువురిని విస్మయానికి గురి చేసింది. తెలుగు అనర్గలంగా మాట్లాడే సుబ్రమణ్యం టీడీపీలో ఉంటూ తెలుగులో ప్రమాణస్వీకారం చేయకపోవడంపై చర్చనీయాంశమైంది. ఈయన 9వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 42 మంది కౌన్సిలర్లలో ఏడుగురు నిరక్షరాస్యులే... నంద్యాల పురపాలక సంఘం కౌన్సిలర్లుగా ఎన్నికైన 42 మందిలో మొత్తం ఏడుగురు నిరక్షరాస్యులని తేలింది. అందులో వైఎస్సార్సీపీకి చెందిన 13మందిలో ఇద్దరు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన 29మంది కౌన్సిలర్లలో ఐదుగురు నిరక్షరాస్యులని ప్రమాణస్వీకారం సందర్భంగా తేలింది. టీడీపీ కౌన్సిలర్లుగా 1,3, 8, 31,42 వ వార్డుల నుంచి గెలుపొందిన మాతంగి కన్నమ్మ, ఎన్కే సర్తాజ్, నూర్జహాన్, ఫాతిమున్నిసా, సోనాల పిల్లి లక్ష్మీదేవిలతో పాటు వైఎస్సార్సీపీ నుంచి 2,32 వ వార్డుల నుంచి గెలుపొందిన గొరెముర్తుజా, ఎ. చెన్నమ్మలు ఎన్నికల అధికారులు ఇచ్చిన ప్రమాణస్వీకార పత్రాన్ని చదవలేకపోయారు. వీరితో ఆర్డీఓ చదివించారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3.. తెలుగుదేశం పార్టీకి 3
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో మునిసిపల్, నగర పంచాయతీల చైర్మన్ల ఎన్నిక గురువారం ఆసక్తికరంగా సాగింది. ఎనిమిది మునిసిపాలిటీల్లో మూడింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరో మూడింటిని టీడీపీ దక్కించుకున్నాయి. ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీల చైర్మన్ల ఎన్నికలు మాత్రం రసవత్తరంగా ముగిసాయి. ఈ రెండు నగర పంచాయతీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినవారే కావటం గమనార్హం. జిల్లాలో నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు మునిసిపాలిటీలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీల చైర్మన్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్న స్థానాలను బలవంతంగా లాక్కునేందుకు తెలుగు తమ్ముళ్లు ఎత్తులు వేశారు. అందులో భాగంగా మాజీ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు. తాను చెప్పినట్టు వింటే గూడూరు నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెడుతానని, పనులు ఇప్పిస్తానని పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై విష్ణువర్ధన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరకపోయినా విష్ణు చెప్పినదానికి అంగీకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలుపొందిన ఇందిర సుభాషిణిని చైర్‌పర్సన్‌గా, రామాంజనేయులును వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. డామిట్.. కథ అడ్డం తిరిగింది.. ఆత్మకూరు నగర పంచాయతీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో 10 వైఎస్సార్ సీపీ (ఒకరు మృతి), 9 టీడీపీ దక్కించుకోగా.. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఈయన కూడా వైఎస్సార్సీపీ మద్దతుతోనే గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి సలాంకు చైర్మన్ పదవి ఆశచూపి టీడీపీ వైపు తిప్పుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పథకాన్ని పన్నారు. చైర్మన్ పదవి ఇస్తే ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతారని ఆశ చూపారు. దీంతో టీడీపీ నేతలు ఒప్పుకుని ముగ్గురు కౌన్సిలర్లకు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే నూర్అహ్మద్నే చైర్మన్‌గా ఎన్నుకున్నారు. చైర్మన్ ఎన్నిక అయ్యాక పార్టీ మారిన ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకుని బాణా సంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని చూసి తమ్ముళ్లు ఖంగుతిన్నారు. ఆదోనిలో ఫలించని తమ్ముళ్ల ప్రలోభాలు.. ఆదోని మునిసిపాలిటీని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు రకరకాల ఎత్తులు వేశారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు నగదు ముట్టజెప్పేందుకు ప్రయత్నించారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. అదే విధంగా మరి కొందరికి పదవులు కట్టబెడుతామని, ఇంకొందరికి డీలర్‌షిప్‌లు ఇప్పిస్తామని ఆశచూపారు. అదే విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు పలు ప్రయోజనాలు కల్పిస్తామని ప్రాధేయపడ్డారు. అయితే ఏ ఒక్కరూ టీడీపీ నేతల ప్రలోభాలకు లోనుకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచామని, ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. అందులో భాగంగానే అందరూ కౌన్సిలర్లు కలసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకున్నారు. ఎట్టకేలకు కొలువైన పాలకవర్గాలు.. సుమారు మూడున్నరేళ్ల తరువాత మునిసిపాలిటీలకు పాలకవర్గాలు కొలువయ్యాయి. 2010 సెప్టెంబర్‌లో చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మునిసిపాలిటీలకు గురువారం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. అదే విధంగా రెండేళ్ల క్రితం ఏర్పాటైన నగర పంచాయతీలకు సైతం పాలక వర్గాలు ఏర్పడటంతో ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడింది. -
అప్పుడు.. ఇప్పుడు..!
సాక్షి, మంచిర్యాల : పురపాలక అధ ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పోరులో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సత్తా తేలింది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎత్తుగడలు, కొందరు కౌన్సిలర్ల భవిష్యత్తు ఆలోచనతో టీడీపీ, కాంగ్రెస్‌లు చతికిలపడ్డాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క స్థానంలోనూ ఆ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు చైర్పర్సన్ సహా వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ అది కేవలం సాంకేతికమే. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అధ్యక్ష స్థానాల కైవసం చేసుకున్న పార్టీలు, గత పాలకమండలి ఏ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిందనే వివరాలు.. భైంసా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్పర్సన్ పీఠాన్ని ఎంఐఎం కైవ సం చేసుకుంది. కాంగ్రెస్‌కు కేవలం రెండు స్థానాలు దక్కగా టీడీపీ ఖాతాయే తెరవలేదు. ఈ మున్సిపాలిటీ గత చైర్పర్సన్ టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం. వైస్ చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి పీఠాన్ని అలంకరించారు. నిర్మల్ పురపాలక చైర్పర్సన్ స్థానాన్ని బీఎస్పీ, వైస్ చైర్పర్సన్ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న వారిలో ఐదుగురు విజయం సాధించగా టీడీపీ తరఫున ఒక్క కౌన్సిలర్ గెలవకపోవడం గమనార్హం. ఈ మున్సిపాలిటీ తాజా మాజీ పాలకవర్గంలో కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లే అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను అలంకరించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పీఠాన్ని టీఆర్ఎస్, వైస్ చైర్పర్సన్ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకుంది. కాంగ్రెస్ తరఫున ఏడుగురు కౌన్సిలర్లు విజయం సాధించగా టీడీపీ నుంచి బరిలో దిగిన వారు ఒక్కరూ గెలవలేదు. గత చైర్పర్సన్ కాంగ్రెస్‌కు చెందిన వారు కాగా వైస్ చైర్పర్సన్ ఎంఐఎం కౌన్సిలర్. మంచిర్యాల పురపాలక అధ్యక్షస్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 18 మంది కౌన్సిలర్లను గెలుచుకున్న హస్తం పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు ఝలక్ ఇవ్వడంతో ఆ పార్టీ బరిలో నిలవలేదు. తెలుగుదేశం తరఫున ఈ మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్‌ను నెగ్గకపోవడం ఆ పార్టీ స్థితికి అద్దం పడుతోంది. ఈ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు కాంగ్రెస్‌కు చెందిన వారే . బెల్లంపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలు రెండింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు తరఫున 14 మంది, టీడీపీ తరఫున ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లు గెలిచిన పార్టీని కాదని టీఆర్ఎస్ కౌన్సిలర్‌కు మద్దతివ్వడం వల్లే గులాబీ పార్టీ పుర పీఠాలను దక్కించుకోగలిగింది. గతంలో చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్, ైవె స్ చైర్‌పర్సన్‌గా టీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు పీఠాన్ని అలంకరించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాన్ని టీఆర్ఎస్ ద క్కించుకుంది. కాంగ్రెస్ తరఫున నలుగురు కౌన్సిలర్లు గెలవగా, టీడీపీ నుంచి ఒక్కరూ విజయం సాధించలేదు. గత పాలకవర్గంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పీఠాలను కాంగ్రెస్ దక్కించుకుంది. -
కొలువుదీరిన కొత్త సారథులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు మున్సిపాలిటీలకు కొత్త సారథులు ఎన్నికయ్యారు. పోలింగ్ నిర్వహించిన రెండు నెలల విరామం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక తంతు పూర్తిచేయడంతో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దాదాపు నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగిన పురపాలక సంఘాల పాలన.. గురువారంతో ముగిసింది. కొత్త సారథులు కుర్చీల్లో ఆసీనులు కావడంతో పురపాలికలు కళాత్మకంగా కనిపించాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు గురువారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేసి కుర్చీలు దక్కించుకున్నాయి. మేజిక్ సంఖ్య ఉన్నప్పటికీ పొరుగు పార్టీల ప్రలోభాలకు తలొగ్గకుండా ఆయా పార్టీలు జాగ్రత్తపడ్డాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ అంతా ఏకగ్రీవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఒక పురపాలక సంఘాన్ని దక్కించుకోగా, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్‌లు చెరో రెండు పురపాలక సంఘాలను సొంతం చేసుకున్నాయి. -
3 రోజులూ ఉత్కంఠే..
నేడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక క్షణ క్షణానికి మారుతున్న సమీకరణాలు.. జోరందుకున్న బేరసారాలు..కొత్త పొత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులు.. మొత్తంగా స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. వరుసగా మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మండల పరిషత్, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండడంతో ఈ మూడు రోజులూ రాజకీయమంతా వీటిచుట్టే తిరగనుంది. సంపూర్ణ మెజార్టీలేని స్థానాల్లోనూ టీఆర్ఎస్ చైర్మన్‌గిరీపై కన్ను వేయడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇటు పార్టీలు, అటు అభ్యర్థులు ఊపిరిబిగబట్టి ఎదురుచూస్తున్నారు. సంగారెడ్డి క్రైం: జిల్లాలో వరుసగా మూడు రోజులపాటు చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మున్సిపల్, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం జిల్లాలోని 46 మండలాలకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వరుస పరోక్ష ఎన్నికల నేపథ్యంలో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. క్షణక్షణానికి మారుపుతున్న రాజకీయ సమీకరణాలతో గురువారం జరగనున్న మున్సిపల్, నగర పంచాయతీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠతను రేపుతున్నాయి. మెజార్టీ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ కృతనిశ్చయంతో ఉంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గజ్వేల్ నగర పంచాయతీలో ఎక్స్అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారంటే ఆ పార్టీ ఎంతపట్టుదలగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు సంపూర్ణ మద్దతు ఉన్న జహీరాబాద్ మున్సిపాలిటీ, అందోలు నగర పంచాయతీలను కాపాడుకునే ప్రయత్నాలో నిమగ్నమైంది. ఆ మేరకు విప్‌ను అస్త్రంగా మలుచుకుంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. మరోవైపు శుక్రవారం జరగనున్న మండల పరిషత్, శనివారం జరగనున్న జెడ్పీ చైర్మన్ పదవులపైనా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి పెట్టాయి. క్షణ క్షణానికి మారుతున్న సమీకరణాలు మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి క్షణ క్షణానికి సమీకరణాలు మారుతున్నాయి. ఈక్రమంలోనే టీఆర్ఎస్ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మెదక్ మున్సిపాలిటీ, గజ్వేల్ నగర పంచాయతీతోపాటు తమకు సంపూర్ణ బలం లే నప్పటికీ సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్ చైర్మన్ స్థానాల ను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందుకోసం తమతో కలిసివ చ్చే బీజేపీ, టీడీపీ, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతు కూడగడుతోంది. మరోవైపు సంపూర్ణ మెజార్టీ ఉన్న సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట మున్సిపాలిటీల్లో ఎలాగైనా చైర్మన్‌పదవులను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఇదిలా ఉంటే మెదక్ మున్సిపాలిటీలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్‌లో గీతారెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జోగిపేట నగర పంచాయతీలో బాబూమోహన్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మండలపరిషత్లపైనా దృష్టి శుక్రవారం జరగనున్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపైనా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించాయి. ఇది వరకే రెండు పార్టీలు వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. కాగా టీఆర్ఎస్ మెజార్టీ మండల పరిషత్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం విప్‌ను అస్త్రంగా ప్రయోగించి తమకు బలం ఉన్నచోట చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. -
పుర పీఠం కోసం రె‘ఢీ’
సాక్షి, ఖమ్మం : పుర పాలక వర్గం కొలువుదీరేందుకు అంతా సిద్ధమైంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు మున్సిపాలిటీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక చైర్మన్ ‘పీఠ’ముడి ఉన్న మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. స్పష్టమైన మెజారిటీ రాని చోట చైర్మన్ పీఠానికి పోటీ పెరిగి రాజకీయం వేడెక్కింది. క్యాంపు రాజకీయంతో పుర పాలి‘టిక్స్’ జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం మూడు నెలల తర్వాత పుర చైర్మన్లు కొలువుదీరబోతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల ఎప్పుడు జరుగుతాయోనని వేచిచూడసాగారు. అయితే సార్వత్రిక ఎన్నికలు, నూతన ప్రభుత్వ ఏర్పాటుతో ఇంతకాలం వాయిదా పడిన ఈ ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గురువారం ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల నామినేషన్.. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారు వెంటనే ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీకి ఆర్డీఓ అమయ్‌కుమార్, ఇల్లెందుకు పాల్వంచ ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మధిరకు ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డి, సత్తుపల్లికి భద్రాచలం మొబైల్ కోర్టు జడ్జి వెంకటాచారి ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులయ్యారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొత్తగూడెం, మధిరలో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. క్యాంపు రాజకీయాలు తారుమారైతే ఎమ్మెల్యేల ఓటుతో గట్టెక్కిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఇటు క్యాంపు రాజకీయంతో పాటు తమ ఓటు కూడా కీలకం కావడంతో స్థానిక ఎమ్మెల్యేలు పుర పీఠం దక్కించుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. ‘అవుటాఫ్’లో క్యాంపులు.. స్పష్టమైన మెజారిటీ రాని మున్సిపాలిటీల్లో చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయం జోరందుకుంది. పీఠంపై ఎవరికి కూర్చోబెట్టాలనే విషయంలో స్థానికంగా ఉండే ప్రధాన నేతలతో ఎమ్మెల్యేలు మంతనాలు చేస్తున్నారు. క్యాంపులు కూడా వీరి పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు హైదరాబాద్ క్యాంపులో ఉన్నారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపులోనే చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే మధిరలో కాంగ్రెస్.. టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంది. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ కూటమిగా పోటీ చేశాయి. అయితే ఇప్పుడు టీడీపీతో కాంగ్రెస్‌తో అనైతిక పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్‌తో పాటు సీపీఐకి చెందిన కొందరు కౌన్సిలర్లు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కాగా, స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తమ పార్టీ కౌన్సిలర్లు ‘చే’జారకుండా హైదరాబాద్‌లో క్యాంపు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి చైర్మన్ పీఠంపై ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు కన్నేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వీరిని జిల్లా సరిహద్దులో క్యాంపునకు తరలించి సయోధ్య కుదిర్చే యత్నంలో మునిగారు. ఇక కొత్తగూడెంలో రాజకీయం రసకందాయంలో పడింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు పట్టణంలోనే ఉండి ఎవరు తమకు ప్యాకేజీ ఎక్కువ ఇస్తే వారి వైపే మొగ్గు చూపాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. విప్ జారీ చేసినా ఇప్పట్లో అనర్హత వేటు ఉండదని, ఆలోపు పదవి కాలం పూర్తవుతుందనే భరోసాతో కొందరు కౌన్సిలర్లు తాయిలాలకు సై అంటున్నట్లు సమాచారం. కాగా, మున్సిపల్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఎమవుతుందో కొద్ది గంటల్లో తేలనుంది. నాలుగేళ్లకు మున్సిపల్ పాలకవర్గం.. గత ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. దీంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు నూతన పాలక వర్గాలు కొలువుదీరుతున్నాయి. 2010 సెప్టెంబర్ 29న గత పాలక వర్గం పదవి కాలం పూర్తయింది. ఆ వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం పట్టించుకునే వారు లేకోపవడంతో మున్సిపాలిటీల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉండి పాలనను కొనసాగించారు. దీంతో ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏళ్లుగా పైపులైన్లకు లీకేజీలకు మరమ్మతులు లేకపోవడంతో కాలుషిత నీటిని తాగి పుర ప్రజలు రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు నూతనంగా పాలన పగ్గాలు చేపడుతున్న వారికి ఈ సమస్యలన్నీ తీర్చడం పెద్ద సవాలే. వచ్చిన నిధులన్నీ సకాలంలో ఖర్చు చేయక నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నూతన పాలకవర్గం ఈ సమస్యలన్నింటిపై దృష్టి పెడితేనే కొంతమేరైనా పుర ప్రజల సమస్యలు తీరనున్నాయి. -
టీడీపీకి తలపోటు
సాక్షి, గుంటూరు: ఇల్లు అలకగానే పండగ కాదు...ముందుంది ముసళ్ల పండగ అన్న చందంగా మారింది ప్రస్తుతం టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగైదు మున్సిపాలిటీలు మినహా మిగిలిన చోట్ల టీడీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయకుండా నలుగురైదుగురు ద్వితీయ శ్రేణి నాయకులకు ఆశచూపి ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు చేయించారు. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవ్వరికి లేదు. చైర్మన్ అభ్యర్థిగా భారీగా ఖర్చు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఏంచేయాలో పాలుపోని టీడీపీ నియోజకవర్గ బాధ్యులు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను కౌన్సిలర్ అభ్యర్థులుగా నిలిపి తమ జేబుకు చిల్లుపడకుండా చూసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుని తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. పార్టీ అధికారంలోకి రావడంతో పదవులను ఆశించిన నేతలు ఎవరూ పట్టువిడవక పోవడంతో సమస్యమరింత జఠిలమయింది. = ముఖ్యంగా మంగళగిరి, బాపట్ల, వినుకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. = బాపట్ల మున్సిపల్ చైర్మన్ పదవికి ఐదుగురు కౌన్సిలర్లు పోటీలో ఉన్నారు. తమకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను తమ వెంట తిప్పుకుంటూ తమకు పదవి కేటాయించకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ పరోక్షంగా పార్టీ నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు. = మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవిని ఎన్నికల ముందే ముగ్గురు పంచుకున్నారు. వీరిలో శ్రీదేవి మొదటి దఫా పదవి చేపట్టేలా ఒప్పందం చేసుకున్నప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. = వినుకొండ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎన్నికల ముందు మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించారు. తీరా మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను చైర్మన్‌గిరిపై పడింది. చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించాలంటూ పట్టుబట్టడంతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసేది లేక లాటరీ ద్వారా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు. = మంగళగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరు ఖరారైనప్పటికీ మరో ఇద్దరు కౌన్సిలర్లు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. చిరంజీవికి ఎమ్మెల్యే సీటు కేటాయించి, ఓటమి పాలైన వెంటనే మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెడితే పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటం టూ మహిళా సీనియర్ కౌన్సిలర్ ఒకరు జిల్లా టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. = ఇదిలా ఉంటే వైస్ చైర్మన్ పదవికి సైతం తీవ్ర పోటీ నెలకొనడంతో టీడీపీ నేతలు ఒత్తిడికి గురవుతున్నారు. = తమకు పదవులు ఇవ్వకపోతే ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి ఇప్పించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురౌతాయంటూ హెచ్చరిస్తున్నట్టు సమాచారం. -
కుర్చీ రెడీ
సాక్షి, ఏలూరు:పురపాలక ఎన్నికల్లో విజయం వరించినా.. పదవి చేపట్టే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలు గురువారం నెరవేరనున్నాయి. ‘పుర’ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాన్ని వైభవంగా నిర్వహించేందుకు గెలుపొందిన అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 291 మంది ప్రమాణ స్వీకారం పుర, నగరపాలక సంఘాల్లో 291 వార్డు/కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. వాటిలో 217 మంది టీడీపీ అభ్యర్థులు, 56 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఐదుగురు బీజేపీ, 12 మంది స్వతంత్రులు, ఒక సీపీఎం అభ్యర్థి గెలుపొందారు. వీరంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మేయర్, చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఆ వెంటనే డెప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ పదవుల కోసం టీడీపీ నేతలు క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ తరఫున గెలుపొందిన వారిని పొరుగు జిల్లాలకు తరలించి సకల సదుపాయాలు కల్పించారు. వారందరినీ నేరుగా పురపాలక, నగరపాలక కార్యాలయూలకు తీసుకువచ్చి తమకు అనుకూలమైన వ్యక్తిని ఎన్నుకునేలా ఏర్పాట్లు చేశారు. పీఠాలు వీరికే! నగర మేయర్, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థులను టీడీపీ దాదాపుగా ఖరారు చేసింది. వారికే ఓటు వేయాలని విప్ జారీ చేసింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి ఈసారి బీసీ మహిళను వరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ ముజుబూర్ రెహమాన్ భార్య షేక్ నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్‌ను చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించారు. భీమవరంలో కొటికలపూడి గోవిందరావు(చినబాబు)ను ఎంపిక చేశారు. పాలకొల్లులో వల్లభు నారాయణమూర్తి, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి బంగారు శివలక్ష్మి, నిడదవోలుకు బొబ్బా కృష్ణమూర్తిని ఎంపిక చేశారు. నరసాపురంలో ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఓటు వేయనున్నారు. ఇక్కడ పసుపులేటి రత్నమాల చైర్మన్ కావాలనుకుంటున్నారు. కొవ్వూరులో సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), జొన్నలగడ్డ రాధారాణిలకు చైర్మన్ పదవిని రెండున్నరేళ్ల చొప్పున పంచుతున్నారు. తణుకులోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ దొమ్మేటివెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు చెరో రెండున్నరేళ్లు పీఠంపై కూర్చోనున్నారు. నరసాపురంలో పసుపులేటి రత్నమాల చైర్మన్ పదవికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యుల సంఖ్య .. పార్టీల వారీగా ఏలూరు (50 వార్డులు ) టీడీపీ 41, వైఎస్సార్ సీపీ 8, ఇండిపెండెంట్ 1 తాడేపల్లిగూడెం (35 వార్డులు) టీడీపీ 24, వైఎస్సార్ సీపీ 7, బీజేపీ 1, సీపీఐ 1, ఇండిపెండెంట్లు 2 పాలకొల్లు (31 వార్డు) టీడీపీ 25, వైఎస్సార్ సీపీ 5, ఇండిపెండెంట్ 1 నరసాపురం (31 వార్డులు) టీడీపీ 14, వైఎస్సార్ సీపీ 14, ఇండిపెండెంట్లు 3 నిడదవోలు (28 వార్డులు) టీడీపీ 18, వైఎస్సార్ సీపీ 9, బీజేపీ 1 కొవ్వూరు (23 వార్డులు) టీడీపీ 21, ఇండిపెండెంట్లు 2 తణుకు (34 వార్డులు) టీడీపీ 32, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 భీమవరం (39 వార్డులు) టీడీపీ 26, వైఎస్సార్ సీపీ 11, బీజేపీ 2 జంగారెడ్డిగూడెం (20 వార్డులు) టీడీపీ 16, వైఎస్సార్ సీపీ 2, ఇండిపెండెంట్లు 2 -
పుర కిరీటధారులెవరో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సుదీర్ఘ విరామానంతరం పురపాలక సంఘాలు కొత్త కళ సంతరించుకోనున్నాయి. 2010లో పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు ముగిసింది. ఆ వెనువెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అప్పటి ప్రభుత్వం మాత్రం దాటవేసింది. దీంతో పురపాలక సంఘాలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాయి. ఇటీవల వీటికి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఐదింటికి కొత్త సారథులు జిల్లాలో తాండూరు, వికారాబాద్ పురపాలక సంఘాలున్నాయి. కొత్తగా ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట్, బడంగ్పేట్లు నగర పంచాయతీలుగా ఆవిర్భవించాయి. వీటికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీటి ఫలితాల ప్రక్రియ వాయిదా పడింది. పురపాలక సంఘాల్లో ఎక్స్అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాతే వీటి ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎక్స్అఫీషియో సభ్యుల ప్రమాణం పూర్తయిన నేపథ్యంలో చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమమైంది. గురువారం ఉదయం జిల్లాలోని ఐదు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఉత్కంఠభరితం పురపాలక ఎన్నికలు ముగిసి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో స్పష్టత లేని మెజార్టీ ఉన్న సంఘాల్లో కొత్త సమీకరణలకు తెరలేచింది. ఇబ్రహీంపట్నం, పెద్డ అంబర్పేట్ నగర పంచాయతీల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మెజార్టీ ఉంది. అదేవిధంగా వికారాబాద్, బడంగ్‌పేట కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. తాండూరులో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అన్ని పార్టీలూ చైర్మన్ పీఠంపై గురిపెట్టాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలాగైనా కుర్చీ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా.. 10 స్థానాలు సాధించిన ఎంఐఎం సైతం తీవ్రంగా పోటీ పడుతోంది. మరెవైపు కాంగ్రెస్ పార్టీ సైతం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఆఖరి నిమిషంలో పురపోరు రసవత్తరంగా మారింది. -
స్థానిక పాలకుల ఎన్నికకు రంగం సిద్ధం
కర్నూలు (అర్బన్): జిల్లాలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకుల ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జూలై 4న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, 5న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. వీరిని ఎన్నుకునేందుకు ముందుగా ఆయా మండలాల్లో కో ఆప్షన్ సభ్యున్ని, జిల్లా పరిషత్‌లో ఇద్దరు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. మండలా ధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ మండలానికి గెజిటెడ్ అధికారిని ఎన్నికల అధికారిగా నియమిస్తారు. వీరి నేతృత్వంలోనే మండల పరిషత్ పాలకులను ఎన్నుకుంటారు. సోమవారంలోగా గెజిటెడ్ అధికారి నియమిస్తారు. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక: జూలై 4న జిల్లాలోని 53 మండలాల్లోని సమావేశ భవనాల్లో ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ముందుగా ఉదయం 10గంటలకు కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. 10నుంచి 12గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 12గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను ప్రచురిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం ఫలితాలను ప్రకటించి ఎన్నికైన కో ఆప్షన్ సభ్యునిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి తమ ఓటింగ్‌ను తెలియజేస్తారు. ఏదైనా కారణంతో కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక: జూలై 5న జిల్లా పరిషత్‌లోని సమావేశ భవనంలో జెడ్పీటీసీలతో కలెక్టర్ నియమించిన గెజిటెడ్ అధికారి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. 10నుంచి 12గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 12గంటలకు నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను ప్రచురిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం ఫలితాలను ప్రకటించి ఎన్నికైన కోఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఏదైనా కారణంతో కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగకపోతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా వాయిదా వేసి సమాచారాన్ని వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తారు. మరుసటి రోజు తిరిగి ఎన్నికను నిర్వహిస్తారు. 53మంది ప్రిసైడింగ్ అధికారులు కర్నూలు(అర్బన్) : మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహణకు 53మంది ప్రిసైడింగ్ అధికారులను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి నియమించినట్లు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఎం.జయరామిరెడ్డి తెలిపారు. నియమించబడిన అధికారులు, ఎంపీడీఓలకు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ఒకరోజు శిక్షణ ఇస్తామన్నారు. -
ప్రజాపాలనకు సన్నాహాలు
సాక్షి, కర్నూలు: కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో త్వరలో పురపాలక, జిల్లా, మండల పరిషత్తుల పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు కూడా వెలువడినా ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వం విషయంలో నెలకొన్న సందిగ్ధంతో ప్రమాణ స్వీకారాలు జరగలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో స్థానిక పురపాలక, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దీనికి సానుకూలంగా ఉండటంతో త్వరలోనే వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదా పు రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. పరిషత్తులకూ: పురపాలక పాలకమండళ్ల ప్రమాణస్వీకార ప్రక్రియ ముగిసిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాలో 53 మండలాల్లో 30 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీకి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏకపక్ష మెజార్టీ లభించింది. మండల పరిషత్ అధ్యక్ష పీఠాలూ ఎక్కువగానే వైఎస్సార్సీపీ ఖాతాలో చేరనున్నాయి. పురపాలికల్లో: జిల్లాలో కర్నూలు కార్పొరేషన్, బనగానపల్లె పురపాలక సంఘానికి తప్ప మిగిలిన నంద్యాల, నందికొట్కూరు, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఉండగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం కోసం ఎదురుచూస్తున్నారు. పాలకమండళ్లు ఏర్పడ్డాక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే ఆయా ఖజానాలకు జమ కానుండగా, ఇదే సమయంలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది. త్వరితగతిన కౌన్సిల్ ఏర్పడితే కేంద్రనిధులు, స్థానిక బడ్జెట్ నిధులతో తమ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీరంతా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. మరోపక్క కౌన్సిల్లో కీలకమైన ఎక్స్అఫిషియో సభ్యత్వంపై చర్చ సాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే సంబంధిత పురపాలక సం ఘంలో ఎక్స్అఫిషియో సభ్యులుగా వ్య వహరిస్తారు. ఎంపీలు కూడా వారి ని యోజకవర్గాల పరిధిలో తమకు నచ్చిన పురపాలికలో సభ్యత్వాన్ని పొందవచ్చు. చైర్మన్ ఎంపిక క్లిష్టతరమైనప్పుడు వీరి ఓటు కీలకమవుతుంది. మార్గదర్శకాలు ఇలా: = రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక తేదీకి సంబంధించి ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. = వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు గెజిటెడ్ హోదా గల అధికారి ప్రొసీడింగ్ అధికారిగా నియమిస్తారు. =ఎన్నికల సంఘం ఖరారు చేసిన రోజున ఎన్నికైన వార్డు సభ్యులు హజరుకావాలని నోటీసులు జారీ చేస్తారు. మొత్తం సభ్యులలో సగం మంది తప్పనిసరిగా హాజరుకావాలి. లేనిపక్షంలో ఎన్నిక వాయిదా పడుతుంది. =తొలుత వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు విప్ జారీచేసే అధికారం ఉంది. ఆయా పార్టీలు ముందుగా తమ సభ్యులకు చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థుల్లో ఎవరిని బలపరచాలనే అంశంపై విప్ జారీ చేస్తాయి. విప్లో ఉన్న అంశాన్ని ముందుగా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారికి తెలియజేయాలి. ఎవరైనా పార్టీ విప్‌ను ధిక్కరిస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా ప్రొసీడింగ్ అధికారికి తెలియపరిస్తే నమోదు చేసుకుంటారు. = తర్వాత ఎన్నిక ప్రక్రియ చేతులు ఎత్తే పద్ధతిలో జరుగుతుంది. ఏదైనా కారణంతో చైర్మన్ ఎన్నిక జరగకపోతే వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరగదు. ఏ సభ్యుడైనా పార్టీ విప్‌ను ధిక్కరించినా ఆ ఓటును చెల్లుబాటుగానే పరిగణిస్తారు. తర్వాత పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ వివరణ కోరుతూ ప్రొసీడింగ్ అధికారి ఆ వార్డు సభ్యునికి నోటీసు జారీ చేస్తారు. ఆయన సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా సభ్యుని పదవి రద్దు విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ సభ్యుడు పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది.