3 రోజులూ ఉత్కంఠే..
నేడు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
క్షణ క్షణానికి మారుతున్న సమీకరణాలు.. జోరందుకున్న బేరసారాలు..కొత్త పొత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులు.. మొత్తంగా స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. వరుసగా మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మండల పరిషత్, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ఉండడంతో ఈ మూడు రోజులూ రాజకీయమంతా వీటిచుట్టే తిరగనుంది. సంపూర్ణ మెజార్టీలేని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ చైర్మన్‌గిరీపై కన్ను వేయడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇటు పార్టీలు, అటు అభ్యర్థులు ఊపిరిబిగబట్టి ఎదురుచూస్తున్నారు.
సంగారెడ్డి క్రైం: జిల్లాలో వరుసగా మూడు రోజులపాటు చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మున్సిపల్, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం జిల్లాలోని 46 మండలాలకు సంబంధించి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వరుస పరోక్ష ఎన్నికల నేపథ్యంలో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. క్షణక్షణానికి మారుపుతున్న రాజకీయ సమీకరణాలతో గురువారం జరగనున్న మున్సిపల్, నగర పంచాయతీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠతను రేపుతున్నాయి. మెజార్టీ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని టీఆర్‌ఎస్ కృతనిశ్చయంతో ఉంది.
టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గజ్వేల్ నగర పంచాయతీలో ఎక్స్‌అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారంటే ఆ పార్టీ ఎంతపట్టుదలగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకు సంపూర్ణ మద్దతు ఉన్న జహీరాబాద్ మున్సిపాలిటీ, అందోలు నగర పంచాయతీలను కాపాడుకునే ప్రయత్నాలో నిమగ్నమైంది. ఆ మేరకు విప్‌ను అస్త్రంగా మలుచుకుంది. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. మరోవైపు శుక్రవారం జరగనున్న మండల పరిషత్, శనివారం జరగనున్న జెడ్పీ చైర్మన్ పదవులపైనా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి పెట్టాయి.
క్షణ క్షణానికి మారుతున్న సమీకరణాలు
మున్సిపాలిటీ, నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి క్షణ క్షణానికి సమీకరణాలు మారుతున్నాయి. ఈక్రమంలోనే టీఆర్‌ఎస్ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మెదక్ మున్సిపాలిటీ, గజ్వేల్ నగర పంచాయతీతోపాటు తమకు సంపూర్ణ బలం లే నప్పటికీ సంగారెడ్డి, జోగిపేట, జహీరాబాద్ చైర్మన్ స్థానాల ను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.
ఇందుకోసం తమతో కలిసివ చ్చే బీజేపీ, టీడీపీ, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతు కూడగడుతోంది. మరోవైపు సంపూర్ణ మెజార్టీ ఉన్న సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట మున్సిపాలిటీల్లో ఎలాగైనా చైర్మన్‌పదవులను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఇదిలా ఉంటే మెదక్ మున్సిపాలిటీలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జహీరాబాద్‌లో గీతారెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జోగిపేట నగర పంచాయతీలో బాబూమోహన్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మండలపరిషత్‌లపైనా దృష్టి
శుక్రవారం జరగనున్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపైనా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించాయి. ఇది వరకే రెండు పార్టీలు వేర్వేరుగా క్యాంపులు నిర్వహిస్తున్నాయి. కాగా టీఆర్‌ఎస్ మెజార్టీ మండల పరిషత్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. మరోవైపు కాంగ్రెస్ సైతం విప్‌ను అస్త్రంగా ప్రయోగించి తమకు బలం ఉన్నచోట చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది.