నంద్యాల: పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు శిల్పావర్గానికి దక్కాయి. దీంతో నంద్యాల అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికై 15 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేసిన ఫరూక్ మాట చెల్లుబాటు కాలేదు. కనీసం రెండు పదవుల్లో ఏదో ఒకటి అప్పగిస్తారని ఆయన వర్గానికి చెందిన కౌన్సిలర్లు భావించారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి తన వర్గానికి చెందిన కౌన్సిలర్లు దియ్యాల సులోచన, మామిడి ఉషారాణిలను చైర్మన్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని పట్టుబట్టారు.
ఈ మేరకు సులోచన భర్త మాజీ కౌన్సిలర్ రంగప్రసాద్, ఉషారాణి భర్త మామిడి నాగరాజులకు ఫరూక్ పరోక్షంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరికి ఊహించిన విధంగానే మాజీ కౌన్సిలర్ దేశం సుధాకర్‌రెడ్డి సతీమణి సులోచన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్‌లను చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించాయి. వీరు 2004 నుంచి 2014 వరకు శిల్పా అనుచరులుగా కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల ముందు శిల్పా వెంట టీడీపీలోకి వచ్చి రెండు పదవులు వారే దక్కించుకోవడంతో ఫరూక్ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎందుకు ఫరూక్‌కు ప్రాధాన్యత లభించలేదో అర్థం కావడం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
దేశం కండువాల్లో కూడా ఫరూక్ చిత్రం గల్లంతు..
గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన టీడీపీ కౌన్సిలర్లు పచ్చకండువాలతో హాజరయ్యారు. అయితే వారు వేసుకున్న కండువాల్లో చంద్రబాబుతో పాటు శిల్పామోహన్‌రెడ్డి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఫరూక్ చిత్రం లేకపోవడాన్ని పలువురు విలేకరులు కౌన్సిలర్లను ప్రశ్నించగా అలాంటిదేమీలేదని ఎన్నికల సమయంలోని కండువాలని వివరించారు. చివరికి ఫరూక్ వర్గంగా భావిస్తున్న దియ్యాల సులోచన, మామిడి ఉషారాణిలు కూడా శిల్పా ఫొటోలు ఉన్న కండువా వేసుకోవడం గమనార్హం.
అయిష్టంగానే చేతులెత్తిన దియ్యాల, చంద్రావతి..
నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ పదవి కోసం పోటీ పడి నాలుగో వార్డు నుంచి ఎన్నికైన దియ్యాల సులోచన, 17వ వార్డు నుంచి ఎన్నికైన చంద్రావతి అయిష్టంగానే చేతులెత్తారు. దేశం సులోచనకు మద్దతు ఇచ్చే సభ్యులు చేతులెత్తాలని ప్రిసైడింగ్ ఆఫీసర్, ఆర్‌డీఓ నరసింహులు కోరారు. ఎవరు చేతులెత్తలేదని ముందుగా కూర్చుకున్న వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, అనిల్ అమృతరాజ్‌లు వెనక్కి చూడగా అప్పుడు వారిద్దరు బలవంతంగా పూర్తి స్థాయిలో చేతులెత్తారు. మొత్తం మీద చైర్మన్ పదవి దక్కలేదనే అసంతృప్తి వారిలో వ్యక్తమైంది.
స్వేచ్ఛగా వైఎస్సార్సీపీ...
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు స్వేచ్ఛగా హాజరయ్యారు. 13మంది కౌన్సిలర్లు ఎవరికి వారు సొంత వాహనాల్లో మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. అదే టీడీపీకి చెందిన వారిలో చైర్మన్ ఎంపికలో బేధాభిప్రాయాలు ఉండటంతో 29 మంది కౌన్సిలర్లను బుధవారం రాత్రి ఒక చోటకు చేర్చారు. అక్కడి నుంచి నేరుగా గురువారం ఉదయం కార్యాలయానికి తీసుకొచ్చారు.
టీడీపీ సభ్యుడి ఆంగ్లంలో ప్రమాణం..
టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు పడకండ్ల సుబ్రమణ్యం ఆంగ్లంలో ప్రసంగం చేయడం పలువురిని విస్మయానికి గురి చేసింది. తెలుగు అనర్గలంగా మాట్లాడే సుబ్రమణ్యం టీడీపీలో ఉంటూ తెలుగులో ప్రమాణస్వీకారం చేయకపోవడంపై చర్చనీయాంశమైంది. ఈయన 9వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
42 మంది కౌన్సిలర్లలో ఏడుగురు నిరక్షరాస్యులే...
నంద్యాల పురపాలక సంఘం కౌన్సిలర్లుగా ఎన్నికైన 42 మందిలో మొత్తం ఏడుగురు నిరక్షరాస్యులని తేలింది. అందులో వైఎస్సార్సీపీకి చెందిన 13మందిలో ఇద్దరు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన 29మంది కౌన్సిలర్లలో ఐదుగురు నిరక్షరాస్యులని ప్రమాణస్వీకారం సందర్భంగా తేలింది. టీడీపీ కౌన్సిలర్‌లుగా 1,3, 8, 31,42 వ వార్డుల నుంచి గెలుపొందిన మాతంగి కన్నమ్మ, ఎన్‌కే సర్తాజ్, నూర్జహాన్, ఫాతిమున్నిసా, సోనాల పిల్లి లక్ష్మీదేవిలతో పాటు వైఎస్సార్సీపీ నుంచి 2,32 వ వార్డుల నుంచి గెలుపొందిన గొరెముర్తుజా, ఎ. చెన్నమ్మలు ఎన్నికల అధికారులు ఇచ్చిన ప్రమాణస్వీకార పత్రాన్ని చదవలేకపోయారు. వీరితో ఆర్‌డీఓ చదివించారు.
ఫరూక్ వర్గానికి ఝలక్
Published Fri, Jul 4 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement