సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో మునిసిపల్, నగర పంచాయతీల చైర్మన్ల ఎన్నిక గురువారం ఆసక్తికరంగా సాగింది. ఎనిమిది మునిసిపాలిటీల్లో మూడింటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరో మూడింటిని టీడీపీ దక్కించుకున్నాయి. ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీల చైర్మన్ల ఎన్నికలు మాత్రం రసవత్తరంగా ముగిసాయి. ఈ రెండు నగర పంచాయతీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినవారే కావటం గమనార్హం.
జిల్లాలో నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు మునిసిపాలిటీలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీల చైర్మన్ల స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్న స్థానాలను బలవంతంగా లాక్కునేందుకు తెలుగు తమ్ముళ్లు ఎత్తులు వేశారు.
అందులో భాగంగా మాజీ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించారు. తాను చెప్పినట్టు వింటే గూడూరు నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెడుతానని, పనులు ఇప్పిస్తానని పలువురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై విష్ణువర్ధన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరకపోయినా విష్ణు చెప్పినదానికి అంగీకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలుపొందిన ఇందిర సుభాషిణిని చైర్‌పర్సన్‌గా, రామాంజనేయులును వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది..
ఆత్మకూరు నగర పంచాయతీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో 10 వైఎస్సార్ సీపీ (ఒకరు మృతి), 9 టీడీపీ దక్కించుకోగా.. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. ఈయన కూడా వైఎస్సార్‌సీపీ మద్దతుతోనే గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి సలాంకు చైర్మన్ పదవి ఆశచూపి టీడీపీ వైపు తిప్పుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పథకాన్ని పన్నారు.
చైర్మన్ పదవి ఇస్తే ముగ్గురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతారని ఆశ చూపారు. దీంతో టీడీపీ నేతలు ఒప్పుకుని ముగ్గురు కౌన్సిలర్లకు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే నూర్‌అహ్మద్‌నే చైర్మన్‌గా ఎన్నుకున్నారు. చైర్మన్ ఎన్నిక అయ్యాక పార్టీ మారిన ముగ్గురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకుని బాణా సంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని చూసి తమ్ముళ్లు ఖంగుతిన్నారు.
ఆదోనిలో ఫలించని తమ్ముళ్ల ప్రలోభాలు..
ఆదోని మునిసిపాలిటీని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు రకరకాల ఎత్తులు వేశారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు నగదు ముట్టజెప్పేందుకు ప్రయత్నించారు. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వటానికి సిద్ధమయ్యారు. అదే విధంగా మరి కొందరికి పదవులు కట్టబెడుతామని, ఇంకొందరికి డీలర్‌షిప్‌లు ఇప్పిస్తామని ఆశచూపారు. అదే విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు పలు ప్రయోజనాలు కల్పిస్తామని ప్రాధేయపడ్డారు. అయితే ఏ ఒక్కరూ టీడీపీ నేతల ప్రలోభాలకు లోనుకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచామని, ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. అందులో భాగంగానే అందరూ కౌన్సిలర్లు కలసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నుకున్నారు.
ఎట్టకేలకు కొలువైన పాలకవర్గాలు..
సుమారు మూడున్నరేళ్ల తరువాత మునిసిపాలిటీలకు పాలకవర్గాలు కొలువయ్యాయి. 2010 సెప్టెంబర్‌లో చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మునిసిపాలిటీలకు గురువారం చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. అదే విధంగా రెండేళ్ల క్రితం ఏర్పాటైన నగర పంచాయతీలకు సైతం పాలక వర్గాలు ఏర్పడటంతో ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3.. తెలుగుదేశం పార్టీకి 3
Published Fri, Jul 4 2014 1:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement
Advertisement