హస్తం.. హవా
- మూడు మునిసిపాలిటీలు కాంగ్రెస్ పరం
- మరో రెండు నగర పంచాయతీల్లోనూ పాగా
- కాంగ్రెస్ దోస్తీతో బీజేపీకి లబ్ధి
- పాలమూరులో ఫలించని టీఆర్‌ఎస్ వ్యూహం
- కాంగ్రెస్ సభ్యుడి మద్దతుతో టీడీపీకే వనపర్తి
- కల్వకుర్తిలో వైఎస్‌ఆర్‌సీపీకి వైస్‌చైర్మన్ పీఠం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎట్టకేలకు ‘పుర’సమరానికి తెరపడింది. ‘నువ్వా..నేనా!’ అనే రీతిలో ఉత్కంఠభరితంగా సాగిన మునిసిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ల పరోక్ష ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీతో దోస్తీ కట్టిన కాంగ్రెస్ మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. అధికారపార్టీ టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపినా.. జిల్లాలో ఒకేఒక్క నగర పంచాయతీని మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ పక్కాప్లాన్‌గా అడుగులు వేసి మూడుచోట్ల వైస్ చైర్మన్ పీఠాలను సాధించుకోగలిగింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మరోచోట వైస్‌చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. టీఆర్‌ఎస్‌కు సొంత బలం ఉన్న అయి జ నగర పంచాయతీలో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తన ఖాతాలో
వేసుకోగలిగింది. సొంత బలంతో నారాయణపేట మునిసిపాలిటీ పీఠాన్ని బీజేపి దక్కించుకుంది. బీజేపీతో కలిసి వనపర్తి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాం గ్రెస్ పావులు కదిపినా చివరకు టీడీపీ పైచేయి సాధించింది. కల్వకుర్తి నగర పం చాయతీలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పర సహకారంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాయి.
మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. రెండు పార్టీల తరఫున చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ, టీడీపీ మద్దతుతో 23ఓట్లు సాధించిన 38వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రాధ అమర్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ తరఫున చైర్మన్‌గా నామినేషన్ వేసిన వనజాకు 21 ఓట్లు లభిం చాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఓట్లు వేసినా టీడీపీ మేజిక్ ఫిగర్‌ను సాధించలేకపోయింది. కాంగ్రెస్ శిబిరంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదని ఓటింగ్ సరళి వెల్లడించింది.
వనపర్తి మునిసిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహించారు. బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించినా సొంత పార్టీ కౌన్సిలర్ విప్‌ను ధిక్కరించి టీడీపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలికాడు. దీంతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి రమేశ్‌గౌడ్‌కు 14 ఓట్లు, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి లోక్‌నాథ్‌రెడ్డికి 13 ఓట్లు లభించాయి. వైస్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.కృష్ణ, టీఆర్‌ఎస్ వైస్ చైర్మన్ అభ్యర్థి గట్టు యాదవ్‌కు 13 ఓట్లు లభించాయి.
నాగర్‌కర్నూల్ నగర పంచాయతీలో బీజేపీతో జట్టు కట్టిన కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీ నంది ఎల్లయ్య ఎక్స్‌అఫీషియో సభ్యుడి హోదాలో ఎన్నికకు హాజరయ్యారు. తగి న సంఖ్యాబలం లేకపోవడంతో చివరి నిముషంలో టీఆర్‌ఎస్ ఎన్నికల బరినుం చి తప్పుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కల్వకుర్తి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య అవగాహన కుదరడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తొలి మూడేళ్లు కాంగ్రెస్, చివరి రెండేళ్లు వైఎస్‌ఆర్ సీపీకి చైర్మన్ పదవి దక్కేవిధంగా పరస్పరం అంగీకారం కుదిరినట్లు సమాచారం.
గద్వాల, షాద్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
నారాయణపేట మునిసిపాలిటీలో బీజేపీ, అయిజ నగర పంచాయతీలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.