location panchayat
-
ఉద్రిక్తత నడుమ ఆక్రమణల తొలగింపు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కడప రోడ్డులో ఉన్న సర్వే నంబరు 606బిలో ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంలో కొందరు దళితులు చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరి కొందరు దుకాణలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా చర్చ సాగింది. శుక్రవారం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందొబస్తు నడుమ తొలగింపుకు పూనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న ఎనిమిది దళిత కుటుంబాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ తరుణంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత మూడు జేసీబీలతో అక్రమణలను తొలగించారు. అనంతరం కమిషనర్ భవానీ ప్రసాద్ విలేకరులతో మట్లాడుతూ.. ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని బాడుగలకు ఇస్తూ కిరాయిను వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ స్థలంలో ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చారన్నారు. వీరికి ఇందిరమ్మ కాలనీలో స్థలం కేటాయిస్తామని చెప్పామన్నారు. ప్రభుత్వ స్థలంలో మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, వేంపల్లె రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిని పంచాయతీ సిబ్బంది కూల్చి వేశారు. ఆ సమయంలో ఆ ఇంటికి చెందిన వ్యక్తి అక్కడ లేకపోడంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. ఇంట్లో ఉన్న సామాన్లు నోట్ చేసి బయటకు తరలించారు. -
ఎవరి మెడకో!
హుజూరాబాద్ నగరపంచాయతీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక! ♦ ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో ఆందోళన ♦ సెలవుపై వెళ్లిన కమిషనర్ అబిద్ అదేబాటలో మేనేజర్? ♦ ఇన్చార్జి కమిషనర్‌గా ఎన్వీ నాగేంద్రబాబు ♦ బిల్లులు సర్ధుకునే పనిలో కౌన్సిలర్లు? హుజూరాబాద్ నగర పంచాయతీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాకా కమిషనర్‌గా పనిచేసిన మహ్మద్ అబీద్ ఉన్నట్టుండి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నగర పంచాయతీలో అక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలు పాలకవర్గాన్ని, అధికారులను కుదిపేశారుు. అవినీతి, అక్రమాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ అధికారులు ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు తెలిసింది. మరోవైపు కలెక్టర్ నీతూప్రసాద్ సైతం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఫలితంగా పలువురు అధికారుల్లో ఆందోళన మొదలు కాగా, వీలైనంత త్వరగా బిల్లులు దక్కించుకునే పనిలో కౌన్సిలర్లు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ నగర పంచాయతీ పరిధిలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అభివృద్ధి పనులకు టెండర్లలో సింహభాగం సింగిల్ టెండర్లు దాఖలు కావడం, అందులోనూ చాలా వరకు ఎక్సెస్ వేయడం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, మోడల్ చెరువులోని చెట్లను నరికి విక్రయించారనే అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంటెలిజెన్స్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో నగర పంచాయతీ కమిషనర్ సయ్యద్ అబిద్ నాలుగు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయూరు. ఆయన స్థానంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబు బదిలీపై హుజూరాబాద్ నగర పంచాయతీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమితులయ్యారు. ‘దీర్ఘకాలిక సెలవు’ ఆంతర్యమేంటో? ‘సాక్షి’లో వచ్చిన కథనాల నేపథ్యంలో కమిషనర్ అబిద్‌కు నగర పంచాయతీ చైర్మన్ వి.విజయ్‌కుమార్ రెండు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లకు బదులు వివరణలో బాక్స్ టెండర్లని ఎలా పేర్కొన్నారని, దీనివల్ల కౌన్సిల్ విలువ తగ్గిపోతోందనేది మొదటి నోటీసులోని సారాంశం. మరో నోటీసులో ‘కమిషనర్ స్థానికంగా నివాసం ఉండటం లేదు. నాన్ ట్యాక్స్ కలెక్షన్లు జరగడం లేదు. సంక్షేమ పథకాల అమలులో పర్యవేక్షణ లోపం ంటోంది. మొక్కుబడిగా వార్డు సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యుటేషన్, జన్మదిన పత్రాలు, అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది. పారిశుధ్య సిబ్బందిపై పర్యవేక్షణ లేదు’ అని పేర్కొంటూ ఈ ప్రశ్నలన్నింటికీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వడంతోపాటు పనితీరు మార్చుకున్నట్లు రుజువు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ అవినీతి, అక్రమాల వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. బిల్లులెలా? ప్రస్తుతం నగర పంచాయతీలో బిల్లుల చెల్లింపు సమస్య పాలకవర్గాన్ని వేధిస్తోంది. బిల్లుల చెల్లింపు జరగాలంటే కమిషనర్ తప్పనిసరిగా ఉండాలి. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో చెక్ పవర్‌ను మేనేజర్‌కు దఖలు పరుస్తూ తీర్మానించారు. మేనేజర్ సైతం ఈ వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. కమిషనర్ లేకపోవడం, మేనేజర్ సెలవుపై వెళ్లడంతో బిల్లుల చెల్లింపులు ఆగిపోయూరుు. దీంతో ఆందోళన చెందిన కొందరు పాలకవర్గ సభ్యులు ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబును హుజూరాబాద్ నగరపంచాయతీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించే కమిషనర్ ఎలా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అభివృద్ధి పనుల టెండర్లను కాంట్రాక్టర్ల ముసుగులో దక్కించుకున్న కొందరు కౌన్సిలర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే తొందరగా పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆయా పనులకు అవసరమైన నీటిని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయిస్తూ పనులు జరుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు కౌన్సిలర్లే ప్రత్యక్షంగా పనులు చేస్తున్నప్పటికీ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండటంతో ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయం కాంట్రాక్టర్లను వెంటాడుతోంది. -
నగర పంచాయతీల్లో పన్నుల మోత!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కొత్త ప్రభుత్వం మార్గాలు అన్వేషిస్తోంది. వీటి పరిధిలో ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల మోత మోగించాలని నిర్ణయించింది. ఆయా పురపాలక సంఘాల్లో అభివృద్ధికయ్యే నిధులను స్థానికంగా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పన్నుల వడ్డనకు ప్రతిపాద నలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీల ప్రజలపై పన్నుల భారం పడనుంది. ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను సహా పలు కేటగిరీల టాక్సులపై ప్రతిపాదనలు పంపాలని నగర పంచాయతీల కమిషనర్లకు రాష్ట్ర పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పన్నుల పెంపుపై పురపాలికల యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది. నాలుగు నగర పంచాయతీల పరిధిలో సాలీనా రూ.10 కోట్ల ఆదాయం రాకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పన్ను అసెస్మెంట్ పరిధిలోకి రాని కట్టడాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. భారమే.. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలుగా ఉండి... ఇటీవల నగర పంచాయతీలుగా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజలపై వివిధ రకాల పన్నుల మోత మోగనుంది. కేవలం ఒకట్రెండు పన్నులు చెల్లింపుతో మమ అనిపించే స్థానికులు ఇకపై అనేక రూపాల్లో పన్నులు చెల్లించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను, బెటర్మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను తదితరాల మదింపుపై పురపాలక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు. ఈ నేపథ్యంలో అన్ అసెస్డ్ ప్రాపర్టీలను గుర్తించడం ద్వారా రాబడి పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అంతే కాకుండా పన్నుల నిర్ధారణలో హేతుబద్ధత పాటించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించిన క్రమంలో... ప్రతి ఇంటి నీ సర్వే చేయాలని నిర్ణయించింది. పంచాయతీలతో పోలిస్తే నివాస గృహాలపై ఆస్తిపన్ను భారం రెట్టింపు కానుంది. అదేసమయంలో వాణిజ్య భవనాల టాక్సులు గణనీయంగా పెరిగే అవకాశముంది. పంచాయతీలతో పోలిస్తే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు అడ్డగోలుగా పెరిగాయని ఆందోళనతో ఉన్న స్థానికులకు తాజా ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల పెంపే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. -
హస్తం.. హవా
- మూడు మునిసిపాలిటీలు కాంగ్రెస్ పరం - మరో రెండు నగర పంచాయతీల్లోనూ పాగా - కాంగ్రెస్ దోస్తీతో బీజేపీకి లబ్ధి - పాలమూరులో ఫలించని టీఆర్ఎస్ వ్యూహం - కాంగ్రెస్ సభ్యుడి మద్దతుతో టీడీపీకే వనపర్తి - కల్వకుర్తిలో వైఎస్ఆర్సీపీకి వైస్‌చైర్మన్ పీఠం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎట్టకేలకు ‘పుర’సమరానికి తెరపడింది. ‘నువ్వా..నేనా!’ అనే రీతిలో ఉత్కంఠభరితంగా సాగిన మునిసిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల పరోక్ష ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బీజేపీతో దోస్తీ కట్టిన కాంగ్రెస్ మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. అధికారపార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపినా.. జిల్లాలో ఒకేఒక్క నగర పంచాయతీని మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ పక్కాప్లాన్గా అడుగులు వేసి మూడుచోట్ల వైస్ చైర్మన్ పీఠాలను సాధించుకోగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మరోచోట వైస్‌చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. టీఆర్ఎస్కు సొంత బలం ఉన్న అయి జ నగర పంచాయతీలో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను తన ఖాతాలో వేసుకోగలిగింది. సొంత బలంతో నారాయణపేట మునిసిపాలిటీ పీఠాన్ని బీజేపి దక్కించుకుంది. బీజేపీతో కలిసి వనపర్తి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాం గ్రెస్ పావులు కదిపినా చివరకు టీడీపీ పైచేయి సాధించింది. కల్వకుర్తి నగర పం చాయతీలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పర సహకారంతో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాయి. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. రెండు పార్టీల తరఫున చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ, టీడీపీ మద్దతుతో 23ఓట్లు సాధించిన 38వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రాధ అమర్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తరఫున చైర్మన్‌గా నామినేషన్ వేసిన వనజాకు 21 ఓట్లు లభిం చాయి. ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి ఓట్లు వేసినా టీడీపీ మేజిక్ ఫిగర్‌ను సాధించలేకపోయింది. కాంగ్రెస్ శిబిరంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదని ఓటింగ్ సరళి వెల్లడించింది. వనపర్తి మునిసిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహించారు. బీజేపీ మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహం రచించినా సొంత పార్టీ కౌన్సిలర్ విప్‌ను ధిక్కరించి టీడీపీ చైర్మన్ అభ్యర్థికి మద్దతు పలికాడు. దీంతో టీడీపీ చైర్మన్ అభ్యర్థి రమేశ్‌గౌడ్‌కు 14 ఓట్లు, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి లోక్నాథ్రెడ్డికి 13 ఓట్లు లభించాయి. వైస్ చైర్మన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.కృష్ణ, టీఆర్ఎస్ వైస్ చైర్మన్ అభ్యర్థి గట్టు యాదవ్‌కు 13 ఓట్లు లభించాయి. నాగర్‌కర్నూల్ నగర పంచాయతీలో బీజేపీతో జట్టు కట్టిన కాంగ్రెస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎంపీ నంది ఎల్లయ్య ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో ఎన్నికకు హాజరయ్యారు. తగి న సంఖ్యాబలం లేకపోవడంతో చివరి నిముషంలో టీఆర్ఎస్ ఎన్నికల బరినుం చి తప్పుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి నగర పంచాయతీలోనూ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య అవగాహన కుదరడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. తొలి మూడేళ్లు కాంగ్రెస్, చివరి రెండేళ్లు వైఎస్ఆర్ సీపీకి చైర్మన్ పదవి దక్కేవిధంగా పరస్పరం అంగీకారం కుదిరినట్లు సమాచారం. గద్వాల, షాద్‌నగర్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించడంతో రెండు పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నారాయణపేట మునిసిపాలిటీలో బీజేపీ, అయిజ నగర పంచాయతీలో టీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కొలువయ్యారు
- నగర, ‘పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారం - నరసాపురం మినహా అన్నిచోట్లా ఏకగ్రీవమే సాక్షి, ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, తణుకు, కొవ్వూరు పురపాలక సంఘాలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో పాలకవర్గా లు కొలువుతీరారు. ఏలూరులో 50 మంది కార్పొరేటర్లు, మిగిలిన మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో 241 మంది కౌన్సిలర్లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏలూరు మేయర్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక, ఆ వెంటనే ఏలూరు డెప్యూటీ మేయర్, మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వ హించారు. నరసాపురం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవమయ్యూయి. రాజకీయ పార్టీల తరఫున విప్‌లను ఎన్నుకున్నారు. అన్నిచోట్లా ప్రశాంత వాతావరణంలో ప్రమాణ స్వీకారం, ఎన్నికలు జరిగాయి. సారథులు వీరే : ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌గా షేక్ నూర్జహాన్డెప్యూటీ మేయర్‌గా ఏడాదిన్నర కాలానికి చోడే వెంకటరత్నంను ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. భీమవరం మునిసిపల్ చైర్మన్‌గా కొటికలపూడి గోవిందరావు (చినబాబు), వైస్ చైర్మన్‌గా ముదునూరి సూర్యనారాయణరాజు ఎన్నికయ్యారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్‌గా బొలిశెట్టి శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా గొర్రెల శ్రీధర్ ఎంపికయ్యూరు. పాలకొల్లు చైర్మన్‌గా వల్లభు నారాయణమూర్తి, వైస్ చైర్‌పర్సన్‌గా కర్నేని రోజారమణి ఎన్నికయ్యూరు. తణుకు చైర్మన్‌గా దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్‌గా మంత్రిరావు వెంకటరత్నం ఎంపికయ్యారు. కొవ్వూరు చైర్మన్‌గా సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), వైస్ చైర్మన్‌గా దుద్దుపూడి రాజా రమేష్‌ను ఎన్నుకున్నారు. ఇక్కడ వైస్‌చైర్మన్ పదవిని బీసీకి కేటాయించాలంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. నాయకులు సర్ధిచెప్పడంతో శాంతిం చారు. నిడదవోలు చైర్మన్‌గా బొబ్బా కృష్ణమూర్తి, వైస్ చైర్మన్‌గా పేరూరి సాయిబాబా ఎన్నికయ్యారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరై పదవులు చేపట్టిన వారిని అభినందించారు. జంగారెడ్డిగూడెం చైర్‌పర్సన్‌గా బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్‌గా అట్లూరి రామ్మోహనరావును ఎన్నుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ల సాయంతో... నరసాపురంలో 14 వార్డులను టీడీపీ, మరో 14 వార్డులను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, మూడుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ముగ్గురు ఇండిపెండెంట్లు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ బలం 19కి చేరింది. దీంతో టీడీపీ నుంచి పసుపులేటి రత్నమాల చైర్‌పర్సన్‌గా, పొన్నాల నాగబాబు వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. -
లెక్క తేలింది!
మరుగుదొడ్లు లేని గృహాలు 18 వేల పైనే.. - మున్సిపాలిటీల్లో మూడోవంతు ప్రజలు ఆరుబయటకే.. - పట్టణాల్లోనూ కానరాని చైతన్యం - నోటీసుల జారీలో అధికారులు నిమగ్నం.. - స్పందించని వారిపై ‘కొరడా’కు సిద్ధం.. సిద్దిపేట జోన్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని మరింత అధిగమించేందుకు కలెక్టర్ నేతృత్వంలో గత యేడాది మున్సిపల్, నగర పంచాయతీల్లో ఐఎస్ఎల్ నిర్మాణాల కోసం ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే జిల్లాలోని మున్సిపల్, నగర పంచాయతీలో బహిరంగ మలవిసర్జన చేసే గృహాల సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, జహీరాబాద్, మెదక్‌తో పాటు నగర పంచాయతీలుగా గుర్తింపు పొందిన జోగిపేట, చేగుంట, గజ్వేల్‌లో ఇంటింటి సర్వే నిర్వహించారు. సుమారు నెల రోజుల పాటు 70.916 గృహాల్లో సర్వే నిర్వహించి బహిరంగ మలవిసర్జనకు పాల్పడుతున్న 18,626 గృహాలను గుర్తించారు. సంబంధిత యజమానులకు ఆయా మున్సిపల్ కమిషనర్ల పేరిట ముందస్తు నోటీసులకు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలివిడతగా సిద్దిపేట మున్సిపాలిటీలో గుర్తించిన 3,752 గృహాలకు ఫిబ్రవరిలో బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచిస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌కు సైతం వెనకాడేది లేదంటూ స్పష్టంగా నోటీసుల్లో జారీ చేశారు. 2013 పునరావాస చట్టం ప్రకారం బహిరంగ మలవిసర్జన నిషేధమని సెప్టిక్ ట్యాంక్‌ను కలిగి ఫ్లషింగ్ చేసేందుకు వీలుగా మరుగుదొడ్లను నిర్మించాలంటూ లిఖితపూర్వక నోటీసులను మున్సిపల్ అధికారులు జారీ చేశారు. సంబంధిత చట్టాన్ని విస్మరిస్తే వివిధ సెక్షన్ల ప్రకారం సంవత్సరం వరకు కఠిన కరాగార శిక్ష ఆమలవుతోందని హెచ్చరించారు. నోటీసులు అందుకుని నెలలు గడిచినా కొన్ని మున్సిపాలిటీల్లో గృహ యజమానుల నుంచి స్పందన లేకపోవడంపై జిల్లా యంత్రాంగం కఠినంగా పరిగణించింది. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన సమీక్షలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు జిల్లాల అధికారులు స్పష్టమైన అదేశాలను జారీ చేసినట్లు సమాచారం. ఆరు నెలలలోపు సెప్టిక్ ట్యాంక్‌తో కూడిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టని, నోటీసులకు స్పందించని గృహ యజమానులపై కొరడా ఝుళిపించేం దుకు జూలైలో జిల్లా యంత్రాంగం భవిష్యత్ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం. -
ఆళ్లగడ్డ ఫలితాలు అద్భుతం
- 2 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం - మిగిలిన 18 స్థానాల్లోనూ 16 వైఎస్సార్సీపీ కైవసం - 2 స్థానాలకే పరిమితమైన టీడీపీ ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ నగర పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు ఆవిష్కృతమయ్యాయి. మొత్తం 20 స్థానాల్లో 18 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. కేవలం రెండు స్థానాల్లోనే టీడీపీ గెలించింది. నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా 2 వార్డులు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. దీంతో 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ 16 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతం ఎగురవేశారు. కేవలం 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది. నగరపంచాయితీ పరిధిలో 28,861 ఓట్లు ఉండగా 21,908 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 12,842 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థులకు 8,676 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4,166 ఓట్ల ఆధిక్యం లభించినట్లు అయింది. 1వ వార్డులో రమణమ్మ అత్యధికంగా 709 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 18వ వార్డులో సరోజమ్మ కేవలం 7 ఓట్లతో గొలుపొందారు. శోభా నాగిరెడ్డికి అంకితం ఇస్తాం తమ గెలుపు కోసం కృషి చేసిన దివంగత నేత శోభా నాగిరెడ్డికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని వైఎస్సార్సీపీ అభ్యర్థులు పేర్కొన్నారు. 17వ వార్డుకు ఎన్నికైన ఎద్దుల ఉషారాణి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాలని శోభానాగిరెడ్డి చెప్పేవరాని అన్నారు. స్వీప్ చేయలేకపోయిన రికార్డు మెజార్టీ రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ విజయంలో దివంగత శోభానాగిరెడ్డి కృషి ఉందని తెలిపారు. 5వ వార్డుకు ఎన్నికైన రామలింగారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శోభానాగిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. 6వ వార్డుకు ఎన్నికైన గీత మాట్లాడుతూ శోభానాగిరెడ్డి చిరునవ్వు, ఆప్యాయతలే తమ విజయానికి నాంది అన్నారు. ఆమె భౌతికంగా లేకపోవడంతో విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నామన్నారు. 1వ వార్డుకు ఎన్నికైన రమణమ్మ చింతకుంటలో గెలుపును శోభానాగిరెడ్డి చూడలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. -
నేడే ‘పుర’ పోరు
సాక్షి, నల్లగొండ : పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 210 వార్డులు ఉండగా... భువనగిరి, మిర్యాలగూడలో ఒక్కోటి చొప్పున వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 208 వార్డులకు 1123 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల పరిధిలోని 208 వార్డులకు సంబంధించి 381 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో మొత్తం 3.96 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 440 ఈవీఎంలను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉం చారు. 46 మంది జోనల్ అధికారులను నియమించారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బంది కాకుండా 2,171 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక, అత్యంత సామస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా తెలుసుకుంటారు. మొత్తంగా 100 వెబ్‌కాస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు జరిగేదాకా 144 సెక్షన్.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు చేపట్టింది. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. పోలింగ్ పూర్తయి ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచేంతరవకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆరుగురు డీఎస్పీలు, 33 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్ఐలు, ఆర్ఐలతోపాటు ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 2500 మంది విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాస్థాయిలో ఎస్పీ, అదనపు ఎస్పీ బందోబస్తును సమీక్షిస్తారు. సెల్‌ఫోన్ నిషేధం.... పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లే ముందు ఓటరును తనిఖీ చేయాలని పోలీసుశాఖకు కలెక్టర్ సూచించారు. పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్‌తో వస్తే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడమేగాక.. సెల్‌ఫోన్‌ను సీజ్ చేస్తామని ఎస్పీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు. ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కు విని యోగించుకునేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలిం గ్ కేంద్రాల వద్దకు ఓటర్లను వాహనాల్లో తరలించిన వ్యక్తులపై చర్యలు తప్పవన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో వాహనాలను నిలపాలని చెప్పారు. లాడ్జీలు, ఫంక్షన్‌హాళ్లలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటరు చిటీ లేకున్నా..... ఫొటోతో కూడిన ఓటరు చిటీని ఇప్పటికే ఓటర్లకు అందజేశారు. ఈ బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారి ఆయా మున్సిపాలిటీలు, నగరపంచాయతీల కమిషనర్లకు అప్పగించారు. ఒకవేళ ఓటర్లకు చిటీ అందకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు, ఫొటో ఉండి... ఏదేని గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.