లెక్క తేలింది!
మరుగుదొడ్లు లేని గృహాలు 18 వేల పైనే..
- మున్సిపాలిటీల్లో మూడోవంతు ప్రజలు ఆరుబయటకే..
- పట్టణాల్లోనూ కానరాని చైతన్యం
- నోటీసుల జారీలో అధికారులు నిమగ్నం..
- స్పందించని వారిపై ‘కొరడా’కు సిద్ధం..
సిద్దిపేట జోన్: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని మరింత అధిగమించేందుకు కలెక్టర్ నేతృత్వంలో గత యేడాది మున్సిపల్, నగర పంచాయతీల్లో ఐఎస్‌ఎల్ నిర్మాణాల కోసం ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే జిల్లాలోని మున్సిపల్, నగర పంచాయతీలో బహిరంగ మలవిసర్జన చేసే గృహాల సర్వేకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, సదాశివపేట, జహీరాబాద్, మెదక్‌తో పాటు నగర పంచాయతీలుగా గుర్తింపు పొందిన జోగిపేట, చేగుంట, గజ్వేల్‌లో ఇంటింటి సర్వే నిర్వహించారు.
సుమారు నెల రోజుల పాటు 70.916 గృహాల్లో సర్వే నిర్వహించి బహిరంగ మలవిసర్జనకు పాల్పడుతున్న 18,626 గృహాలను గుర్తించారు. సంబంధిత యజమానులకు ఆయా మున్సిపల్ కమిషనర్ల పేరిట ముందస్తు నోటీసులకు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలివిడతగా సిద్దిపేట మున్సిపాలిటీలో గుర్తించిన 3,752 గృహాలకు ఫిబ్రవరిలో బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ అదేశాలకు అనుగుణంగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచిస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌కు సైతం వెనకాడేది లేదంటూ స్పష్టంగా నోటీసుల్లో జారీ చేశారు. 2013 పునరావాస చట్టం ప్రకారం బహిరంగ మలవిసర్జన నిషేధమని సెప్టిక్ ట్యాంక్‌ను కలిగి ఫ్లషింగ్ చేసేందుకు వీలుగా మరుగుదొడ్లను నిర్మించాలంటూ లిఖితపూర్వక నోటీసులను మున్సిపల్ అధికారులు జారీ చేశారు. సంబంధిత చట్టాన్ని విస్మరిస్తే వివిధ సెక్షన్ల ప్రకారం సంవత్సరం వరకు కఠిన కరాగార శిక్ష ఆమలవుతోందని హెచ్చరించారు.
నోటీసులు అందుకుని నెలలు గడిచినా కొన్ని మున్సిపాలిటీల్లో గృహ యజమానుల నుంచి స్పందన లేకపోవడంపై జిల్లా యంత్రాంగం కఠినంగా పరిగణించింది. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన సమీక్షలో సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు జిల్లాల అధికారులు స్పష్టమైన అదేశాలను జారీ చేసినట్లు సమాచారం. ఆరు నెలలలోపు సెప్టిక్ ట్యాంక్‌తో కూడిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టని, నోటీసులకు స్పందించని గృహ యజమానులపై కొరడా ఝుళిపించేం దుకు జూలైలో జిల్లా యంత్రాంగం భవిష్యత్ ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం.