బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం
దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది...
‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది.
తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి.
అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది.
మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’
‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు.
‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్‌లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక.
ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది.
‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment