
రాష్ట్రంలో నీటి సంక్షోభం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ లోపంతో ఎడారిలా గోదావరి
మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో రాష్ట్రం నీటి సంక్షోభం దిశగా పయనిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా తగ్గడంపై శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను భూగర్భజల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మండిపడ్డారు. ‘కేసీఆర్ హయాంలో భూగర్భజలాలు 56 శాతం పెరిగాయి.
మిషన్ కాకతీయ ద్వారా 27 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వ సామర్థ్యం 8.93 టీఎంసీలకు పెరిగింది. దీంతో సాగు, తాగునీటి రంగాలు బలోపేతమయ్యా యి. కానీ కేవలం 14 నెల ల కాంగ్రెస్ పాలనలోనే ఈ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో భూగర్భ జలమట్టం రెండు మీటర్లకు పైగా పడిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యంతో 120 కిలోమీటర్ల పొడవునా నీరు లేక గోదావరి నది ఎడారిని తలపిస్తోంది.
మేడిగడ్డ బ్యారేజ్ సహా ప్రాజెక్టు నీటి భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మిషన్ భగీరథ పథకం కుంటుపడటంతో తాగునీటి కోసం మళ్లీ బోరుబావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. నీటిపారుదల రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని తప్పించడానికి వెంటనే నీటి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment