water connections
-
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్.. జలమండలి సీరియస్
సాక్షి, హైదరాబాద్: బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లా కనెక్షన్లను తొలగించనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ హెచ్చరించారు. బిల్లులు చెల్లించని కమర్షియల్ కనెక్షన్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. 6 నెలలు, ఆపై నుంచి నల్లా బిల్లు చెల్లించని వాణిజ్య కనెక్షన్ల బకాయిలను వసూలు చేయాలని, చెల్లించకపోతే కనెక్షన్లను తొలగించాలని చెప్పారు. ఈ మేరకు రెవెన్యూ వసూలు బృందాలకు తోడుగా విజిలెన్స్ విభాగాన్ని సైతం రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ, సింగిల్ విండో సెల్, తదితర అంశాలపైన ఆయన అధికారులతో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా రెవెన్యూ పెంపుపైన జలమండలి ప్రత్యేక దృష్టి సారించిందని, ఇది సత్ఫలితాన్ని ఇచి్చందని తెలిపారు. కొన్ని మొండి బకాయిలు వసూలయ్యాయని, ఆదాయం క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు మరింతగా దృష్టి సారించాలని అన్నారు. 6 నెలల కంటే ఎక్కువ రోజులుగా బిల్లులు చెల్లించని వాణిజ్య కనెక్షన్లు 1095 ఉన్నట్లు గుర్తించారు.ఈ కనెక్షన్ల నుంచి నుంచి రూ.8.31 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. నాన్ ఫ్రీ వాటర్ స్కీమ్ కనెక్షన్లపైనా... నాన్ ఫ్రీ వాటర్ స్కీమ్ (నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోని) పరిధిలో ఉన్న కనెక్షన్ల బకాయిలపైన కూడా దృష్టి సారించాలని, ఈ బకాయిలను సైతం వసూలు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే వీరికి 13 నెలల బిల్లులను ప్రభుత్వం రద్దు చేసిందని, ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. వీరు ఇప్పటికైనా ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి నుంచి పథకం వర్తిస్తుందని, బకాయిలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఓఆండ్ఎం డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లలో ఏడు కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు
పనాజీ/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రాలుగా తెలంగాణ, గోవా నిలిచాయి. గోవా గత మూడేళ్లలో 200 కోట్లకు పైగా ఖర్చుతో 2.63 లక్షల గృహాలకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం కల్పించింది. ఈ సందర్భంగా గోవా ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన మైలురాయిని చేరుకున్నట్టు వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో 52% కంటే ఎక్కువ గ్రామీణ కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందుతోందని కేంద్ర జలశక్తి శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించినప్పుడు గ్రామాల్లోని 3.23 కోట్ల (16.90%) కుటుంబాలకు మాత్రమే పైపు నీటి కనెక్షన్ అందుబాటులో ఉంది. తెలంగాణ సహా మూడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% కవరేజీని కలిగి ఉన్నాయి. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్‌లో ఉంది. -
జల సంరక్షణ.. అందరి బాధ్యత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల జీవన్ మిషన్‌తో దేశవ్యాప్తంగా 1.25 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రెండేళ్లలో 5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. గృహాలకు నీటి సరఫరా విషయంలో గత 7 దశాబ్దాల్లో సాధించిన దానికంటే కేవలం ఈ రెండేళ్లలో సాధించిందే అధికమని ఉద్ఘాటించారు. మోదీ శనివారం ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య కమిటీల(వీడబ్ల్యూఎస్సీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జల జీవన్ మిషన్ అమలు తీరుపై చర్చించారు. కమిటీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జల జీవన్ మిషన్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. ‘రాష్ట్రీయ జల జీవన్ కోష్’కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద గ్రామాలు, ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఎవరైనా విరాళాలు అందజేయవచ్చు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... జల జీవన్ మిషన్ కేవలం ప్రజలకు నీటిని అందించే కార్యక్రమం మాత్రమే కాదని, వికేంద్రీకరణ దిశగా ఇది గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2019 దాకా దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం ఉండేదన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లోని 1.25 కోట్ల గృహాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. నీరు ఎంతో విలువైనదని, దాన్ని ఇష్టరాజ్యంగా వాడేవారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని మోదీ సూచించారు. కొన్ని అలవాట్లు మార్చుకుంటే నీటిని ఆదా చేయొచ్చని చెప్పారు. గుజరాత్లో పుట్టి పెరిగిన తనకు నీటి కష్టాలు తెలుసని వెల్లడించారు. 7.1 లక్షల మందికి శిక్షణ దేశంలో ఆడబిడ్డల ఆరోగ్యం, భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధానివెల్లడించారు. ప్రతి ఇంటిలో, బడిలె మరుగుదొడ్డి సౌకర్యం, తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్, గర్భిణులకు పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రల పంపిణీ వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉండగా, 3.5 లక్షల గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుధ్య కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. నీటి నాణ్యత పరీక్షించేందుకు 7.1 లక్షల మందికిపైగా మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. -
బావులు, బోర్లు వద్ద నీళ్లు బంద్
సాక్షి, అమరావతి: బావులు, బోర్ల నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితికి ఇకపై చెల్లుచీటి పడనుంది. తాగునీటి అవసరంతో పాటు రోజు వారీ సాధారణ అవసరాలకు కావాల్సిన నీటిని గ్రామాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారానే సరఫరా చేసే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 95.66 లక్షల ఇళ్లు ఉంటే.. ఇందులో ఇప్పటివరకు 31.93 లక్షల ఇళ్లలో కుళాయిలున్నాయి. వీటికే ప్రస్తుతం నేరుగా నీటిని సరఫరా చేసే వీలుంది. మిగిలిన 63.73 లక్షల ఇళ్లకు వచ్చే నాలుగేళ్లలో కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు రూ.10,975 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, ఈ ఖర్చులో సగం కేంద్రం జలజీవన్ మిషన్ కార్యక్రమం కింద భరించనుంది. ► నాలుగేళ్ల కాల పరిమితిలో తొలి ఏడాది 32 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయిలు ఏర్పాటుచేయాలన్నది ఆర్డబ్ల్యూఎస్ లక్ష్యం. ఇందుకు రూ.4,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో రూ.2,400 కోట్లు జలజీవన్ మిషన్ కింద నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ► మంచినీటి పథకం, ఓవర్òహెడ్ ట్యాంకు వంటివున్న గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ గ్రామాల్లో తొలుత అన్ని ఇళ్లకు కుళాయిలు ఏర్పాటుచేస్తారు. ఆ తర్వాత 75 శాతం ఇళ్లకైనా నీటి సరఫరా చేసే సామర్థ్యం ఉన్న గ్రామాలకు ప్రాధాన్యతనిస్తారు. ► తొలి ఏడాది 32 లక్షలు, రెండో ఏడాది 25 లక్షలు మూడో ఏడాది 5 లక్షలు, నాలుగో ఏడాది మిగిలిన ఇళ్లకు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. -
నగరంలో విజిలెన్స్ అధికారుల దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నీటి కనెక్షన్ల పై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. ముందస్తు సమాచారం మేరకు హైదరాబాద్ జలమండలి విజిలెన్స్ అధికారులు గురువారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. అక్రమంగా నీటి కనెక్షన్లు, నీటి మోటార్లు, మీటర్లు కలిగి ఉన్నవారిని అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో స్టాలియన్ టైర్స్ కంపెనీకు చెందిన వి.ఎమ్.ఎన్ వెంకటేష్ 40 మిల్లీ మీటర్ల నీటి కనెక్షన్లను అక్రమంగా వాడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 2016లో నీటి బిల్లులు చెల్లించని కారణంగా వెంకటేశ్ రూ. 29.42లక్షలు బకాయి పడ్డాడని, అందువల్ల అతని కనెక్షన్‌ను రద్దు చేశామని అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించకపోగా, అక్రమ కనెక్షన్ ద్వారా దాదాపు 25వేలకు పైగా కిలో లీటర్ల నీటిని వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా 40 లక్షల రూపాయల నీటిని అక్రమంగా వినియోగించారని, దీనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎంత ముందుచూపో!
సాక్షి, కామారెడ్డి: ఇంటింటికీ శుద్ధ జలాలను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని ఆవాసాలకు శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. అయితే కొందరు అధికారుల తీరుతో పథకం అభాసుపాలవుతోంది. ఇళ్లున్న కాలనీని నిర్లక్ష్యం చేసిన అధికారులు.. అసలు ఇళ్లే లేని రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ప్లాటు ప్లాటుకో నల్లా కనెక్షన్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. పట్టణంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎంత వెతికినా ఒక్క ఇల్లూ కానరాదు.. కానీ అధికారులు మాత్రం చాలా ముందుచూపుతో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేశారు. అంతటితో సరిపెట్టకుండా ప్లాటుప్లాటుకో నల్లా కనెక్షన్ కూడా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వెంచర్‌కు సమీపంలోనే జయశంకర్ కాలనీ ఉంది. ఈ కాలనీలో చాలా ఇళ్లున్నాయి. కానీ ఈ కాలనీకి మాత్రం నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. అసలు భగీరథ పైప్‌లైనే వేయలేదు. మిషన్ భగీరథ పథకంలో అధికారుల తీరుకు ఇవి మచ్చుతునకలు.. జిల్లాలో 834 ఆవాసాల పరిధి లో 2,44,673 ఇళ్లున్నాయి. వీటికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాకు శ్రీరాంసాగర్, సింగూ రు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించేందుకు రూ.2,650 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. 600 ట్యాంకుల నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. 567 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంటింటికీ నీటిని అందించేందుకుగాను 2,123 కిలోమీటర్ల మేర అంతర్గత పైపులైన్ వేయాల్సి ఉండగా.. 2,053 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశా రు. అలాగే 2,44,673 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. 2,44,000 ఇళ్లకు నల్లాలు బిగించినట్టు పేర్కొంటున్నారు. జిల్లాలో 834 నివాసిత ప్రాంతాలకుగాను 811 ప్రాంతాల్లో వంద శాతం పనులు పూర్తి చేసి ఇంటింటికీ న ల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పట్టణాలు, పల్లెల్లో చాలా చోట్ల పైపులైన్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొన్నిచోట్ల పైపులైన్లు కూడా వేయలేదు. వెంచర్‌కు కనెక్షన్.. అన్ని ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం సంగతి అటుంచితే.. జిల్లా కేంద్రంలో విచిత్రంగా వెంచర్‌కు పైప్‌లైన్ వేయడమే కాకుండా నల్లా కనెక్షన్లు కూడా ఇవ్వడం ఆరోపణలకు తావిస్తోంది. అడ్లూర్ రోడ్డు లో ఉన్న జయశంకర్ కాలనీ నుంచి రామారెడ్డి రోడ్డుకు వెళ్లడానికి కొత్తగా వేసిన బీటీ రోడ్డుకు ఇరుపక్కల ఉన్న భూములను ఇటీవల వెంచర్ చేశారు. ఇది కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయాలకు సమీపంలో ఉంది. వెంచర్ చేసినపుడు అందులో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రియల్టర్లపైన ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని పట్టించుకోకుండా, అధికారులను మేనేజ్ చేసుకుని ప్లాట్లు చేసేశారు. ఇలా ప్లాట్లుగా చేసినవాటిని అమ్మాలంటే సౌకర్యాలు చూపాలన్న ఉద్దేశంతో ఏదో ఒక రకంగా ఆ వెంచర్ మీదుగా బీటీ రోడ్డు వేయించారు. వెంచర్లో చేసిన ప్లాట్లకు తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకంలో పైపులైన్లు కూడా వేయించారు. అంతటితో ఆగకుండా ప్లాటుకో నల్లా పైపును తీసి పెట్టారు. ఒక ట్యాప్ బిగిస్తే చాలు.. అయితే ఆ వెంచర్లో ఒక్కటంటే ఒక్క ఇళ్లూ లేకపోవడం గమనార్హం. భగీరథ పైపులైన్లు వేయాల్సిన చోట వేయకుండా వెంచర్లలో వేయడమే గాకుండా నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చెలామణి అవుతుండడంతో అధికారులు వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వెంచర్లు చేసిన వారు వసతులు కల్పించాల్సి ఉండగా, ప్రభుత్వ నిధులతో పైపులైన్లు వేసి నల్లాలు బిగించడం ద్వారా ప్లాట్లు సులువుగా అమ్ముడుపోవడానికి అధికారులు తమవంతు సహకారం అందించారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
దప్పిక తీర్చని పథకం
గూడూరు, న్యూస్‌లైన్: పట్టణంలో రూ.64 కోట్లతో నిర్మించిన నీటి ట్యాంక్ ప్రజల దప్పిక తీర్చడం లేదు. గూడూరు వాసుల శాశ్వత దాహార్తిని తీర్చాలనుకున్న మహానేత ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. తాగునీటి పథకం పనులను నాసిరకంగా చేపట్టడంతో పట్టణంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తరచూ పైపులైన్లు పగిలిపోతూ నీటిసరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో పట్టణంలో నాలుగురోజులుగా నీటిసరఫరా లేక ప్రజలు అగచాట్లు పడుతున్నారు. కొన్ని ఇళ్లకు మంచినీటి వసతి మాత్రమే ఉంది. దీంతో వారు ఆ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అలాంటి వారికి నాలుగురోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ క్యాన్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విందూరు, వేములపాళెం వాటర్ వర్క్స్ నుంచి నీటిని పట్టణానికి వదులుతున్నారు. కండలేరు నుంచి అరకొరగా నీటిని కొత్త నీటి పథకానికి తీసుకొస్తున్నా వాటిని వినియోగించే పరిస్థితి లేదు. పట్టణంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను సీఎం కిరణ్ కొంత కాలం కిందట ఆర్భాటంగా ప్రారంభించారు. పైపులైన్లు నాసిరకంగా ఉండటంతో అరకొరగా నీటిని వదిలినా పగిలిపోతున్నాయి. దీంతో నెలలో పది రోజుల పాటు పట్టణంలో తాగునీటి సరఫరా ఉండటం లేదు. 2008, జనవరి 17న వైఎస్సార్ కండలేరు తాగునీటి పథకానికి రూ.64.15 కోట్లు విడుదల చేశారు. 2009, ఫిబ్రవరి 26న పనులకు సంబంధించి ఒప్పందం జరిగింది. 2010, సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకూ పూర్తికాలేదు. అయితే 2012, డిసెంబర్ 14 నాటికి పనులు పూర్తయినట్టు పబ్లిక్‌హెల్త్ వారు మున్సిపాలిటీకి ట్యాంక్‌ను అప్పగించారు. మున్సిపల్ డీఈ, ఏఈ సంతకాలు లేకుండా స్థానిక మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మ పథకాన్ని హడావుడిగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఈ, ఏఈలపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించినట్టు సమాచారం. అరకొరగానే నీటి సరఫరా.. పథకాన్ని ప్రారంభించే ముందు పట్టణ ప్రజలకు 24 గంటలు నీటిసరఫరా ఉంటుందని చెప్పారు. ఆ నీరు సరఫరా అయ్యే రోజుల్లో కూడా గతంలోలాగే కేవలం గంటపాటే అదీ ఉదయం మాత్రమే సరఫరా అవుతోంది. రూ.64 కోట్లు వెచ్చించిన పథకం పట్టణ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పథకం కోసం వెచ్చించిన నిధులు వృథా అయ్యాయనే విమర్శలు లేకపోలేదు. తరచూ మరమ్మతులే.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్ కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో తరచూ పలు ప్రాంతాల్లో ప్రధాన పైపులైన్లు పగిలిపోతూ నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడమేకాక నీరు కూడా వృథా అవుతోంది. నాసిరకమైన పైపులను ఉపయోగిం చడం వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. పలుమార్లు ఈ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేదు.