గూడూరు, న్యూస్‌లైన్: పట్టణంలో రూ.64 కోట్లతో నిర్మించిన నీటి ట్యాంక్ ప్రజల దప్పిక తీర్చడం లేదు. గూడూరు వాసుల శాశ్వత దాహార్తిని తీర్చాలనుకున్న మహానేత ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. తాగునీటి పథకం పనులను నాసిరకంగా చేపట్టడంతో పట్టణంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తరచూ పైపులైన్లు పగిలిపోతూ నీటిసరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో పట్టణంలో నాలుగురోజులుగా నీటిసరఫరా లేక ప్రజలు అగచాట్లు పడుతున్నారు. కొన్ని ఇళ్లకు మంచినీటి వసతి మాత్రమే ఉంది.
దీంతో వారు ఆ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అలాంటి వారికి నాలుగురోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ క్యాన్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విందూరు, వేములపాళెం వాటర్ వర్క్స్ నుంచి నీటిని పట్టణానికి వదులుతున్నారు. కండలేరు నుంచి అరకొరగా నీటిని కొత్త నీటి పథకానికి తీసుకొస్తున్నా వాటిని వినియోగించే పరిస్థితి లేదు. పట్టణంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను సీఎం కిరణ్ కొంత కాలం కిందట ఆర్భాటంగా ప్రారంభించారు. పైపులైన్లు నాసిరకంగా ఉండటంతో అరకొరగా నీటిని వదిలినా పగిలిపోతున్నాయి. దీంతో నెలలో పది రోజుల పాటు పట్టణంలో తాగునీటి సరఫరా ఉండటం లేదు. 2008, జనవరి 17న వైఎస్సార్ కండలేరు తాగునీటి పథకానికి రూ.64.15 కోట్లు విడుదల చేశారు. 2009, ఫిబ్రవరి 26న పనులకు సంబంధించి ఒప్పందం జరిగింది. 2010, సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకూ పూర్తికాలేదు. అయితే 2012, డిసెంబర్ 14 నాటికి పనులు పూర్తయినట్టు పబ్లిక్‌హెల్త్ వారు మున్సిపాలిటీకి ట్యాంక్‌ను అప్పగించారు. మున్సిపల్ డీఈ, ఏఈ సంతకాలు లేకుండా స్థానిక మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మ పథకాన్ని హడావుడిగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఈ, ఏఈలపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించినట్టు సమాచారం.
అరకొరగానే నీటి సరఫరా..
పథకాన్ని ప్రారంభించే ముందు పట్టణ ప్రజలకు 24 గంటలు నీటిసరఫరా ఉంటుందని చెప్పారు. ఆ నీరు సరఫరా అయ్యే రోజుల్లో కూడా గతంలోలాగే కేవలం గంటపాటే అదీ ఉదయం మాత్రమే సరఫరా అవుతోంది. రూ.64 కోట్లు వెచ్చించిన పథకం పట్టణ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పథకం కోసం వెచ్చించిన నిధులు వృథా అయ్యాయనే విమర్శలు లేకపోలేదు.
తరచూ మరమ్మతులే..
పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్ కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో తరచూ పలు ప్రాంతాల్లో ప్రధాన పైపులైన్లు పగిలిపోతూ నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడమేకాక నీరు కూడా వృథా అవుతోంది. నాసిరకమైన పైపులను ఉపయోగిం చడం వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. పలుమార్లు ఈ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేదు.
దప్పిక తీర్చని పథకం
Published Thu, Dec 12 2013 4:34 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement