Water Works
-
ఢిల్లీ జల్‌బోర్డు ఆఫీసు ధ్వంసం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత పరిస్థితులు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలకు కారణమవుతున్నాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం(జూన్16) ఛాతర్‌పూర్‌లోని ఢిల్లీ జల్‌బోర్డు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.ఆఫీసులో సామాగ్రి పగులగొట్టి చిందరవందరగా పడేశారు. అయితే జలమండలి ఆఫీసుపై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేనని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఆరోపించింది. దాడి చేస్తున్న వారిలో ఒక వ్యక్తి కాషాయ కండువా కప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది.BJP के नेताओं और कार्यकर्ताओं की सरेआम गुंडागर्दी ‼️देखिए कैसे ‘BJP ज़िंदाबाद’ के नारे लगाते हुए दिल्ली जल बोर्ड के दफ़्तर को तोड़ रहे हैं बीजेपी के कार्यकर्ता👇एक तरफ़ हरियाणा की BJP सरकार दिल्ली के हक़ का पानी रोके हुए है तो वहीं दूसरी तरफ़ बीजेपी दिल्ली की जनता की संपत्ति… pic.twitter.com/nVEWLdDwGA— AAP (@AamAadmiParty) June 16, 2024 ‘బీజేపీ జిందాబాద్ అని నినాదాలు చేసుకుంటూ జలమండలి ఆఫీసును ఎలా పగులగొడుతున్నారో చూడండి. ఓ వైపేమో హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు తాగేందుకు నీళ్లివ్వకుండా ఆపుతుంది. మరోవైపు ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తారు’అని ఆప్ ఎక్స్(ట్విటర్)లో దాడి వీడియోను పోస్టు చేసింది. -
శ్రీశైలంపై తెగని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్ బి.రవికుమార్ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్సీకి ఎస్ఎంఎస్ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్ఎంసీ కన్వీనర్ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. విఫలమైన ఆర్ఎంసీ ప్రయత్నాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్‌కర్వ్‌లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్‌కర్వ్‌తో పాటు జలవిద్యుదుత్పత్తి, మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసింది. ఆరుసార్లు సమావేశమైన ఆర్ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. కనీస నిల్వ 830 అడుగులు చాలు శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్‌కర్వ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ను కోరారు. పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ ఆర్ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్ వాటాలు, క్యారీ ఓవర్ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. -
హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌కు బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్ బాబానగర్ వద్ద ఎయిర్ వాల్వ్‌లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది. (చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!) నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు డివిజన్ 1: ఎన్పీఏ పరిధిలోని ప్రాంతా లు. డివిజన్ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్. డివిజన్ 20: అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు: డివిజన్ 1: మీరాలం పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 3: భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 16: బుద్వేల్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20: శంషాబాద్ పరిధిలోని ప్రాంతాలు. -
Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!
సాక్షి, హైదరాబాద్: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్టీఎల్ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిపై 2019లో హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్ విడుదల చేశాయి. గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్‌ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు. ఆక్రమణలే శాపం ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్‌ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్‌లు కూడా శాపంగా పరిణమించాయి. సమగ్ర విచారణ చేపట్టాలి గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి. – లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త -
త్వరలోనే రక్షిత పథకాలు పూర్తి చేస్తాం
రణస్థలం : ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద ఉన్న భారీ రక్షిత మంచినీటి పథకంSద్వారా ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లోని 175 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ పి.సూర్యనారాయణ తెలిపారు. ఇందుకోసం రూ.90 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. రణస్థలం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి సోమవారం విచ్చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రణస్థలం మండలంలోని పిషిణి, చిన్నపిషిణి, నెలివాడ గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మోటార్లు, పైప్‌పులైన్ పనులకు ప్రభుత్వం 1.09 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వివరించారు. కొత్తముక్కాం, కొమరవానిపేట గ్రామాలకు రక్షిత పథకాలు ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ శివకుమార్ పాల్గొన్నారు. -
ఫేస్బుక్లో కాంట్రాక్టర్ సూసైడ్ నోట్ హల్చల్
అంతా అవినీతి.. ఆత్మహత్యే గతి - లంచాలివ్వనిదే బిల్లులివ్వడంలేదు.. - వాటర్ వర్క్స్ అధికారుల తీరుకు విసిగి ఫేస్బుక్లో సూసైడ్‌నోట్ పెట్టిన కాంట్రాక్టర్ హైదరాబాద్: అవినీతి అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంటానని ఫేస్బుక్లో సూసైడ్ నోట్‌ను అప్లోడ్ చేశారు. లంచాలు ఇస్తేగాని బిల్లులు మంజూరుకాని పరిస్థితి హైదరాబాద్ చింతల్ వాటర్‌వర్క్స్ కార్యాలయంలో నెలకొందని నోట్లో పేర్కొన్నారు. చింతల్ వాటర్‌వర్క్స్ డివిజన్-12లో ఓ సెక్షన్‌కు అనుబంధంగా వడ్లమూడి రవికుమార్ అనే కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు. చిన్నపాటి లీకేజీలకు మరమ్మతులు, రూ.5 లక్షల వరకు పైపులైన్ పనులు చేస్తుంటారు. గత మూడేళ్ల పనులకుగాను అతడికి రూ.8 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. దీంతో పలుమార్లు చింతల్ వాటర్వర్క్స్అధికారులను కలసి బిల్లులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమీషన్ ఇవ్వనిదే రికార్డు బుక్‌లో బిల్లులు నమోదు చేయబోమని అధికారులు సతాయించారు. లంచాలపై నిలదీసినందుకే తన బిల్లులను అధికారులు మంజూరు చేయడంలేదని, తాను చనిపోతున్నానని, తన కుటుంబసభ్యులను ఆదుకోవాలని సూసైడ్ నోట్‌ను ఫేస్బుక్లో మెట్రో వాటర్‌వర్క్స్ అధికారులకు పోస్ట్ చేశారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేషీకి ఓ సందేశాన్ని పంపారు. బంగారు తెలంగాణకు స్థానిక అధికారులు అడ్డుగా మారుతున్నారని పేర్కొన్నారు. రవికుమార్ పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. -
‘ప్రణాళిక’ కొలిక్కి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘మన ఊరు- మన ప్రణాళిక’ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వాస్తవానికి ఈ నెల మొదటివారంలోనే ప్రణాళిక తుదిరూపు దాల్చాల్సి ఉండగా.. మండల పరిషత్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో గందరగోళం నెలకొంది. ప్రతి పల్లెకు మూడు పనులు చొప్పున ప్రాధాన్యత క్రమంలో తీసుకుని ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయగా.. అధికారులు మాత్రం ఒకే కేటగిరీ పనిని పలుచోట్ల తీసుకోవడంతో ప్రణాళిక ఆసాంతం తప్పులతడకగా మారింది. దీంతో మళ్లీ ప్రాధాన్యత క్రమంలో జాబితాను రూపొందించే పనిలో పడ్డ అధికారులు తాజాగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రూ.1768.53 కోట్లతో 3,879 పనులు గుర్తించారు. శాఖల వారీగా పనులు నిర్దేశించిన యంత్రాంగం.. ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. రోడ్లకే ప్రాధాన్యం.. ‘మన ఊరు-మన ప్రణాళిక’లో భాగంగా యంత్రాంగం రూపొందించిన ప్లాన్‌లో తొలిప్రాధాన్యం రహదారులకే దక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 1,370 రోడ్ల పనులు గుర్తించారు. వీటి అంచనా వ్యయం రూ.730.66కోట్లు. జిల్లా వ్యాప్తంగా రూపొందించిన ప్రణాళికలో దాదాపు 40శాతం రోడ్లకే కేటాయించారు. ఆ తర్వాత తాగునీటి విభాగంలో 1010 పనులు నిర్ధారించగా.. ఈ పనుల వ్యయం రూ. 407.54కోట్లు. అదేవిధంగా శ్మశానవాటికలకు సంబంధించి 110 పనులకు రూ. 29.21కోట్లు, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులకు సంబంధించి రూ.13.36కోట్లు పేర్కొంటూ ప్రణాళిక తయారు చేశారు. ఇందులో మొత్తం 27 శాఖలకు సంబంధించి 3,879 పనులు ప్రణాళికలో పొందుపర్చారు. ప్రభుత్వం ఆమోదం పొందిన అనంతరం నిధుల లభ్యతను బట్టి పనులు చేపట్టే అవకాశంది. -
మమ్మల్ని ఆంధ్రాకు పంపొద్దు
* 86 మంది సాగర్ ఉద్యోగుల వినతి * 2 నెలలుగా జీతాలందని వైనం సాక్షి, హైదరాబాద్: ‘మమ్మల్ని ఆంధ్రాకు పంపొద్దు..’ అంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 86 మంది నాలుగో తరగతి ఉద్యోగులు వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ర్ట విభజన సమయంలో ఆంధ్రాకు కేటాయించిన తమను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించేలా చూడాలని ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. సాగర్ ప్రాజెక్టు గేట్ మెయింటెనెన్స్, వాటర్ వర్క్స్ విభాగాల్లోని వీరంతా సీఈ డివిజన్ పరిధిలో ప్రాజెక్టు అవతల పనిచేస్తున్నారు. దీంతో పాలన, వసతి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. వీరి విభాగాల విభజనకు చాలారోజుల ముందే గుంటూరు జిల్లా వీపీ సౌత్‌కు మార్చారు. సిబ్బందికి సైతం అక్కడే వసతి సదుపాయం కల్పించారు. చాలా ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్న సిబ్బందిని రాష్ట్ర విభజన జరిగిన పుడు జూన్ 2న గుంటూరు జిల్లా మాచర్ల సర్కిల్ డివిజన్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సిబ్బంది.. తాము ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేది లేదని భీష్మించుకు కూచున్నారు. రెండు నెలలుగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వారికి జీతాలు చెల్లించడం లేదు. దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ ప్రాజెక్టు డివిజన్ కింద పనిచేసే ఉద్యోగులను ఆంధ్రాకు ఎలా కేటాయించారని అధికారులను నిలదీశారు. సత్వరమే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయాలని హరీశ్‌రావు ఆదేశించినట్లు సమాచారం. ‘టీ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించండి’ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి స్వరాష్ట్రానికి కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సచివాలయ సమన్వయ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కమిటీ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ జనరల్ జాకబ్ శనివారం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
పంచాయతీలకు షాకిచ్చిన సర్కార్
మోర్తాడ్ : గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాటర్ వర్క్స్, వీధి దీపాల బిల్లులను తాము చెల్లించేది లేదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలపై భారం పడకుండా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించింది. ఆయన మరణానంతరం గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు ఈ విషయమై దాటవేత ధోరణిని అవలంబిం చగా.. తాజాగా తెలంగాణ సర్కారు విద్యుత్ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే మోపడంతో సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలకు పన్నుల ద్వారా లభించే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో వీధి దీపాలు, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన విద్యుత్ బిల్లులను తాము చెల్లించడం కష్టం అవుతుందని పేర్కొంటున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకు నోటిఫైడ్ పంచాయతీలు 72 ఉన్నాయి. నాన్ నోటిఫైడ్ పంచాయతీ లు 646 ఉన్నాయి. ప్రభుత్వమే వీధి దీపాలు, నీటి పనులకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లిస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ పాలకవర్గాలు బిల్లులను చెల్లించడంలేదు. దీంతో బకాయిలు రూ. 96.86 కోట్లకు చేరుకున్నాయి. గతంలో పంచాయతీలకు పన్నుల వసూలు ద్వారా లభించే ఆదాయం నుంచి విద్యుత్ బిల్లును పాలకవర్గాలు విద్యుత్ సంస్థకు చెల్లించేవి. అయితే ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం, పెరిగిన విద్యుత్ బిల్లులకు పంచాయతీ నిధులు సరిపోకపోవడంతో బిల్లుల భారం పంచాయతీలకు గుదిబండగా మారాయి. దీనిని గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లిం చడానికి ప్రభుత్వం ద్వారా నిధులను వెచ్చించారు. దీంతో పంచాయతీలకు వసూలు అయ్యే పన్నులు, ఇతర నిధుల ను అభివృద్ధి పనులకు వినియోగించే వీలు ఏర్పడింది. ఇప్పుడు మాత్రం పంచాయతీలకు సంబంధించిన విద్యు త్ బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాలని ప్రభుత్వం మౌఖికంగానే ఆదేశాలిచ్చింది. పంచాయతీల కు పన్నులు వసూలు కాకపోతే ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవాలని సూచిం చింది. గతంలో మాదిరిగా విద్యుత్ బిల్లులను తాము చెల్లించలేమని ప్రభుత్వం చెప్పకనే చెప్పడం పంచాయతీ పాలకవర్గాలకు మింగుడు పడటం లేదు. నోటిఫైడ్ పంచాయతీల బకాయిలు రూ. 41.80 కోట్లు ఉండగా నాన్‌నోటిఫైడ్ పంచాయతీల బకాయిలు రూ. 55.06 కోట్లు ఉన్నా యి. సుమారు ఆరేళ్లుగా బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పంచాయతీలకు మంజూరవుతున్న నిధులు అంతంత మాత్రంగా ఉండటం, పన్నుల వసూలు సరిగా జరుగకపోవడంతో విద్యుత్ బకాయిల చెల్లింపు ఎలా సాధ్యం అవుతుందని పలువురు సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. -
దప్పిక తీర్చని పథకం
గూడూరు, న్యూస్‌లైన్: పట్టణంలో రూ.64 కోట్లతో నిర్మించిన నీటి ట్యాంక్ ప్రజల దప్పిక తీర్చడం లేదు. గూడూరు వాసుల శాశ్వత దాహార్తిని తీర్చాలనుకున్న మహానేత ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. తాగునీటి పథకం పనులను నాసిరకంగా చేపట్టడంతో పట్టణంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తరచూ పైపులైన్లు పగిలిపోతూ నీటిసరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో పట్టణంలో నాలుగురోజులుగా నీటిసరఫరా లేక ప్రజలు అగచాట్లు పడుతున్నారు. కొన్ని ఇళ్లకు మంచినీటి వసతి మాత్రమే ఉంది. దీంతో వారు ఆ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అలాంటి వారికి నాలుగురోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ క్యాన్లకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విందూరు, వేములపాళెం వాటర్ వర్క్స్ నుంచి నీటిని పట్టణానికి వదులుతున్నారు. కండలేరు నుంచి అరకొరగా నీటిని కొత్త నీటి పథకానికి తీసుకొస్తున్నా వాటిని వినియోగించే పరిస్థితి లేదు. పట్టణంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను సీఎం కిరణ్ కొంత కాలం కిందట ఆర్భాటంగా ప్రారంభించారు. పైపులైన్లు నాసిరకంగా ఉండటంతో అరకొరగా నీటిని వదిలినా పగిలిపోతున్నాయి. దీంతో నెలలో పది రోజుల పాటు పట్టణంలో తాగునీటి సరఫరా ఉండటం లేదు. 2008, జనవరి 17న వైఎస్సార్ కండలేరు తాగునీటి పథకానికి రూ.64.15 కోట్లు విడుదల చేశారు. 2009, ఫిబ్రవరి 26న పనులకు సంబంధించి ఒప్పందం జరిగింది. 2010, సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకూ పూర్తికాలేదు. అయితే 2012, డిసెంబర్ 14 నాటికి పనులు పూర్తయినట్టు పబ్లిక్‌హెల్త్ వారు మున్సిపాలిటీకి ట్యాంక్‌ను అప్పగించారు. మున్సిపల్ డీఈ, ఏఈ సంతకాలు లేకుండా స్థానిక మున్సిపల్ కమిషనర్ సుశీలమ్మ పథకాన్ని హడావుడిగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఈ, ఏఈలపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించినట్టు సమాచారం. అరకొరగానే నీటి సరఫరా.. పథకాన్ని ప్రారంభించే ముందు పట్టణ ప్రజలకు 24 గంటలు నీటిసరఫరా ఉంటుందని చెప్పారు. ఆ నీరు సరఫరా అయ్యే రోజుల్లో కూడా గతంలోలాగే కేవలం గంటపాటే అదీ ఉదయం మాత్రమే సరఫరా అవుతోంది. రూ.64 కోట్లు వెచ్చించిన పథకం పట్టణ ప్రజలకు తాగునీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పథకం కోసం వెచ్చించిన నిధులు వృథా అయ్యాయనే విమర్శలు లేకపోలేదు. తరచూ మరమ్మతులే.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్ కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. దీంతో తరచూ పలు ప్రాంతాల్లో ప్రధాన పైపులైన్లు పగిలిపోతూ నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడమేకాక నీరు కూడా వృథా అవుతోంది. నాసిరకమైన పైపులను ఉపయోగిం చడం వల్లే ఈ దుస్థితి నెలకొందని తెలుస్తోంది. పలుమార్లు ఈ పథకంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రయోజనం లేదు. -
అవి‘నీటి’ గలగల
=జీవీఎంసీ వాటర్ వర్క్స్‌లో మామూళ్ల ప్రవాహం =తాజాగా ఏసీబీకి చిక్కిన ఈఈ సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీ వాటర్ వర్క్స్ విభాగంలో ‘మామూళ్లు’ ధార కడుతున్నాయి. ఇక్కడి అధికారులు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించేశారు. పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, వ్యక్తిగత కుళాయి కనెక్షన్ల మంజూరుకు ఇక్కడి నుంచి అనుమతి తప్పనిసరి. బల్క్, సెమీ బల్క్ కనెక్షన్లకు సంబంధించి సొమ్ము ఇస్తేనే పని చేస్తారన్న అపవాదును ఇక్కడి అధికారులు మూటగట్టుకున్నారు. తాజాగా ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించే విషయమై రూ.30వేలు లంచం తీసుకుంటూ నీటిసరఫరా విభాగం ఈఈ పీవీవీ సత్యనారాయణరాజు సహా కంప్యూటర్ ఆపరేటర్ అప్పలరాజు ఏసీబీకి చిక్కిన విషయం జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. డీఎస్పీ నరసింహారావు, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, రమణమూర్తి, గణేష్‌లు మాటు వేసి వీరిని పట్టుకున్నారు. నగరం మొత్తం మీద టీఎస్సార్ కాంప్లెక్సులో ఏర్పాటైన మంచినీటి సరఫరా విభాగం కీలకమైనది. వాణిజ్య అవసరాల కోసం హొటళ్లు, విందు వినోదాలకు, ఉచిత నీటి సరఫరా ఇక్కడి నుంచే మొదలవుతుంది. మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ, ఏలేరు తదితర రిజర్వాయర్ల నుంచి నగరానికి మంచినీటి సరఫరా కావాలంటే పైప్లైన్లు వేయించడం, పంప్‌హౌస్‌లు నిర్మాణం, వాటికి రోడ్లు వేయించడం కూడా ఇక్కడి అధికారులే చేయిస్తుంటారు. వీటికి సంబంధించి కాంట్రాక్టర్లు టెండర్ల మేరకు పనులు పూర్తి చేయిస్తారు. వారికి బిల్లులు మంజూరు చేయించాలంటే అనధికారికంగా అధికారులు బిల్లు మొత్తంలో 1శాతం కమిషన్ డిమాండ్ చేస్తుంటారు. బుధవారం నరవకు చెందిన గల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి గతేడాది మెటల్‌రోడ్డు వేయించినందుకు సుమారు రూ.20 లక్షల బిల్లు కోరగా అక్కడి ఈఈ రూ.4శాతం కమిషన్ డిమాండ్ చేయడమే ఇక్కడి అవినీతికి మచ్చు. జీవీఎంసీ వాటర్‌వర్క్స్ విభాగంలో ఏడాది నుంచి క్లియర్ కాని ఫైళ్లు ఉన్నాయి. అప్పు చేసి వడ్డీలు కడుతూ బిల్లు కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లు ఇక్కడి పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాజుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. కోట్లాదిరూపాయల డీడీల కుంభకోణం కూడా గతంలో ఇదే విభాగంలో జరగడం మరింత అక్రమాలకు తావిస్తోంది. అయితే తనను ఎవరో ఇరికించారని, గురువారం తాను ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉందని, కాంట్రాక్టర్లు కొంతమంది పీఎఫ్, ఈఎస్ఐ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆ విషయం తాను సమావేశంలో వెల్లడించాల్సి ఉంది కాబట్టే ఈ విధంగా ఇరికించారని తోటి సిబ్బంది వద్ద ఈఈ రాజు వాపోయినట్టు తెలిసింది. కాళ్లరిగేలా తిప్పించుకుంటూ బిల్లు మంజూరుకు కమీషన్ డిమాండ్ చేయబట్టే తాను ఏసీబీని ఆశ్రయించానని బాధితుడు గల్లా శ్రీనివాసరావు సాక్షికి చెప్పారు. ఏసీబీకి ఫిర్యాదివ్వాలంటే డీఎస్పీ సెల్ నంబర్ 9440446170, 71, 72, 73ను సంప్రదించవచ్చు -
నకిలీ ఏసీబీ అధికారుల ఆటకట్టు
శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులమంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రివాల్వర్‌లో వాడే బుల్లెట్, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన గోతల శ్రీనువాస్ (46) పెయింటింగ్ కాంట్రాక్టర్. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీనగర్లో ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు ఆలేటి కిరణ్ కిశోర్ అలియాస్ సుభాకర్(30) చర్లపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ సైనిక్‌పురిలో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏసీబీ అధికారుల అవతారం ఎత్తారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి.. డబ్బు వసూలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం బంజారాహిల్స్‌లో వాటర్ కనెక్షన్ కోసం వెళ్తే జాప్యం జరిగింది. దీంతో వాటర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ హఫీజ్‌కు శ్రీనివాస్ ఫోన్ చేసి మీపై చాలా ఆరోపణలు ఉన్నాయని బెదిరించాడు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ మీతో మాట్లాడతారని కిరణ్కిశోర్తో మాట్లాడించాడు. ‘నీపై చాలా ఆరోపణలున్నాయి.. మీ ఇద్దరూ తేల్చుకోండి’ అని అతను ఫోన్ పెట్టేశాడు. హఫీజ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. ఇదే తరహాలో నేరేడ్మెట్ వాటర్‌వర్క్స్ డీజీఎం ఉమాశంకర్ నుంచి రూ.5 వేలు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు, మెదక్ జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్ గీత నుంచి రూ.లక్ష, పార్వతీపురం సబ్‌రిజిస్ట్రార్ నుంచి రూ.10 వేలు వసూలు చేశారు. అదే విధంగా శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ రామకృష్ణారెడ్డిని రూ.2 లక్షలు, కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, రాజేంద్రనగర్ సీటీఓ కేఎల్ సుధాకర్, హైదర్‌నగర్ సీటీఓ వెంకటేశ్వరరావు, హైదర్‌నగర్ డీసీటీఓ నాగబాబును పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. అయితే వారు తమపై వచ్చిన ఆరోపణలు ఏమిటో చెప్పాలని కోరడంతో మళ్లీ వారిని సంప్రదించలేదు. ఈక్రమంలోనే ఈనెల 10న శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్స్పెక్టర్ డి.సురేందర్‌రెడ్డిని బెదిరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచన మేరకు సురేందర్‌రెడ్డి.. నకిలీ ఏసీబీ అధికారి శ్రీనివాస్‌కు డబ్బులు ఇస్తానని గచ్చిబౌలిలోని మహారాజ హోటల్‌కు రావాలని కోరాడు. శ్రీనివాస్ సదరు అధికారి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సీహెచ్ కుషాల్కర్, ఎస్ఐ ఎస్.రమేష్, శివకుమార్‌లతో పాటు చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారంతో కిరణ్కిశోర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ను గచ్చిబౌలిలోని ఓ దుకాణంలో ఖరీదు చేసినట్లు నిందితులు వెల్లడించారు. చందానగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ కుషాల్కర్, ఎస్ఐలు శివకుమార్, రమేష్ పాల్గొన్నారు.