ఫేస్బుక్లో కాంట్రాక్టర్ సూసైడ్ నోట్ హల్చల్
అంతా అవినీతి.. ఆత్మహత్యే గతి
- లంచాలివ్వనిదే బిల్లులివ్వడంలేదు..
- వాటర్ వర్క్స్ అధికారుల తీరుకు విసిగి ఫేస్‌బుక్‌లో సూసైడ్‌నోట్ పెట్టిన కాంట్రాక్టర్
హైదరాబాద్: అవినీతి అధికారుల తీరుతో విసిగి వేసారిన ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంటానని ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్‌ను అప్‌లోడ్ చేశారు. లంచాలు ఇస్తేగాని బిల్లులు మంజూరుకాని పరిస్థితి హైదరాబాద్ చింతల్ వాటర్‌వర్క్స్ కార్యాలయంలో నెలకొందని నోట్‌లో పేర్కొన్నారు. చింతల్ వాటర్‌వర్క్స్ డివిజన్-12లో ఓ సెక్షన్‌కు అనుబంధంగా వడ్లమూడి రవికుమార్ అనే కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు. చిన్నపాటి లీకేజీలకు మరమ్మతులు, రూ.5 లక్షల వరకు పైపులైన్ పనులు చేస్తుంటారు. గత మూడేళ్ల పనులకుగాను అతడికి రూ.8 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది.
దీంతో పలుమార్లు చింతల్ వాటర్‌వర్క్స్‌అధికారులను కలసి బిల్లులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కమీషన్ ఇవ్వనిదే రికార్డు బుక్‌లో బిల్లులు నమోదు చేయబోమని అధికారులు సతాయించారు.
లంచాలపై నిలదీసినందుకే తన బిల్లులను అధికారులు మంజూరు చేయడంలేదని, తాను చనిపోతున్నానని, తన కుటుంబసభ్యులను ఆదుకోవాలని సూసైడ్ నోట్‌ను ఫేస్‌బుక్‌లో మెట్రో వాటర్‌వర్క్స్ అధికారులకు పోస్ట్ చేశారు. అయినా అధికారుల్లో చలనం లేకపోవడంతో శుక్రవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేషీకి ఓ సందేశాన్ని పంపారు. బంగారు తెలంగాణకు స్థానిక అధికారులు అడ్డుగా మారుతున్నారని పేర్కొన్నారు. రవికుమార్ పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తోంది.