శేరిలింగంపల్లి, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులమంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రివాల్వర్‌లో వాడే బుల్లెట్, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎస్‌ఓటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లాకు చెందిన గోతల శ్రీనువాస్ (46) పెయింటింగ్ కాంట్రాక్టర్.
బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీనగర్‌లో ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు ఆలేటి కిరణ్ కిశోర్ అలియాస్ సుభాకర్(30) చర్లపల్లిలోని ఓ కంపెనీలో పనిచేస్తూ సైనిక్‌పురిలో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరిద్దరూ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఏసీబీ అధికారుల అవతారం ఎత్తారు. తాము ఏసీబీ అధికారులమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి.. డబ్బు వసూలు చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం బంజారాహిల్స్‌లో వాటర్ కనెక్షన్ కోసం వెళ్తే జాప్యం జరిగింది.
దీంతో వాటర్ వర్క్స్ ఇన్‌స్పెక్టర్ హఫీజ్‌కు శ్రీనివాస్ ఫోన్ చేసి మీపై చాలా ఆరోపణలు ఉన్నాయని బెదిరించాడు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సురేష్ మీతో మాట్లాడతారని కిరణ్‌కిశోర్‌తో మాట్లాడించాడు. ‘నీపై చాలా ఆరోపణలున్నాయి.. మీ ఇద్దరూ తేల్చుకోండి’ అని అతను ఫోన్ పెట్టేశాడు. హఫీజ్‌ను రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.25 లక్షలు ముట్టజెప్పాడు. ఇదే తరహాలో నేరేడ్‌మెట్ వాటర్‌వర్క్స్ డీజీఎం ఉమాశంకర్ నుంచి రూ.5 వేలు, 10 తులాల గోల్డ్ బిస్కెట్లు, మెదక్ జిల్లా రామచంద్రాపురం తహశీల్దార్ గీత నుంచి రూ.లక్ష, పార్వతీపురం సబ్‌రిజిస్ట్రార్ నుంచి రూ.10 వేలు వసూలు చేశారు.
అదే విధంగా శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్ రామకృష్ణారెడ్డిని రూ.2 లక్షలు, కొవ్వూరు సబ్ రిజిస్ట్రార్ శోభారాణి, రాజేంద్రనగర్ సీటీఓ కేఎల్ సుధాకర్, హైదర్‌నగర్ సీటీఓ వెంకటేశ్వరరావు, హైదర్‌నగర్ డీసీటీఓ నాగబాబును పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. అయితే వారు తమపై వచ్చిన ఆరోపణలు ఏమిటో చెప్పాలని కోరడంతో మళ్లీ వారిని సంప్రదించలేదు.
ఈక్రమంలోనే ఈనెల 10న శేరిలింగంపల్లి సర్కిల్-11 ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ డి.సురేందర్‌రెడ్డిని బెదిరించడంతో ఆయన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సూచన మేరకు సురేందర్‌రెడ్డి.. నకిలీ ఏసీబీ అధికారి శ్రీనివాస్‌కు డబ్బులు ఇస్తానని గచ్చిబౌలిలోని మహారాజ హోటల్‌కు రావాలని కోరాడు. శ్రీనివాస్ సదరు అధికారి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ కుషాల్కర్, ఎస్‌ఐ ఎస్.రమేష్, శివకుమార్‌లతో పాటు చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారంతో కిరణ్‌కిశోర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
బుల్లెట్‌ను గచ్చిబౌలిలోని ఓ దుకాణంలో ఖరీదు చేసినట్లు నిందితులు వెల్లడించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ కుషాల్కర్, ఎస్‌ఐలు శివకుమార్, రమేష్ పాల్గొన్నారు.
నకిలీ ఏసీబీ అధికారుల ఆటకట్టు
Published Sun, Oct 13 2013 3:57 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM
Advertisement