మమ్మల్ని ఆంధ్రాకు పంపొద్దు | sagar employees deny to go to andhra pradesh | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఆంధ్రాకు పంపొద్దు

Published Sun, Aug 3 2014 2:01 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

sagar employees deny to go to andhra pradesh

* 86 మంది సాగర్ ఉద్యోగుల వినతి
* 2 నెలలుగా జీతాలందని వైనం


సాక్షి, హైదరాబాద్: ‘మమ్మల్ని ఆంధ్రాకు పంపొద్దు..’ అంటూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 86 మంది నాలుగో తరగతి ఉద్యోగులు వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ర్ట విభజన సమయంలో ఆంధ్రాకు కేటాయించిన తమను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించేలా చూడాలని ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. సాగర్ ప్రాజెక్టు గేట్ మెయింటెనెన్స్, వాటర్ వర్క్స్ విభాగాల్లోని వీరంతా సీఈ డివిజన్ పరిధిలో ప్రాజెక్టు అవతల పనిచేస్తున్నారు.
 
దీంతో పాలన, వసతి సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. వీరి విభాగాల విభజనకు చాలారోజుల ముందే గుంటూరు జిల్లా వీపీ సౌత్‌కు మార్చారు. సిబ్బందికి సైతం అక్కడే వసతి సదుపాయం కల్పించారు. చాలా ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్న సిబ్బందిని రాష్ట్ర విభజన జరిగిన పుడు జూన్ 2న గుంటూరు జిల్లా మాచర్ల సర్కిల్ డివిజన్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సిబ్బంది.. తాము ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేది లేదని భీష్మించుకు కూచున్నారు. 

రెండు నెలలుగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో వారికి జీతాలు చెల్లించడం లేదు. దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ ప్రాజెక్టు డివిజన్ కింద పనిచేసే ఉద్యోగులను ఆంధ్రాకు ఎలా కేటాయించారని అధికారులను నిలదీశారు. సత్వరమే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయాలని హరీశ్‌రావు ఆదేశించినట్లు సమాచారం.
 
‘టీ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించండి’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి స్వరాష్ట్రానికి కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సచివాలయ సమన్వయ కమిటీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కమిటీ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ జనరల్ జాకబ్ శనివారం సీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement