ఉద్యోగుల బకాయిలు రూ.25,000 కోట్లు.. ప్రభుత్వం విడుదల చేసింది రూ.1,300 కోట్లు
వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలకుగానూ అరకొర నిధులను విడుదలచేస్తూ, సంక్రాంతి కానుకగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు నల్లమరు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25,000 కోట్లు ఉంటే, కూటమి ప్రభుత్వం రూ.1,300 కోట్లే విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు. ఆయన ఏమన్నారంటే..
⇒ ఇవ్వాల్సిన బకాయిలెంత? ఇప్పుడు చెల్లిస్తామన్నది ఎంతో వివరంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వ నిజ స్వరూపం బయటపడుతుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను తరచుగా నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకునేది. కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు పిలిచి మాట్లాడిన దాఖలాల్లేవు.
⇒ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,300 కోట్లలోనూ రూ.519 కోట్లు జీపీఎఫ్ కోసం, రూ.214 కోట్లు పోలీస్ విభాగం ఒక విడత సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల భాగస్వామ్యం కోసం రూ. 300 కోట్లు మాత్రమే కడతామని చెబుతున్నారు. ఇదేనా మీరు ఉద్యోగులకు ఇస్తున్న సంక్రాంతి కానుక?
⇒ జీపీఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకున్న డబ్బు. దీనికి మొత్తం ఇవ్వకుండా రూ. 519 కోట్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం? ఏడాదికి 15 రోజులు ఉద్యోగులు తమ లీవులను సరెండర్ చేసుకునేందుకు వీలుంది. దీనిని అందరికీ ఇవ్వకుండా కేవలం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు.. అది కూడా ఒక విడత మాత్రమే ఇస్తున్నారు. సీపీఎస్ కూడా ఒక విడత చెల్లింపులు మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. ఉద్యోగస్తులకు టీడీఎస్ కింద రూ.265 కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 36 ఏళ్లు ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగిగా ప్రభుత్వ తీరు అర్థం కావడంలేదు.
⇒ రాష్ట్రంలోని 3.80 లక్షల మంది పెన్షనర్లకు ఏమాత్రం మేలు చేయడంలేదు. డీఎ ఎరియర్స్, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవులు, సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, కమిటేషన్ ఆఫ్ లీవ్, గ్రాట్యూటీ వంటి బెనిఫిట్స్ పెండింగ్ లో పెడుతున్నారు. అలాగే, మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్, ఏపీజేఎల్ వంటివి రూ. కోట్లలో ఉన్నాయి. వాటిల్లో ఇంతమేరకు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం స్పష్టంచేయాల్సి ఉంది.
⇒ మంచి పీఆర్సీని, మధ్యంతర భృతిని ఇస్తామని టీడీపీ కూటమి ఎన్నికల్లో హామీలిచ్చింది. 7 నెలలు గడుస్తున్నా పీఆర్సీని నియమించలేదు, ఐఆర్‌ను ప్రకటించలేదు. రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రతి ఆరునెలలకు కేంద్రం డీఏను ప్రకటిస్తుంది. ఏపీలో 2024లో రావాల్సిన రెండు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
⇒ కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. తొలి రెండు నెలలే అలా ఇచ్చారు. హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులు కొంత, ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది. ప్రతిసారీ ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడంవల్ల ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. సకాలంలో ప్రభుత్వ వాటా చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment