ఏపీ బడ్జెట్‌లో ఉద్యోగులకు తీరని అన్యాయం: చంద్రశేఖర్‌రెడ్డి | YSRCP Employees And Pensioners Wing President N Chandrasekhar Reddy Slams Chandrababu Over AP Budget, More Details | Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌లో ఉద్యోగులకు తీరని అన్యాయం: చంద్రశేఖర్‌రెడ్డి

Published Sat, Mar 1 2025 2:53 PM | Last Updated on Sat, Mar 1 2025 3:54 PM

Ysrcp Employees And Pensioners Wing President N Chandrasekhar Reddy Slams Chandrababu

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ అండ్‌ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30,000 కోట్ల బకాయిలపై బడ్జెట్‌లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించారు
ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్ ఏర్పాటే చేయలేదు. బడ్జెట్ లో పీఆర్సీ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది. ప్రభుత్వం రాగానే మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరు. బడ్జెట్‌లో దీనికి ఒక్క రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. గతంలో వైఎస్‌ జగన్‌ మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు.

ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం ఒక్క నెలలో మాత్రమే దానిని కార్యరూపంలో చూపించారు. గత ఎనిమిది నెలల నుంచి ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. గ్రాట్యుటీ, మెడికల్ రీయింబర్స్ మెంట్, సరెండర్ లీవులు, పీఆర్సీ, డీఏ ఎరియర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సకాలంలో ఇవ్వాల్సని బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ బకాయిల చెల్లింపుల కోసం ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు.

తాత్కాలిక ఉద్యోగులను మోసం చేశారు
అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీని నేటికీ నెరవేర్చలేదు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, మా ప్రభుత్వం రాగానే అయిదు నుంచి పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఇప్పుడు రోడ్డుమీద పడేశారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కింద పనిచేస్తున్న పదివేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వీధుల్లోకి తీసుకువచ్చారు. వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాల్సీ ఉంది. గత ప్రభుత్వంలో పదివేల మందిని గుర్తించి, వారిలో మూడు వేల మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏడు వేల మందికి ఇప్పటి వరకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామసచివాలయాల్లో పదిహేను వేలు, రైతుభరోసా కేంద్రాల్లో ఆరువేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటి గురించి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణం.

మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వ దగా
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మెగా డీఎస్సీని నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఫైల్‌గా దీనిపైనే సంతకం చేశారు. కానీ నోటిఫికేషన్ షెడ్యూల్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఇవ్వేవీ చేయకుండా బడ్జెట్‌లో డీఎస్సీ కింద 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే వచ్చే అయిదేళ్ల పాటు ఇదే చెప్పుకుంటూ పోతారా? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించామని గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు చెప్పారు.

అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తున్నామంటూ బడ్జెట్ లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే అమలు జరిగిపోతోందోని చెప్పడం ఎంత వరకు సమంజసం? పోలీస్ విభాగంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.920 కోట్లు ఉంటే, దానిలో రూ.250 కోట్లు చెల్లించామని చెప్పుకున్నారు. మిగిలిన బకాయిల విషయం ఏమిటనే దానిపై స్పష్టత లేదు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు డీఏలు బకాయి పెట్టారు. ధరలు పెరుగుతుండటం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది ఉండకూడదనే డీఏ ఇస్తుంటారు. దానిని కూడా మూడు విడతలు బకాయి పెట్టడం దారుణం. నిరుద్యోగభృతి అమలుకు కేటాయింపులు లేవు. కొత్త ఉద్యోగాల భర్తీకి గానూ ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏదీ? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేందుకు గత ప్రభుత్వం అప్కాస్ ను తీసుకువచ్చింది. దానిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం దళారీల వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఉద్యోగుల ఆరోగ్యభద్రతకు సంబంధించిన హెల్త్ కార్డ్ లకు ఉద్యోగులు, పెన్షనర్లు తమ వాటాను వారు చెల్లిస్తున్నా, ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాను సకాలంలో చెల్లించడం లేదు. దీనివల్ల ఉద్యోగులకు వైద్యం చేసేందుకు ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement