ఎంత ముందుచూపో! | Mission Bhagiratha Has Controversy Of Water Connections In Kamareddy | Sakshi
Sakshi News home page

‘భగీరథ’ను దారితప్పించిన అధికారులు

Published Fri, Aug 30 2019 9:15 AM | Last Updated on Fri, Aug 30 2019 9:15 AM

Mission Bhagiratha Has Controversy Of Water Connections In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: ఇంటింటికీ శుద్ధ జలాలను అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని ఆవాసాలకు శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. అయితే కొందరు అధికారుల తీరుతో పథకం అభాసుపాలవుతోంది. ఇళ్లున్న కాలనీని నిర్లక్ష్యం చేసిన అధికారులు.. అసలు ఇళ్లే లేని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు ప్లాటు ప్లాటుకో నల్లా కనెక్షన్‌ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.

పట్టణంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో ఎంత వెతికినా ఒక్క ఇల్లూ కానరాదు.. కానీ అధికారులు మాత్రం చాలా ముందుచూపుతో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ వేశారు. అంతటితో సరిపెట్టకుండా ప్లాటుప్లాటుకో నల్లా కనెక్షన్‌ కూడా ఇచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు సమీపంలోనే జయశంకర్‌ కాలనీ ఉంది. ఈ కాలనీలో చాలా ఇళ్లున్నాయి. కానీ ఈ కాలనీకి మాత్రం నల్లా కనెక్షన్‌ ఇవ్వలేదు. అసలు భగీరథ పైప్‌లైనే వేయలేదు. మిషన్‌ భగీరథ పథకంలో అధికారుల తీరుకు ఇవి మచ్చుతునకలు.. 

జిల్లాలో 834 ఆవాసాల పరిధి లో 2,44,673 ఇళ్లున్నాయి. వీటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాకు శ్రీరాంసాగర్, సింగూ రు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించేందుకు రూ.2,650 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. 600 ట్యాంకుల నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. 567 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంటింటికీ నీటిని అందించేందుకుగాను  2,123 కిలోమీటర్ల మేర అంతర్గత పైపులైన్‌ వేయాల్సి ఉండగా.. 2,053 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశా రు. అలాగే 2,44,673 ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. 2,44,000 ఇళ్లకు నల్లాలు బిగించినట్టు పేర్కొంటున్నారు. జిల్లాలో 834 నివాసిత ప్రాంతాలకుగాను 811 ప్రాంతాల్లో వంద శాతం పనులు పూర్తి చేసి ఇంటింటికీ న ల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పట్టణాలు, పల్లెల్లో చాలా చోట్ల పైపులైన్‌ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొన్నిచోట్ల పైపులైన్లు కూడా వేయలేదు.

వెంచర్‌కు కనెక్షన్‌.. 
అన్ని ఆవాసాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం సంగతి అటుంచితే.. జిల్లా కేంద్రంలో విచిత్రంగా వెంచర్‌కు పైప్‌లైన్‌ వేయడమే కాకుండా నల్లా కనెక్షన్‌లు కూడా ఇవ్వడం ఆరోపణలకు తావిస్తోంది. అడ్లూర్‌ రోడ్డు లో ఉన్న జయశంకర్‌ కాలనీ నుంచి రామారెడ్డి రోడ్డుకు వెళ్లడానికి కొత్తగా వేసిన బీటీ రోడ్డుకు ఇరుపక్కల ఉన్న భూములను ఇటీవల వెంచర్‌ చేశారు. ఇది కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత కార్యాలయాలకు సమీపంలో ఉంది. వెంచర్‌ చేసినపుడు అందులో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత రియల్టర్లపైన ఉంటుంది.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటిని పట్టించుకోకుండా, అధికారులను మేనేజ్‌ చేసుకుని ప్లాట్లు చేసేశారు. ఇలా ప్లాట్లుగా చేసినవాటిని అమ్మాలంటే సౌకర్యాలు చూపాలన్న ఉద్దేశంతో ఏదో ఒక రకంగా ఆ వెంచర్‌ మీదుగా బీటీ రోడ్డు వేయించారు. వెంచర్‌లో చేసిన ప్లాట్లకు తాగునీటి కోసం మిషన్‌ భగీరథ పథకంలో పైపులైన్లు కూడా వేయించారు. అంతటితో ఆగకుండా ప్లాటుకో నల్లా పైపును తీసి పెట్టారు. ఒక ట్యాప్‌ బిగిస్తే చాలు.. అయితే ఆ వెంచర్‌లో ఒక్కటంటే ఒక్క ఇళ్లూ లేకపోవడం గమనార్హం. భగీరథ పైపులైన్లు వేయాల్సిన చోట వేయకుండా వెంచర్లలో వేయడమే గాకుండా నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.

రాజకీయ పార్టీల నేతలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా చెలామణి అవుతుండడంతో అధికారులు వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వెంచర్లు చేసిన వారు వసతులు కల్పించాల్సి ఉండగా, ప్రభుత్వ నిధులతో పైపులైన్లు వేసి నల్లాలు బిగించడం ద్వారా ప్లాట్లు సులువుగా అమ్ముడుపోవడానికి అధికారులు తమవంతు సహకారం అందించారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement