న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల జీవన్ మిషన్‌తో దేశవ్యాప్తంగా 1.25 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రెండేళ్లలో 5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. గృహాలకు నీటి సరఫరా విషయంలో గత 7 దశాబ్దాల్లో సాధించిన దానికంటే కేవలం ఈ రెండేళ్లలో సాధించిందే అధికమని ఉద్ఘాటించారు.
మోదీ శనివారం ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య కమిటీల(వీడబ్ల్యూఎస్సీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జల జీవన్ మిషన్ అమలు తీరుపై చర్చించారు. కమిటీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జల జీవన్ మిషన్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. ‘రాష్ట్రీయ జల జీవన్ కోష్’కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద గ్రామాలు, ప్రభుత్వ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఎవరైనా విరాళాలు అందజేయవచ్చు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... జల జీవన్ మిషన్ కేవలం ప్రజలకు నీటిని అందించే కార్యక్రమం మాత్రమే కాదని, వికేంద్రీకరణ దిశగా ఇది గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2019 దాకా దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం ఉండేదన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లోని 1.25 కోట్ల గృహాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. నీరు ఎంతో విలువైనదని, దాన్ని ఇష్టరాజ్యంగా వాడేవారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని మోదీ సూచించారు. కొన్ని అలవాట్లు మార్చుకుంటే నీటిని ఆదా చేయొచ్చని చెప్పారు. గుజరాత్‌లో పుట్టి పెరిగిన తనకు నీటి కష్టాలు తెలుసని వెల్లడించారు.
7.1 లక్షల మందికి శిక్షణ
దేశంలో ఆడబిడ్డల ఆరోగ్యం, భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధానివెల్లడించారు. ప్రతి ఇంటిలో, బడిలె మరుగుదొడ్డి సౌకర్యం, తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్, గర్భిణులకు పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రల పంపిణీ వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉండగా, 3.5 లక్షల గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుధ్య కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. నీటి నాణ్యత పరీక్షించేందుకు 7.1 లక్షల మందికిపైగా మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment