ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’ | Availability of water which has not kept pace with the growing population of the country | Sakshi
Sakshi News home page

ఇలాగైతే ‘నీళ్లు నమలాల్సిందే’

Published Mon, Apr 24 2023 3:48 AM | Last Updated on Mon, Apr 24 2023 3:48 AM

Availability of water which has not kept pace with the growing population of the country - Sakshi

సాక్షి, అమరావతి: వరద జలాలను ఒడిసి పట్టడం.. భూగర్భ జలాలను పెంపొందించడం వంటి జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే దేశంలో తీవ్ర జల సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తలసరి నీటి లభ్యత పెరగడం లేదనే అంశాన్ని స్పష్టంచేసింది.

తలసరి నీటి లభ్యత 2001లో 1,816 క్యూబిక్‌ మీటర్లు (ఒక క్యూబిక్‌ మీటర్‌ వెయ్యి లీటర్లకు సమానం) ఉంటే.. 2021 నాటికి 1,486 క్యూబిక్‌ మీటర్లకు తగ్గిపోవడాన్ని గుర్తు చేసింది. నీటి లభ్యతను పెంచే చర్యలు చేపట్టకపోతే.. 2031 నాటికి 1,367 క్యూబిక్‌ మీటర్లకు, 2041 నాటికి 1,282 క్యూబిక్‌ మీటర్లకు, 2051 నాటికి 1,228 క్యూబిక్‌ మీటర్లకు తగ్గిపోతుందని అంచనా వేసింది.  

ఇలాగైతే.. కష్టమే! 
పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్‌లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని కేంద్ర జలసంఘం     ఆందోళన వ్యక్తం చేసింది. సాగునీటి సమస్య పంటల సాగుపై ప్రభావం చూపుతుందని.. ఇది ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొంది. నీటి లభ్యతను పెంచేలా వరద నీటిని ఒడిసిపట్టి జలాశయాల్లో నిల్వ చేయడం, జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా జల సంక్షోభాన్ని నివారించవచ్చనని కేంద్రానికి సూచించింది.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దేశంలో మరిన్ని రిజర్వాయర్లు నిర్మించి.. నదీ జలాలను మళ్లించి వాటిని   నింపడం ద్వారా నీటి లభ్యతను పెంచుకోవాలని స్పష్టం చేసింది. నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చుకోకుంటే ఆహార ధాన్యాల దిగుబడి పెరగదని తేల్చింది. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగకుంటే ఆహార సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించింది.

సీడబ్ల్యూసీ అధ్యయనంలో ఏం తేలిందంటే 
దేశంలో ఏటా సగటున 1,298.60 మి.మీ. వర్షపాతం కురుస్తోంది. తద్వారా 1,37,002.08 టీఎంసీల నీరు లభ్యమవుతోంది. 
 వర్షపాతం వల్ల గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా నదు­ల్లో ప్రవాహం రూపంలో 70,591.75 టీఎంసీలు లభిస్తుండగా.. ప్రస్తుతం జలాశయాల ద్వారా 24,367.43 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకుంటున్నాం.  
 ఏటా 46,224.32 టీఎంసీలు కడలిలో కలిసిపోతున్నాయి. అంటే వాడుకుంటున్న నీటి కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా నదీ జలాలు కడలిలో కలుస్తున్నట్టు వెల్లడవుతోంది. 
♦ దేశవ్యాప్తంగా వివిధ నదులపై నిర్మించిన 5,745 డ్యా­మ్‌ల నీటి నిల్వ సామర్థ్యం 9,103.34 టీఎంసీలు. ఈ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేస్తూ సాగు, తాగునీటి అవసరా­ల కోసం 24,367.43 టీఎంసీలను  మాత్రమే వాడుకుంటున్నాం. 
♦ ఆంధ్రప్రదేశ్‌లో 166 డ్యామ్‌ల నిల్వ సామర్థ్యం 983.59 టీఎంసీలు. అన్ని జిల్లాల్లో కలిపి 1.05 కోట్ల ఎకరాలకు నీళ్లందించేలా ఆయకట్టును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement