తాజా అధ్యయనంలో తేల్చిన కేంద్ర జలసంఘం
2019లో అంచనా వేసిన దాని కంటే ఇప్పుడు లభ్యత 27.55 టీఎంసీలు తగ్గిన వైనం
1985–86 నుంచి 2022–23 మధ్య పెన్నా బేసిన్‌లో ప్రవాహాల ఆధారంగా అధ్యయనం
వర్షచ్ఛాయ ప్రాంతంలోని పెన్నా బేసిన్‌లో ఈ స్థాయి నీటి లభ్యతపై నిపుణుల ఆశ్చర్యం
సాక్షి, అమరావతి:పెన్నా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయంటోంది కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ). అధునాతన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బేసిన్‌లో 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చేసిన అధ్యయనంలో పెన్నాలో 367.98 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది.
జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఎఆర్‌ఎస్‌సీ) సహకారంతో 2019లో 25 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా పెన్నాలో 395.53 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టింది. అప్పటి కంటే ఇప్పుడు చేసిన అధ్యయనంలో నీటి లభ్యత 27.55 టీఎంసీల తగ్గిందని తేల్చింది.
వర్షఛాయ ప్రాంతం (రెయిన్ షాడో ఏరియా)లో పుట్టి, ప్రవాహించే పెన్నాలో ఈ స్థాయిలో నీటి లభ్యత ఉంటుందా? అని జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజినీర్లు, నీటిపారుదలరంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తుపాన్‌లు, కుండపోత వానలు.. వాటి ప్రభావం వల్ల వచ్చే నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని నీటి లభ్యతపై చేసే అధ్యయానికి శాస్త్రీయత ఉండదని చెబుతున్నారు.
పెన్నా బేసిన్ ఇదీ..
కర్ణాటకలో నంది కొండల్లో పుట్టిన పెన్నా నది కర్ణాటకలోని కోలార్, తుమకూరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా 697 కిమీల దూరం ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఎడమ వైపు నుంచి జయమంగళి, కుందేరు.. కుడి వైపు నుంచి చిత్రావతి, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు ప్రధాన ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల (ఆంధ్రప్రదేశ్ 87 శాతం, కర్ణాటక 13 శాతం) పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం.
సీడబ్ల్యూసీ తాజా అధ్యయనంలో ప్రధానాంశాలు
» పెన్నా బేసిన్‌లో 1985–86 నుంచి 2022–23 మధ్య 38 ఏళ్లలో ఏటా సగటున 752.72 మిమీల వర్షపాతం కురిసింది. ఈ వర్షపాతం పరిమాణం 1,459.56 టీఎంసీలు. బేసిన్‌లో గరిష్టంగా వర్షపాతం 2020–21లో 1,265 మి.మీ.లు కురిసింది. దీని పరిమాణం 2,452.96 టీఎంసీలు.. బేసిన్ కనిష్ట వర్షపాతం 2018–19లో 395 మి.మీ.లు నమోదైంది. దీని పరిమాణం 765.27 టీఎంసీలు.
» బేసిన్‌లో 1996–97లో గరిష్టంగా నీటి లభ్యత 1,067.57 టీఎంసీలు ఉండగా.. 2011–12లో కనిష్టంగా 94.29 టీఎంసీల లభ్యత ఉంది. 38 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా చూస్తే ఏటా సగటున 367.98 టీఎంసీల లభ్యత ఉంది.
» 1985–86 నుంచి 2022–23 మధ్య సాగునీటి కోసం ఏటా 212.60 టీఎంసీలను వినియోగించారు.
» బేసిన్‌లో రిజర్వాయర్లలో ఏటా సగటున నీటి ఆవిరి నష్టాలు 17.66 టీఎంసీలు.
» 2022–23లో గృహ, పారిశ్రామిక అవసరాలు, జంతువులకు తాగునీటి అవసరాల కోసం 17.30 టీఎంసీలు ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment