ఎవరి మెడకో!
హుజూరాబాద్ నగరపంచాయతీ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ నివేదిక!
♦ ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల్లో ఆందోళన
♦ సెలవుపై వెళ్లిన కమిషనర్ అబిద్ అదేబాటలో మేనేజర్?
♦ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఎన్‌వీ నాగేంద్రబాబు
♦ బిల్లులు సర్ధుకునే పనిలో కౌన్సిలర్లు?
హుజూరాబాద్ నగర పంచాయతీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటిదాకా కమిషనర్‌గా పనిచేసిన మహ్మద్ అబీద్ ఉన్నట్టుండి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నగర పంచాయతీలో అక్రమాలపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలు పాలకవర్గాన్ని, అధికారులను కుదిపేశారుు. అవినీతి, అక్రమాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ అధికారులు ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు తెలిసింది. మరోవైపు కలెక్టర్ నీతూప్రసాద్ సైతం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఫలితంగా పలువురు అధికారుల్లో ఆందోళన మొదలు కాగా, వీలైనంత త్వరగా బిల్లులు దక్కించుకునే పనిలో కౌన్సిలర్లు ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : హుజూరాబాద్ నగర పంచాయతీ పరిధిలో పలు అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అభివృద్ధి పనులకు టెండర్లలో సింహభాగం సింగిల్ టెండర్లు దాఖలు కావడం, అందులోనూ చాలా వరకు ఎక్సెస్ వేయడం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని, మోడల్ చెరువులోని చెట్లను నరికి విక్రయించారనే అంశాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంటెలిజెన్స్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో నగర పంచాయతీ కమిషనర్ సయ్యద్ అబిద్ నాలుగు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయూరు. ఆయన స్థానంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారి(ఆర్వో)గా పనిచేస్తున్న ఎన్‌వీ నాగేంద్రబాబు బదిలీపై హుజూరాబాద్ నగర పంచాయతీ ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమితులయ్యారు.
‘దీర్ఘకాలిక సెలవు’ ఆంతర్యమేంటో?
‘సాక్షి’లో వచ్చిన కథనాల నేపథ్యంలో కమిషనర్ అబిద్‌కు నగర పంచాయతీ చైర్మన్ వి.విజయ్‌కుమార్ రెండు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లకు బదులు వివరణలో బాక్స్ టెండర్లని ఎలా పేర్కొన్నారని, దీనివల్ల కౌన్సిల్ విలువ తగ్గిపోతోందనేది మొదటి నోటీసులోని సారాంశం. మరో నోటీసులో ‘కమిషనర్ స్థానికంగా నివాసం ఉండటం లేదు. నాన్ ట్యాక్స్ కలెక్షన్లు జరగడం లేదు. సంక్షేమ పథకాల అమలులో పర్యవేక్షణ లోపం ంటోంది. మొక్కుబడిగా వార్డు సందర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మ్యుటేషన్, జన్మదిన పత్రాలు, అనుమతుల జారీలో జాప్యం జరుగుతోంది.
పారిశుధ్య సిబ్బందిపై పర్యవేక్షణ లేదు’ అని పేర్కొంటూ ఈ ప్రశ్నలన్నింటికీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వడంతోపాటు పనితీరు మార్చుకున్నట్లు రుజువు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ అవినీతి, అక్రమాల వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలిసింది.
బిల్లులెలా?
ప్రస్తుతం నగర పంచాయతీలో బిల్లుల చెల్లింపు సమస్య పాలకవర్గాన్ని వేధిస్తోంది. బిల్లుల చెల్లింపు జరగాలంటే కమిషనర్ తప్పనిసరిగా ఉండాలి. ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో చెక్ పవర్‌ను మేనేజర్‌కు దఖలు పరుస్తూ తీర్మానించారు. మేనేజర్ సైతం ఈ వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళనతో సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. కమిషనర్ లేకపోవడం, మేనేజర్ సెలవుపై వెళ్లడంతో బిల్లుల చెల్లింపులు ఆగిపోయూరుు. దీంతో ఆందోళన చెందిన కొందరు పాలకవర్గ సభ్యులు ఇన్‌చార్జి కమిషనర్‌ను నియమించాలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో గద్వాల మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఎన్వీ నాగేంద్రబాబును హుజూరాబాద్ నగరపంచాయతీ ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించే కమిషనర్ ఎలా స్పందిస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అభివృద్ధి పనుల టెండర్లను కాంట్రాక్టర్ల ముసుగులో దక్కించుకున్న కొందరు కౌన్సిలర్లు నాణ్యత ప్రమాణాలను పాటించకుండానే తొందరగా పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆయా పనులకు అవసరమైన నీటిని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయిస్తూ పనులు జరుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు కౌన్సిలర్లే ప్రత్యక్షంగా పనులు చేస్తున్నప్పటికీ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండటంతో ఈ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయం కాంట్రాక్టర్లను వెంటాడుతోంది.