సీఎం ముఖ్యకార్యదర్శిగా వి.శేషాద్రి | V Seshadri as Chief Secretary to CM | Sakshi
Sakshi News home page

సీఎం ముఖ్యకార్యదర్శిగా వి.శేషాద్రి

Published Fri, Dec 8 2023 4:20 AM | Last Updated on Fri, Dec 8 2023 4:20 AM

V Seshadri as Chief Secretary to CM - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వి. శేషాద్రి, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతిగా బి. శివధర్‌రెడ్డి నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సొంత జట్టు కూర్పుపై దృష్టి సారించిన రేవంత్‌రెడ్డి తన తొలి ఎంపికగా ఇద్దరు సమర్థులైన అధికారులనే నియమించుకున్నారు. ఇద్దరు అధికారులూ ఆయా పదవుల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారు. 1999 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వి.శేషాద్రి సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయనకు రెవెన్యూ వ్యవహారాలు, భూ చట్టాలపై పట్టు ఉంది. 2013 ఆగస్టు 22 నుంచి 2020 ఆగస్టు 22 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలోని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో డైరెక్టర్, జాయింట్‌ సెక్రటరీల హోదాల్లో ఆయన డిప్యుటేషన్‌పై పనిచేశారు. 2020 సెప్టెంబర్‌ నుంచి 2022 మే వరకు నాటి సీఎం కేసీఆర్‌కు ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సమయంలో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ధరణి ప్రాజెక్టు అమలులో కీలకంగా వ్యవహరించారు. 2022 మే నుంచి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

2009–12 మధ్య చిత్తూరు, రంగారెడ్డి, విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతిగా నియమితులైన శివధర్‌రెడ్డి ప్రస్తుతం రైల్వే, రోడ్డు భద్రతా విభాగం అదనపు డీజీగా వ్యవహరిస్తున్నారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఇంటెలిజెన్స్‌ విభాగంలో అత్యంత కీలకంగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఎస్‌ఐబీలో డీఐజీగా, నల్లగొండ, నెల్లూరు, గుంటూరులో ఎస్పీగా పలు కీలక పోస్టింగ్‌లలో పనిచేశారు. సమర్థుడైన అధికారిగా పోలీస్‌శాఖలో శివధర్‌రెడ్డికి పేరు ఉంది. ఆయనకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిఘా విభాగాధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement