ఉద్రిక్తత నడుమ ఆక్రమణల తొలగింపు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల నగర పంచాయతీలో ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. కడప రోడ్డులో ఉన్న సర్వే నంబరు 606బిలో ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలంలో కొందరు దళితులు చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. మరి కొందరు దుకాణలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై కొద్ది రోజులుగా చర్చ సాగింది. శుక్రవారం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందొబస్తు నడుమ తొలగింపుకు పూనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివాసం ఉంటున్న ఎనిమిది దళిత కుటుంబాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ తరుణంలో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత మూడు జేసీబీలతో అక్రమణలను తొలగించారు.
అనంతరం కమిషనర్ భవానీ ప్రసాద్ విలేకరులతో మట్లాడుతూ.. ఎంతో విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని బాడుగలకు ఇస్తూ కిరాయిను వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ స్థలంలో ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చారన్నారు. వీరికి ఇందిరమ్మ కాలనీలో స్థలం కేటాయిస్తామని చెప్పామన్నారు. ప్రభుత్వ స్థలంలో మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, వేంపల్లె రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిని పంచాయతీ సిబ్బంది కూల్చి వేశారు. ఆ సమయంలో ఆ ఇంటికి చెందిన వ్యక్తి అక్కడ లేకపోడంతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. ఇంట్లో ఉన్న సామాన్లు నోట్ చేసి బయటకు తరలించారు.