నగర పంచాయతీల్లో పన్నుల మోత! | Much taxes increased location panchayat | Sakshi
Sakshi News home page

నగర పంచాయతీల్లో పన్నుల మోత!

Published Wed, Jul 16 2014 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

Much taxes increased  location panchayat

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కొత్త ప్రభుత్వం మార్గాలు అన్వేషిస్తోంది. వీటి పరిధిలో ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల మోత  మోగించాలని నిర్ణయించింది. ఆయా పురపాలక సంఘాల్లో అభివృద్ధికయ్యే నిధులను స్థానికంగా సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో పన్నుల వడ్డనకు ప్రతిపాద నలు రూపొందిస్తోంది. దీంతో జిల్లాలో కొత్తగా ఏర్పడిన బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీల ప్రజలపై పన్నుల భారం పడనుంది.

ఆస్తిపన్ను, బెటర్‌మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను సహా పలు కేటగిరీల టాక్సులపై ప్రతిపాదనలు పంపాలని నగర పంచాయతీల కమిషనర్లకు రాష్ట్ర పురపాలకశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పన్నుల పెంపుపై పురపాలికల యంత్రాంగం తర్జనభర్జనలు పడుతోంది.  నాలుగు నగర పంచాయతీల పరిధిలో సాలీనా రూ.10 కోట్ల ఆదాయం రాకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం.. పన్ను అసెస్‌మెంట్ పరిధిలోకి రాని కట్టడాలపై దృష్టి సారించాలని ఆదేశించింది.

 భారమే..
 ఇప్పటివరకు గ్రామ పంచాయతీలుగా ఉండి... ఇటీవల నగర పంచాయతీలుగా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజలపై
 వివిధ రకాల పన్నుల  మోత మోగనుంది. కేవలం ఒకట్రెండు పన్నులు చెల్లింపుతో మమ అనిపించే స్థానికులు ఇకపై అనేక రూపాల్లో పన్నులు చెల్లించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను, బెటర్‌మెంట్, అభివృద్ధి, వాణిజ్య ప్రకటనలు, వినోద పన్ను తదితరాల మదింపుపై పురపాలక సంఘాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే చాలా పంచాయతీల్లో ఆస్తిపన్ను వసూలు కావడంలేదు.

 ఈ నేపథ్యంలో అన్ అసెస్డ్ ప్రాపర్టీలను గుర్తించడం ద్వారా రాబడి పెంచుకునే దిశగా ఆలోచన చేస్తున్నాయి. అంతే కాకుండా పన్నుల నిర్ధారణలో హేతుబద్ధత పాటించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించిన క్రమంలో... ప్రతి ఇంటి నీ సర్వే చేయాలని నిర్ణయించింది. పంచాయతీలతో పోలిస్తే నివాస గృహాలపై ఆస్తిపన్ను భారం రెట్టింపు కానుంది. అదేసమయంలో వాణిజ్య భవనాల టాక్సులు గణనీయంగా పెరిగే అవకాశముంది. పంచాయతీలతో పోలిస్తే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు అడ్డగోలుగా పెరిగాయని ఆందోళనతో ఉన్న స్థానికులకు తాజా ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా, పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణకు పన్నుల పెంపే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement