టీడీపీకి తలపోటు
సాక్షి, గుంటూరు: ఇల్లు అలకగానే పండగ కాదు...ముందుంది ముసళ్ల పండగ అన్న చందంగా మారింది ప్రస్తుతం టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగైదు మున్సిపాలిటీలు మినహా మిగిలిన చోట్ల టీడీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయకుండా నలుగురైదుగురు ద్వితీయ శ్రేణి నాయకులకు ఆశచూపి ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు చేయించారు.
అప్పట్లో టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఎవ్వరికి లేదు. చైర్మన్ అభ్యర్థిగా భారీగా ఖర్చు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఏంచేయాలో పాలుపోని టీడీపీ నియోజకవర్గ బాధ్యులు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను కౌన్సిలర్ అభ్యర్థులుగా నిలిపి తమ జేబుకు చిల్లుపడకుండా చూసుకున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుని తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. పార్టీ అధికారంలోకి రావడంతో పదవులను ఆశించిన నేతలు ఎవరూ పట్టువిడవక పోవడంతో సమస్యమరింత జఠిలమయింది.
= ముఖ్యంగా మంగళగిరి, బాపట్ల, వినుకొండ మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది.
= బాపట్ల మున్సిపల్ చైర్మన్ పదవికి ఐదుగురు కౌన్సిలర్లు పోటీలో ఉన్నారు. తమకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్‌లను తమ వెంట తిప్పుకుంటూ తమకు పదవి కేటాయించకపోతే ఎంతకైనా తెగిస్తామంటూ పరోక్షంగా పార్టీ నేతలకు హెచ్చరికలు పంపుతున్నారు.
= మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవిని ఎన్నికల ముందే ముగ్గురు పంచుకున్నారు. వీరిలో శ్రీదేవి మొదటి దఫా పదవి చేపట్టేలా ఒప్పందం చేసుకున్నప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి.
= వినుకొండ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎన్నికల ముందు మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించారు. తీరా మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కన్ను చైర్మన్‌గిరిపై పడింది. చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించాలంటూ పట్టుబట్టడంతో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసేది లేక లాటరీ ద్వారా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
= మంగళగిరి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గంజి చిరంజీవి పేరు ఖరారైనప్పటికీ మరో ఇద్దరు కౌన్సిలర్‌లు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. చిరంజీవికి ఎమ్మెల్యే సీటు కేటాయించి, ఓటమి పాలైన వెంటనే మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెడితే పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటం టూ మహిళా సీనియర్ కౌన్సిలర్ ఒకరు జిల్లా టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
= ఇదిలా ఉంటే వైస్ చైర్మన్ పదవికి సైతం తీవ్ర పోటీ నెలకొనడంతో టీడీపీ నేతలు ఒత్తిడికి గురవుతున్నారు.
= తమకు పదవులు ఇవ్వకపోతే ఎన్నికల్లో పెట్టిన డబ్బును తిరిగి ఇప్పించాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురౌతాయంటూ హెచ్చరిస్తున్నట్టు సమాచారం.