ఐక్యత చాటుతున్న సీపీఎం, సీపీఐ, పలు సంఘాల నేతలు
సాక్షి, అమరావతి / మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన సీఎం చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని, ఆ నాలుగేళ్ల పాపాలు ఎవరు కడుగుతారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన ద్రోహంలో బీజేపీతోపాటు టీడీపీకి వాటా ఉందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు నిప్పులు చెరిగారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం రాజకీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో సీపీఐ, సీపీఎంల జాతీయ, రాష్ట్ర నేతలు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ డి.రాజా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపైనా, దేశంలోని ఆదివాసీ, రైతులు, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో పాలిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ నాలుగేళ్లపాటు బీజేపీ కాళ్లు పిసికిన చంద్రబాబు ఇప్పుడు అవే కాళ్లు పట్టుకుని లాగుతానంటే ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో అవినీతి పెచ్చుమీరిందనే విషయం ఏసీబీ దాడుల్లో తేటతెల్లమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రూ.2,620 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుబారా చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటమి ఏర్పాటు అవసరమని మధు రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు.
కాగా, ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో ప్రజా రంగాల వారీగా సమస్యలపై రాష్ట్ర సదస్సులు నిర్వహించనున్నారు. జూలై 22న మూడు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన కడపలో రాయలసీమ, శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర, ఒంగోలులో ప్రకాశం జిల్లా సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఆగస్టులో మండల స్థాయి పాదయాత్రలు నిర్వహించి సమస్యలను గుర్తించి వాటిపై మండల కేంద్రాల వద్ద ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహిస్తారు. ఆగష్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర స్థాయి బస్సు యాత్రల్లో రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రజలను కలుస్తారు. సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి మహార్యాలీ నిర్వహించాలని సదస్సు తీర్మానించింది. కాగా సదస్సును కవర్ చేయడానికి వచ్చిన ఓ టీవీ చానల్‌కు చెందిన ఓబీ వ్యాన్ డ్రైవర్ ప్రవీణ్ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment