సాక్షి, విజయవాడ : కొద్ది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలకు వెళ్లడం ఖాయమని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలకుడు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2019లో బీజీపీని ఓడించడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు.
ప్రతి శాఖలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతొందని తెలిపారు. నీరు చెట్టు కార్యక్రమంలో ఇంజనీర్లు 19 శాతం, కార్యకర్తలు 50 శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు ప్రాజెక్టు బాగుందని డప్పు కొట్టుకుంటుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని దిగజార్చి మరి పోస్టింగ్‌లలో డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, విభజన హామిలు అమలుకాకపోవడానికి వెంకయ్యనాయుడు, చంద్రబాబే కారణమని ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం పోవాలని, ప్రజానుకూల పాలన అందించే ప్రభుత్వం రావాలని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మంగళవారం విజయవాడలో జరగబోయే సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
వామపక్ష పార్టీలు విడిపోవడం వల్ల కమ్యునిస్టు ఉద్యమాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. వామపక్ష పార్టీలన్ని ఏకం కావాలని మేధావులంతా చర్చిస్తున్నారని తెలిపారు. 9న జరగబోయే వామపక్షాల సమావేశంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడ్తాం అన్నారు. ధర్మ దీక్ష పేరిట చంద్రబాబు చేసిన దీక్ష ఒక హైటెక్ దీక్ష అని ఎద్దేవా చేశారు. తమకు సలహాలిచ్చే చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్షలు చేయ్యట్లేదని ప్రశ్నించారు. ఆయన చేసిన పాపాలకు ప్రాయిశ్చిత్తం చేసుకోవడానికి తప్ప వాటి వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment