జిల్లా టీడీపీలో చాపకింద నీరులా ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలో తమకు జరుగుతున్న అన్యాయంపై పలువురు నేతలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఎంపీ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుపై మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ధ్వజమెత్తిన ఘటనలు మరువకముందే ఆదివారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోనూ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.
* పాఠశాల భవనం ప్రారంభోత్సవం సాక్షిగా భగ్గుమన్న విభేదాలు
* పనిగట్టుకుని అవమానిస్తున్నారని ఆవేదన
* పదవికి రాజీనామా చేస్తానని మునిసిపల్ వైస్ చైర్మన్ ఆగ్రహం
* మంత్రి, ఎంపీల ఎదుటే చైర్మన్‌పై విమర్శనాస్త్రాలు
మచిలీపట్నం : బందరు టీడీపీలో ముసలం ప్రారంభమైంది. గత ఆరునెలలుగా పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు జార్జి కార్నేషన్ హైస్కూల్ అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం వేదికగా బయటపడ్డాయి. తన సామాజిక వర్గాన్ని కావాలనే అవమానిస్తున్నారంటూ బందరు మున్సిపల్ వైస్‌చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం ఆవేదన వెళ్లగక్కారు.
బందరు టీడీపీలో జరుగుతున్న వ్యవహారాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా మున్సిపల్ వైస్‌చైర్మన్ సామాజిక వర్గానికి చెందినవారు చైర్మన్, మంత్రి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. తమ సామాజిక వర్గానికి వైస్‌చైర్మన్ పదవి ఇచ్చినట్లే ఇచ్చి తెర వెనుక కథ నడుపుతూ అవమానాల పాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఆదివారం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ, చైర్మన్‌ల సమక్షంలోనే చైర్మన్ తీరుపై వైస్‌చైర్మన్ తనదైన శైలిలో విరుచుకుపడటం టీడీపీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది.
పదవికి రాజీనామా చేసేస్తా...
ఎంపీ నిధులతో నిర్మించిన జార్జి కార్నేషన్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఏర్పాటుచేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్న సమయంలో ఆవేశంగా వేదిక ముందుకు వచ్చిన మునిసిపల్ వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం.. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని, ఆహ్వాన పత్రికలో తన పేరు ముద్రించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ‘1983 నుంచి టీడీపీ జెండాను భుజాన మోస్తూ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇంతకాలంగా పార్టీలో ఉన్నానని వైస్‌చైర్మన్ పదవి ఇచ్చారు. అయినా నాకు సరైన గౌరవం ఇవ్వడం లేదు.
పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టడంతో పాటు కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికి మూడుసార్లు వైస్ చైర్మన్ హోదాలో ఉన్న నన్ను అవమానించారు’ అంటూ మండిపడ్డారు. ‘పక్కా వ్యూహంతో వైస్‌చైర్మన్ హోదాలో ఉన్న నన్ను, నా సామాజిక వర్గాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి పదవులూ లేనివారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, నా సామాజిక వర్గంలోనే నాకు విలువ లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. నా వద్దకు వస్తే ఏ పనులూ జరగవనే ప్రచారం చేస్తున్నారు. ఈ పదవి నాకు అక్కర్లేదు. రాజీనామా చేసేస్తాను. నాకు అనుకూలంగా ఉండే కౌన్సిలర్లు కూడా రాజీనామా చేస్తారు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
ఎవ్వరూ వెళ్లక్కర్లేదు : కొల్లు
ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్‌ను సముదాయించేందుకు వేదికపై ఉన్నవారు లేచి వస్తుండగా మీరు ఎవ్వరూ వెళ్లనవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, మరికొందరు కౌన్సిలర్లు, జార్జి కార్నేషన్ పాఠశాల పాలకవర్గ సభ్యుడు డాక్టర్ ధన్వంతరీ ఆచార్య తదితరులు వేదిక దిగి వచ్చారు. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగవని, పూర్తి హామీ తనదేనని కాశీవిశ్వనాథంను సముదాయించిన కొనకళ్ల బుల్లయ్య.. జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పారు. అనంతరం వారితో పాటే వైస్ చైర్మన్‌ను వేదికపైకి తీసుకువెళ్లారు.
మైక్ అందుకుని.. మరోసారి..
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడటం పూర్తయిన వెంటనే మైక్ అందుకున్న వైస్ చైర్మన్ మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించని విషయాన్ని మునిసిపల్ చైర్మన్‌తో పాటు పాఠశాల కమిటీ సభ్యులకు ఒకరోజు ముందే తాను చెప్పానని, అయినా ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం నాటినుంచీ చైర్మన్ తనను పక్కన పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ అక్కసుతోనే తనను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు వైస్ చైర్మన్ హోదాలో ఉన్న తనను పక్కన పెట్టేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తుదిశ్వాస విడిచేవరకు టీడీపీలోనే ఉంటానని గద్గద స్వరంతో అన్నారు. పురపాలక సంఘంలో ప్రతిపక్ష నాయకుడు అచ్చాబాకు ఇచ్చే గౌరవం కూడా తనకు ఇవ్వడం లేదని ఆరోపించారు.
తెలుసుకుని మాట్లాడాలి : చైర్మన్
వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం మాట్లాడిన వెంటనే మైక్ అందుకున్న చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ ఇది ప్రైవేటు కార్యక్రమమని, ఎవరిని పిలవాలో.. ఆహ్వానించాలో కమిటీ సభ్యులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇష్టం వచ్చిన వారిని, ఇష్టం లేని వారిని ఆహ్వానించరని, ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ అన్ని వివరాలు తెలుసుకుని తనపై ఆరోపణలు చేయాలన్నారు. చైర్మన్, వైస్‌చైర్మన్ వేదికపైనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సభికులను విస్మయానికి గురిచేసింది.
టీడీపీ కౌన్సిలర్లలో అంతర్మథనం...
పురపాలక సంఘంలో 29 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ తనదైన శైలిలో వ్యవహరిస్తుండటంతో ఎవరికివారే లోలోపల మధనపడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. ఏదైనా పనిపై చైర్మన్ వద్దకు వెళితే బిగ్గరగా మాట్లాడటం, విషయం ఒకటి అడిగితే మరొకటి సమాధానం చెప్పి దాటవేత ధోరణితో వ్యవహరిస్తుండటంతో టీడీపీ కౌన్సిలర్లు కొంతకాలంగా ఆవేదనకు గురవుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పుకొంటున్నారు.
మోటమర్రి బాబాప్రసాద్ రెండున్నర సంవత్సరాలు మాత్రమే చైర్మన్ పదవిలో ఉంటారని, మిగిలిన రెండున్నర సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇస్తామనే ఒప్పందం జరిగిందని ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా సహచర కౌన్సిలర్ల పైనే చైర్మన్ చిరాకు పడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు బాహాటంగానే చెప్పుకోవడం గమనార్హం.
చైర్మన్ చేసే అవినీతి కార్యకలాపాలు బయటపడకుండా ప్రతిపక్ష పార్టీకి చెందిన కౌన్సిలర్లకు పనులు అప్పగించి వారిని మాట్లాడకుండా చేసి సొంత పార్టీ కౌన్సిలర్లను పక్కన పెట్టేస్తున్నారని పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు వ్యాఖ్యానించడం గమనార్హం. చైర్మన్ వ్యవహారశైలి నచ్చని మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ కౌన్సిలర్లే చెబుతున్నారు. పురపాలక సంఘంలో చైర్మన్ వ్యవహారశైలిని బందరు ఎంపీ సోదరుడు కొనకళ్ల బుల్లయ్య.. మంత్రికి ఒకటికి పదిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు చెప్పుకోవడం గమనార్హం.
బందరు టీడీపీలో ముసలం
Published Mon, Dec 29 2014 4:14 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement
Advertisement