సాక్షి, రంగారెడ్డి జిల్లా: సుదీర్ఘ విరామానంతరం పురపాలక సంఘాలు కొత్త కళ సంతరించుకోనున్నాయి. 2010లో పురపాలక సంఘాల పాలకవర్గాల గడువు ముగిసింది. ఆ వెనువెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అప్పటి ప్రభుత్వం మాత్రం దాటవేసింది. దీంతో పురపాలక సంఘాలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాయి. ఇటీవల వీటికి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఐదింటికి కొత్త సారథులు
జిల్లాలో తాండూరు, వికారాబాద్ పురపాలక సంఘాలున్నాయి. కొత్తగా ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్, బడంగ్‌పేట్‌లు నగర పంచాయతీలుగా ఆవిర్భవించాయి. వీటికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీటి ఫలితాల ప్రక్రియ వాయిదా పడింది. పురపాలక సంఘాల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాతే వీటి ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎక్స్‌అఫీషియో సభ్యుల ప్రమాణం పూర్తయిన నేపథ్యంలో చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమమైంది. గురువారం ఉదయం జిల్లాలోని ఐదు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
ఉత్కంఠభరితం
పురపాలక ఎన్నికలు ముగిసి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో స్పష్టత లేని మెజార్టీ ఉన్న సంఘాల్లో కొత్త సమీకరణలకు తెరలేచింది. ఇబ్రహీంపట్నం, పెద్డ అంబర్‌పేట్ నగర పంచాయతీల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మెజార్టీ ఉంది. అదేవిధంగా వికారాబాద్, బడంగ్‌పేట కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. తాండూరులో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అన్ని పార్టీలూ చైర్మన్ పీఠంపై గురిపెట్టాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఎలాగైనా కుర్చీ దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా.. 10 స్థానాలు సాధించిన ఎంఐఎం సైతం తీవ్రంగా పోటీ పడుతోంది. మరెవైపు కాంగ్రెస్ పార్టీ సైతం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఆఖరి నిమిషంలో పురపోరు రసవత్తరంగా మారింది.
పుర కిరీటధారులెవరో!
Published Thu, Jul 3 2014 12:20 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement