ఇందూరు : జిల్లా పరిషత్ చె ర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక శనివారం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జడ్పీ అధికారులు శుక్రవారమే పూర్తి చేసి సమావేశ మందిరాన్ని సిద్ధంగా ఉంచారు. పాత కుర్చీలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. కుర్చీలకు పట్టిన దుమ్మును మెషిన్ ద్వారా తొలగించారు. సమావేశ మందిరంలో జడ్పీటీసీ అభ్యర్థులు కూర్చున్న చోటికి ఎవరూ చొరబడిరాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. విలేకరులకు, అధికారులకు ప్రత్యేక విభాగాలను కేటాయించారు.
జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఉదయం 10 గంటల వరకు నామినేషన్‌ల స్వీకరణ, 11 గంటలకు పరిశీలన ఉంటుంది. ఒంటి గంట వరకు జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నికకు నామినేషన్‌లు, పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక ఉంటుంది. జడ్పీ ప్రిసైడింగ్ అధికారిగా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తారు. ఈ ఎన్నిక తర్వాత జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు.
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. జడ్పీ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఇటు పాలకవర్గం కొలువుదీరిన వెంటనే సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో మొదటి జడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది.
జడ్పీ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
Published Sat, Jul 5 2014 1:43 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement